పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కారు జిల్లా రైతులకు మొండి చేయి చూపింది. రాష్ట్రవ్యాప్తంగా 91 సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, జిల్లాకు మాత్రం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. దీంతో సుమారు 50 వేల ఎకరాలలో పత్తిని సాగు చేస్తున్న జిల్లా రైతాంగం ప్రయోజనాలను గాలికొదిలేసినట్లయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, నిజామాబాద్:
జిల్లాలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం తదితర మండలాలలో రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తుంటారు. ఇక్కడి రైతులకు ఖరీఫ్‌లో పత్తి ప్రధాన పంట. తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ఈ పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. చేతి కందిన పంటను విక్రయించడానికి అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. సీసీఐ కొనుగోలు
కేంద్రం అందుబాటులో లేకపోవడంతో వారు ప్రైవే టు వ్యాపారులను ఆశ్రయి ంచక తప్పడం లేదు. దీన్ని ఆసరగా చేసుకుని వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉందని, స్టేఫుల్‌లెంత్ (నాణ్యత) తక్కువగా ఉం దంటూ ధర తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఎందుకు ఇలా
ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో ఉంటే వ్యాపారుల దోపిడీకి చెక్ పడే అవకాశాలుంటాయి. పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు 18, కరీంనగర్, నల్గొండకు 12 చొప్పున, మెదక్‌లో ఐదు, వరంగల్‌లో 11 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకోగానీ నిజామాబాద్ జిల్లాను మాత్రం విస్మరించింది. ఒక్క కేంద్రాన్ని కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం మద్నూర్ మార్కెట్ యార్డులో పత్తి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. గురువారం ఈ మార్కెట్‌కు 875 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా, క్వింటాళుకు రూ. 4365 నుంచి రూ.4430 వరకు ధర పలికింది. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ. 4,000గా ప్రకటించింది. ప్రస్తుతానికి ధర నిలకడగా ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రం మంజూరు కాకపోవడంతో వ్యాపారులు రానున్న రోజుల్లో ధర తగ్గించే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం రైతులకు అందుబాటులో ఉంటే స్థానిక వ్యాపారులు జిమ్మిక్కులకు పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర తగ్గితే రైతులు పత్తిని పక్క జిల్లాలకు తీసుకెళ్లి విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
నాఫెడ్ కొనుగోళ్లు నామమాత్రమే
గత ఏడాది సీజనులో కూడా ప్రభుత్వం జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. నాఫెడ్ ద్వారా పత్తిని కొనుగోళ్లు చేస్తామని ప్రకటించింది. కేవలం వారం పది రోజులలోనే ఈ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో రైతులు చేసేదేమీ లేక వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సి వచ్చింది. ఈసారి కూడా కొనుగోలు కేంద్రం మంజూరు కాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతానికి కనీస మద్దతు ధర అందుతోందని, అలా అందని పక్షంలో నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఇలా అయితే ఎలా?
Published Fri, Dec 13 2013 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement