రైతుకు కష్టం
కంచికచర్ల మార్కెట్ యార్డులో తడిసిన 2 వేల క్వింటాళ్ల పత్తి
ఈ ఏడాది అసలే తగ్గిన దిగుబడిపెరిగిన సాగు వ్యయం
తడిసిన పత్తి రంగు మారుతుందని ఆందోళనలో రైతులు
కంచికచర్ల : అకాల వర్షంతో పత్తి రైతుకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని ఎన్నో ఆశలతో సీసీఐ కొనుగోలు కేంద్రానికి తరలిస్తే.. మంగళవారం రాత్రి ఊహించనివిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులోని పత్తి బోరాలు తడిసిపోయాయి. పత్తి బోరాల రక్షణకు ఏఎంసీ అధికారులు కొంతమంది రైతులకు మాత్రం నామమాత్రంగా పరదాలు ఇచ్చారు. అసలే ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల పత్తి పంటకు ఆశించినంత దిగుబడి రాలేదు. పత్తి సాగుకు అధిక వ్యయం కావడంతో అప్పు చేసి మరీ సాగుచేసిన రైతులు వాటినుంచి బయటపడేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రానికి అమ్మకం కోసం పత్తి బోరాలను తీసుకొచ్చారు. 24.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురవడంతో అవి పూర్తిగా తడిసిపోయాయి.
తడిసిన 1500 పత్తి బోరాలు...
సుమారు 1500 పత్తి బోరాలు ఈ వర్షానికి తడిసిపోయాయి. తడిసిన పత్తి రెండు వేల క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపునీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోవడంతో పత్తి బోరాలు నీటిలోనే నానుతున్నాయి. రాత్రివేళ వర్షం కురవడంతో పత్తిని రక్షించుకునేందుకు కూడా రైతులకు అవకాశం లేకుండా పోయింది.
మార్కెట్ యార్డు వైఫల్యంతోనే...
పత్తిని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కనీస వసతులు కల్పించలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో పత్తిని కాపాడుకునేందుకు రైతులకు పరదాలు అందజేయాల్సిన బాధ్యత ఏఎంసీదేనని చెబుతున్నారు. కొద్దిమందికి మాత్రమే పరదాలు అందజేయడంతో మిగిలిన పత్తి బోరాలన్నీ తడిసిపోయానని పేర్కొంటున్నారు.
గిట్టుబాటు ధర దక్కేనా?
కాటన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం 8 శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే రూ.4,050 మద్దతు ధర లభిస్తుంది. గరిష్టంగా తేమ 12 శాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. తేమ శాతాన్ని అనుసరించి పత్తి ధరలో క్వింటాలుకు రూ.40 చొప్పున కోత విధిస్తారు. వర్షానికి తడిసిన పత్తి పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉందని రైతులు పేర్కొంటున్నారు. పత్తిని ఆరబెట్టాలని అధికారులు సూచిస్తున్నారని, ఆరబెట్టిన పత్తి రంగుమారే అవకాశమున్నందున గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికొచ్చి.. అమ్ముకునే దశలో ఈ పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అసలే మార్కెట్‌లో పత్తికి సరైన మద్దతు ధర ప్రభుత్వం నుంచి రావడం లేదని, కేవలం రూ.4,050 మద్దతు ధర ప్రకటించిందని చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడి తగ్గి సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో రూ.6 వేలు మద్దతు ధర ప్రకటిస్తే తమకు గిట్టుబాటయ్యేదని రైతులు అంటున్నారు. కనీసం పంట సాగుకైనా చేసిన అప్పులు తీరుతాయని అమ్ముదామని భావిస్తే వర్షం తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని వాపోతున్నారు.
కల్లాల్లోనే తడిసిన మొక్కజొన్న విత్తనాలు
నందిగామ రూరల్ : నందిగామ ప్రాంతంలోనూ మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లోని మొక్కజొన్న విత్తనాలతో పాటు తీతలకు సిద్ధమైన పత్తి తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.