అకాల వర్షంతో అన్నదాత కుదేలు
కరీంనగర్, న్యూస్‌లైన్: అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని కలిగించింది. మార్కెట్ యార్డుల్లోకి తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించిన పంటకు ప్రతిఫలం వస్తుందనుకున్న సమయంలోనే ప్రకృతి కన్నెర్రజేయడంతో రైతుకు తీరని శోకం మిగిలి, మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితి ఎదురైంది.
జగిత్యాల డివిజన్‌లోని సారంగపూర్, రాయికల్, మేడిపల్లి, పెగడపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. రేపోమాపో వరికోతలు మొదలు పెడదామనుకున్న వరి ఈదురు గాలులతో కూడి వర్షానికి నేలవాలిపోయింది. సోమవారం కూడా కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో అపార నష్టం తలెత్తింది. గతంలో నష్టపోయిన పంటలకు పరిహారం రాక ఎదురు చూస్తున్న రైతులు ఈసారైనా సర్కారు ఆదుకుంటుందోలేదోనని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వానికి నివేదిక
జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షానికి 320 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాల జిల్లా అధికారి ప్రసాద్ తెలిపారు. జగిత్యాల మండలంలో 160 హెక్టార్లలో వరి, 20 హెక్టార్లలో నువ్వులు, మేడిపల్లి మండలంలో 120 హెక్టార్లలో వరి, 20 హెక్టార్లలో నువ్వుల పంటకు నష్టం జరిగిందన్నారు. తుది నివేదిక రాగానే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. పంట నష్టం 50 శాతం దాటిన చోట రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే జరుపుతామని చెప్పారు.