district officer
-
సేవలు మెరుగుపరుస్తాం
► 14 మందితో టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటు ► జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి రాజాం రూరల్: జిల్లాలో అగ్నిమాపకశాఖ సేవలు మరింత మెరుగుపరుస్తామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి యం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రాజాం అగ్నిమాపక స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖకు చెందిన 14 మంది యువకులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి వైఫరీత్యాలు ఎదుర్కోవడం, అధునాతన యంత్రాలు, పరిజ్ఞానం ఉపయోగించడంలో వీరికి శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు వీరు సేవలందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రమాదాలు సంభవించినప్పుడు కరెంటు లేకుండా పనిచేసే ఆఫ్కాలైట్లు ఆరు, ఫైర్బోర్డులు4, మిస్ట్ వెహికల్1, మిస్టిబుల్లెట్లు2 అందుబాటులో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై చైతన్యం చేస్తామన్నారు. గ్రామాల్లో నీటివనరులు అందుబాటు, పూరిపాకలు, ఆవాసప్రాంతాలపై సమగ్రంగా వివరాలు సేకరిస్తామని చెప్పారు. రూ. 60 లక్షలతో పాలకొండలో నూతన భవనం నిర్మించామని, రూ. 35 లక్షలతో శ్రీకాకుళం ఫైర్స్టేషన్లో ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపడతామన్నారు. ఆయనతో పాటు రాజాం ఎస్ఐ పక్కి చంద్రమౌళి ఉన్నారు. -
అకాల వర్షంతో అన్నదాత కుదేలు
కరీంనగర్, న్యూస్‌లైన్: అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని కలిగించింది. మార్కెట్ యార్డుల్లోకి తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించిన పంటకు ప్రతిఫలం వస్తుందనుకున్న సమయంలోనే ప్రకృతి కన్నెర్రజేయడంతో రైతుకు తీరని శోకం మిగిలి, మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితి ఎదురైంది. జగిత్యాల డివిజన్లోని సారంగపూర్, రాయికల్, మేడిపల్లి, పెగడపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. రేపోమాపో వరికోతలు మొదలు పెడదామనుకున్న వరి ఈదురు గాలులతో కూడి వర్షానికి నేలవాలిపోయింది. సోమవారం కూడా కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో అపార నష్టం తలెత్తింది. గతంలో నష్టపోయిన పంటలకు పరిహారం రాక ఎదురు చూస్తున్న రైతులు ఈసారైనా సర్కారు ఆదుకుంటుందోలేదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి నివేదిక జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షానికి 320 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాల జిల్లా అధికారి ప్రసాద్ తెలిపారు. జగిత్యాల మండలంలో 160 హెక్టార్లలో వరి, 20 హెక్టార్లలో నువ్వులు, మేడిపల్లి మండలంలో 120 హెక్టార్లలో వరి, 20 హెక్టార్లలో నువ్వుల పంటకు నష్టం జరిగిందన్నారు. తుది నివేదిక రాగానే ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. పంట నష్టం 50 శాతం దాటిన చోట రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే జరుపుతామని చెప్పారు.