సేవలు మెరుగుపరుస్తాం
► 14 మందితో టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటు
► జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి
రాజాం రూరల్: జిల్లాలో అగ్నిమాపకశాఖ సేవలు మరింత మెరుగుపరుస్తామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి యం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రాజాం అగ్నిమాపక స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖకు చెందిన 14 మంది యువకులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి వైఫరీత్యాలు ఎదుర్కోవడం, అధునాతన యంత్రాలు, పరిజ్ఞానం ఉపయోగించడంలో వీరికి శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు వీరు సేవలందిస్తారని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రమాదాలు సంభవించినప్పుడు కరెంటు లేకుండా పనిచేసే ఆఫ్కాలైట్లు ఆరు, ఫైర్‌బోర్డులు4, మిస్ట్ వెహికల్1, మిస్టిబుల్లెట్లు2 అందుబాటులో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై చైతన్యం చేస్తామన్నారు. గ్రామాల్లో నీటివనరులు అందుబాటు, పూరిపాకలు, ఆవాసప్రాంతాలపై సమగ్రంగా వివరాలు సేకరిస్తామని చెప్పారు. రూ. 60 లక్షలతో పాలకొండలో నూతన భవనం నిర్మించామని, రూ. 35 లక్షలతో శ్రీకాకుళం ఫైర్‌స్టేషన్‌లో ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపడతామన్నారు. ఆయనతో పాటు రాజాం ఎస్‌ఐ పక్కి చంద్రమౌళి ఉన్నారు.