పత్తి రైతుకు విత్తనం దెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశం అనంతరం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించినా ఇప్పటి వరకు పత్తి విత్తనాలు సరఫరా కాలేదు. ప్రభుత్వం ధర నిర్ణయించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు సంఘాలు ఆరోపిస్తు న్నాయి. ధరపై స్పష్టత ఇవ్వకపోవడంతో బీటీ పత్తి విత్తనాలు తయారు చేసిన కంపెనీలు విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయలేదు. మే ఆఖరు నుంచి జూన్ రెండో వారం దాకా ఎప్పుడైనా కురిసే తొలకరి వర్షాలకు విత్తేది పత్తి విత్తనాలనే.
ఈ నేపథ్యంలో ధరలపై స్పష్టత ఇవ్వకపోవడం, సంబంధిత జీవో జారీ కాపోవడం వల్ల నకిలీ విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో పత్తి సాగే అధికం...
రాష్ట్రంలో పత్తి సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాతే వరిని సాగు చేస్తారు. ఈ ఏడాది సుమారు 44.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇంత భారీగా సాగు చేసే పంటకు పత్తి విత్తనాలన్నింటినీ నూటికి నూరు శాతం ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తాయి. ప్రభుత్వం ధర నిర్ణయించడంలో ఆలస్యమవుతున్న నేపథ్యంలో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరను నిర్ణయించి రైతులను దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. సాధారణంగా ప్రతీ ఏడాది మార్చి నెలలోనే పత్తి విత్తనాల ధర నిర్ణయం చేస్తారు.
గత ఫిబ్రవరి 4న జరిగిన సమావేశంలో పత్తి విత్తన ధరను పెంచాలని కంపెనీలు కోరాయి. బీటీ కాటన్ విత్తనాన్ని సరఫరా చేసేందుకు మోనొశాంటో కంపెనీకి రూ. 90 రాయల్టీని ప్రభుత్వం నిర్ణయించగా... ఆ కంపెనీ మాత్రం తమ నుంచి రూ. 185 వరకు వసూలు చేస్తున్నం దున ధర పెంచాలని ఆ సమావేశంలో స్థానిక పత్తి విత్తన కంపెనీలు కోరాయి. అయితే ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. మరోవైపు మోనొశాంటో కంపెనీ రాయల్టీ పెంచాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిందని... ఈ కేసును వెంటనే వాపసు తీసుకుంటే ధరల పెంపుదల అంశాన్ని పరిశీలిస్తామని అప్పట్లో వ్యవసాయశాఖ సూచించింది. ఇలా అనిశ్చితి ఉండటంతో కొన్ని కంపెనీలు పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేయలేదని తెలిసింది. ఇప్పటికిప్పుడు ధరపై నిర్ణయం తీసుకున్నా ప్యాకింగ్ చేయడానికి.. వాటిపై కనీస విక్రయ ధరను ముద్రించడానికి సమయం పడుతుంది.
పాత ధరే ఉంటుంది
పత్తి విత్తనాల ధర పెంచేది లేదు. పాత ధర ప్రకారమే విత్తనాలు సరఫరా చేస్తాం. ఈ విషయాన్ని కంపెనీలకు ఇప్పటికే స్పష్టంచేశాం. కొన్ని కంపెనీలు జిల్లాలకు సరఫరా చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాం. ఎవరైనా సరఫరా చేయకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తాం.
-ప్రియదర్శిని, వ్యవసాయశాఖ డెరైక్టర్