జోరుగా సాగు
♦ వరుణుడి కరుణతో రైతుల్లో ఆనందం
♦ ఖరీఫ్ సాధారణ సాగు : 2,17,303 హెక్టార్లు
♦ ఇప్పటివరకు సాగులోకి వచ్చిన విస్తీర్ణం : 80,350
♦ జూన్‌లో సాధారణ వర్షపాతం : 10.39 సెంటీమీటర్లు
♦ నమోదైన వర్షపాతం : 13.65 సెంటీమీటర్లు
ఖరీఫ్ సీజన్ వడివడిగా సాగుతోంది. గత నెల మొదటివారంలో వరుణుడు కాస్త ముఖం చాటేయడంతో సాగుపనులు సన్నగిల్లగా.. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరుసగా అనావృష్టి ధాటికి కుదేలైన రైతుకు తాజా వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతుండడంతో సాగు విస్తీర్ణం సైతం వేగంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 2,17,303 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈక్రమంలో ఇప్పటివరకు 80,350 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పది రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండడంతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండే పశ్చిమ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జూన్ నెలలో జిల్లాలో 10.39 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంతో జిల్లా సగటును అధిగమించి ఎక్కువ శాతం కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో నెలాఖరు నాటికి 13.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
అధికంగా కంది, మొక్కజొన్న సాగు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో కంది, మొక్కజొన్న పంటల విస్తీర్ణం జోరందుకుంది. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఈ రెండు పంటల విత్తనాలు వేసేందుకు మొగ్గుచూపారు. మరోవైపు పత్తి పంటకు గిట్టుబాటు కాదని వ్యవసాయ శాఖ స్పష్టం చేయడంతో ఆ పంటవైపు రైతులు పెద్దగా దృష్టి సారించలేదు. జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా మొక్కజొన్న 27,550 హెక్టార్లలో సాగవ్వగా.. కంది పంట 23,491 హెక్టార్లలో సాగైంది. ఆ తర్వాత పత్తి 11,552 హెక్టార్లు, పెసలు, మినుమ పంటలు సాగవుతున్నాయి. ఇప్పుడిప్పుడు వర్షాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. సీజన్ మొత్తంగా ఇదే తరహాలో వానలు కురిస్తే అదనంగా 20వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని, పంటలు సైతం సమృద్ధిగా పండుతాయని వ్యవసాయ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.