యాలాల, న్యూస్‌లైన్: ఆరుగాలం కుటుంబమంతా కలిసి చెమటోడ్చి నా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు కుప్పలవుతున్నాయి. వాటి ని తీర్చే మార్గం కానరాకపోవడంతో మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని ఎన్కెపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ కిష్టప్ప, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నట్టల చిన్న నర్సప్ప(35)కు స్థానికంగా పదెకరాల పొలం ఉంది.
ఆయన నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేసి మిగతాది బీడుగా ఉంచాడు. పెట్టుబడి కోసం నర్సప్ప తెలిసిన వారి వద్ద రూ.85 వేలు అప్పు చేశాడు. జంటుపల్లిలోని ఆంధ్రా బ్యాంకులో రూ.70 వేలు తీసుకున్నాడు. ఆరుగాలం అంతా కుటుంబంతో కలిసి కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. వరుస తుపానులు పంటను దెబ్బతీశాయి. దీంతో మూడు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. అది కూలీల ఖర్చులకు కూడా సరిపోలేదు. రోజురోజుకు అప్పునకు వడ్డీలు పెరుగుతున్నాయి. రుణం తీర్చే మార్గం కానరావడం లేదని నర్సప్ప ఇటీవల భార్య పద్మమ్మతో వాపోతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈక్రమంలో పొలానికి వెళ్తున్నానని శుక్రవారం ఉదయం ఇంట్లో చెప్పి వెళ్లాడు.
ఉదయం 11గంటల సమయంలో స్థానికులు చూడగా నర్సప్ప తన పొలంలో ఓ చెట్టుకు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి పరిశీలించగా అప్పటికే ప్రా ణం పోవడంతో కుటుంబసభ్యులకు విషయం తెలి పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య పద్మమ్మతో పాటు కొడుకు భానుప్రసాద్, కూతురు భారతి ఉన్నారు.
నర్సప్ప మృతితో కుటుంబీ కులు గుండెలుబాదుకుంటూ రోదించారు. నర్సప్ప ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధినపడిందని గ్రామస్తులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నర్సప్ప మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పత్తి రైతు బలవన్మరణం
Published Fri, Jan 24 2014 11:37 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement