ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రెండు నెలల క్రితం పత్తి కొనుగోళ్లు అట్టహాసంగా ఆరంభించిన సీసీఐ వెయ్యి క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు విక్రయిస్తున్నారు. సీసీఐ అధిక ధర చెల్లిస్తామంటున్నా రైతులు కన్నెత్తి చూడటం లేదు. ప్రధాన కారణం ప్రభుత్వం నిబంధనలు విధించడంతో ప్రైవేట్‌కే విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 30న కొనుగోళ్లు ప్రారంభించారు. రైతులు పట్టాపాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా నంబర్‌తోపాటు వీఆర్‌వో ధ్రువీకరణపత్రం తీసుకురావాలని, 8 శాతం తేమ నిబంధన కారణంగా రైతులు వెనుకంజ వేస్తున్నారు. తీసుకొచ్చిన పత్తిలో నాణ్యత పేరిట కొర్రీలు పెడుతుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టాలు చవిచూస్తున్నారు. రైతులను ఆదుకుంటామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారులు పేర్కొన్నా లాభం లేదు.
17 కేంద్రాల్లో కొనుగోళ్లు నిల్
జిల్లా వ్యాప్తంగా 17 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటిలో సీసీఐ కాంటాలు తెరిచినా పత్తి విక్రయించడానికి రైతులు ముందుకు రావడం లేదు. కాగా, భైంసా మార్కెట్ యార్డులో 473 క్వింటాళ్లు, లక్సెట్టిపేటలో 532 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరి పారు. 1,005 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతేడాది 12 మార్కెట్ యార్డుల ద్వారా డిసెంబర్ నెల చివరి వరకు 12.13 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది వెయ్యి క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదు.
సవాలక్ష నిబంధనలు
సీసీఐ అధికారులు నిబంధన పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నిబంధనలు లేకుండా గతేడాది కొనుగోలు చేసిన విధంగా ఈసారి కూడా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సీసీఐ అధికారులు అలాంటి దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కొనుగోళ్లు జరగక పోవడానికి కారణమని తెలుస్తోంది.
మార్కెట్ యార్డులో ప్రైవేట్ వ్యాపారుల కంటే ప్రతీరోజు పత్తి వేలంలో పది.. ఇరవై రూపాయలు పెంచుతున్నప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు 12 శాతం తేమ వరకు ఎలాంటి కోత విధించకుండా కొనుగోలు చేస్తుండగా సీసీఐ మాత్రం 8 శాతం వరకే ప్రకటించిన ధరను చెల్లిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13.17 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. గతేడాది డిసెంబర్ చివరి వరకు 12,82 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరిగింది. గతేడాది మొత్తం 17 మార్కెట్ యార్డుల్లో 27.36 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగింది. ఈయేడాది ఇప్పటివరకు 17.99 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగింది. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది పత్తి పంట దిగుబడి తగ్గింది. గతేడాది ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, ఈ ఏడాది 6 నుంచి 10 వరకు కూడా దిగుబడి రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఈసారి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. క్వింటాలుకు కనీసం రూ.6వేలు మద్దతు ధర చెల్లిస్తే కొంతమేరకు నష్టం పూడ్చుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు.
జాడలేని సీసీఐ
Published Mon, Jan 6 2014 4:19 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement