‘సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన పత్తి డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.. మధ్య దళారుల మోసాల బారిన పడకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌కు సిఫార్సు లేఖ రాశాం. రైతులు తప్పని సరిగా వారి బ్యాంకు పాసుపుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలను సీసీఐకి ఇవ్వాలి. మూడు రోజుల్లో ఈ నిర్ణయం అమలయ్యేలా చూస్తాం’ అని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ టి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
- సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
సాక్షి : పత్తి కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే ధరలో కోత పెడుతున్నారు. ఈ అక్రమాలకు ఎలా చెక్ పెడుతున్నారు..?
అసిస్టెంట్ డెరైక్టర్ : రైతులు పత్తిని నేరుగా ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడంతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అలా కాకుండా రైతులు పత్తిని మార్కెట్ యార్డుల్లోనే విక్రయిస్తే తూకాల్లో మోసాలకు తావుండదు. ప్రైవేటు వ్యాపారుల కాంటాల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సీజన్ ప్రారంభానికి ముందే తూనికల కొలతల శాఖ అధికారులకు లేఖ రాశాం.
సాక్షి : తేమ పేరుతో సీసీఐ కొనుగోళ్లకు నిరాకరిస్తోంది కదా..?
ఏడీ : 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తోంది. ఈ ఖరీఫ్ కొనుగోలు సీజన్‌లో ఇప్పటి వరకు 2.48 లక్షల క్వింటాళ్ల పత్తి సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు కొన్నది కేవలం 46 వేల క్వింటాళ్లు మాత్రమే.
సాక్షి : ప్రైవేటు వ్యాపారులు పెద్ద మొత్తంలో మార్కెట్ ఫీజు, వ్యాట్ ఎగవేస్తున్నారు. జీరో వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఏడీ : రైతుల ఉత్పత్తులు ముఖ్యంగా పత్తి, సోయా క్రయవిక్రయాలు వ్యాపారుల వద్ద కాకుండా, మార్కెట్ యార్డుల్లోనే క్రయవిక్రయాలు జరిగేలా జాగ్రత్త పడుతున్నాం. నేరుగా కొనుగోలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
సాక్షి : మొక్కజొన్న కొనుగోళ్ల మాటేమిటి?
ఏడీ : జిల్లాలో ఈసారి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 30,976 క్వింటాళ్ల మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.1,310 చొప్పున మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. రైతులు నాణ్యమైన మొక్కజొన్నను ఈ కేంద్రాల్లో విక్రయించవచ్చు.
సాక్షి : సోయా కొనుగోళ్లు ఎలా ఉన్నాయి?
ఏడీ : జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, కుభీర్ మార్కెట్ యార్డులకు ఇప్పుడిప్పుడే సోయాబీన్ వస్తోంది. ఈసారి ఈ పంట దిగుబడి పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిసింది. కానీ ధర మాత్రం కొంత ఆశాజనకంగా ఉంది. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,560 (పసుపు పచ్చ రకం) ఉండగా, ప్రస్తుతం రూ.3,400 నుంచి 3,500 వరకు పలుకుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల క్వింటాళ్లు యార్డుల్లో క్రయవిక్రయాలు జరిగాయి.
సాక్షి : దూర ప్రాంతాల నుంచి పత్తిని యార్డుకు తెస్తున్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు కాంటాలు కాక రోజుల తరబడి యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
ఏడీ : ఇలాంటి రైతుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో అమలు చేస్తున్న మాదిరిగా ‘సద్దిమూట’ పథకాన్ని జిల్లాలో కూడా అమలు చేయాలనే యోచనలో ఉన్నాం. ఎవరైనా దాతలు ముందుకొస్తే ఈ పథకాన్ని అమలు చేసి, రైతులకు ఉచితంగా భోజన వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో....
Published Thu, Nov 13 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement