T.Srinivas
-
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో...
‘సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన పత్తి డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.. మధ్య దళారుల మోసాల బారిన పడకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌కు సిఫార్సు లేఖ రాశాం. రైతులు తప్పని సరిగా వారి బ్యాంకు పాసుపుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలను సీసీఐకి ఇవ్వాలి. మూడు రోజుల్లో ఈ నిర్ణయం అమలయ్యేలా చూస్తాం’ అని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ టి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ సాక్షి : పత్తి కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే ధరలో కోత పెడుతున్నారు. ఈ అక్రమాలకు ఎలా చెక్ పెడుతున్నారు..? అసిస్టెంట్ డెరైక్టర్ : రైతులు పత్తిని నేరుగా ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడంతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అలా కాకుండా రైతులు పత్తిని మార్కెట్ యార్డుల్లోనే విక్రయిస్తే తూకాల్లో మోసాలకు తావుండదు. ప్రైవేటు వ్యాపారుల కాంటాల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సీజన్ ప్రారంభానికి ముందే తూనికల కొలతల శాఖ అధికారులకు లేఖ రాశాం. సాక్షి : తేమ పేరుతో సీసీఐ కొనుగోళ్లకు నిరాకరిస్తోంది కదా..? ఏడీ : 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తోంది. ఈ ఖరీఫ్ కొనుగోలు సీజన్లో ఇప్పటి వరకు 2.48 లక్షల క్వింటాళ్ల పత్తి సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు కొన్నది కేవలం 46 వేల క్వింటాళ్లు మాత్రమే. సాక్షి : ప్రైవేటు వ్యాపారులు పెద్ద మొత్తంలో మార్కెట్ ఫీజు, వ్యాట్ ఎగవేస్తున్నారు. జీరో వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏడీ : రైతుల ఉత్పత్తులు ముఖ్యంగా పత్తి, సోయా క్రయవిక్రయాలు వ్యాపారుల వద్ద కాకుండా, మార్కెట్ యార్డుల్లోనే క్రయవిక్రయాలు జరిగేలా జాగ్రత్త పడుతున్నాం. నేరుగా కొనుగోలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సాక్షి : మొక్కజొన్న కొనుగోళ్ల మాటేమిటి? ఏడీ : జిల్లాలో ఈసారి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 30,976 క్వింటాళ్ల మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.1,310 చొప్పున మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. రైతులు నాణ్యమైన మొక్కజొన్నను ఈ కేంద్రాల్లో విక్రయించవచ్చు. సాక్షి : సోయా కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? ఏడీ : జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, కుభీర్ మార్కెట్ యార్డులకు ఇప్పుడిప్పుడే సోయాబీన్ వస్తోంది. ఈసారి ఈ పంట దిగుబడి పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిసింది. కానీ ధర మాత్రం కొంత ఆశాజనకంగా ఉంది. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,560 (పసుపు పచ్చ రకం) ఉండగా, ప్రస్తుతం రూ.3,400 నుంచి 3,500 వరకు పలుకుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల క్వింటాళ్లు యార్డుల్లో క్రయవిక్రయాలు జరిగాయి. సాక్షి : దూర ప్రాంతాల నుంచి పత్తిని యార్డుకు తెస్తున్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు కాంటాలు కాక రోజుల తరబడి యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఏడీ : ఇలాంటి రైతుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో అమలు చేస్తున్న మాదిరిగా ‘సద్దిమూట’ పథకాన్ని జిల్లాలో కూడా అమలు చేయాలనే యోచనలో ఉన్నాం. ఎవరైనా దాతలు ముందుకొస్తే ఈ పథకాన్ని అమలు చేసి, రైతులకు ఉచితంగా భోజన వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. -
బధిరుల జీవితాల్లో ‘ఆదిత్య’ వెలుగులు
నేటి నుంచి ‘డీ-వార్మింగ్’ = 5,62,268 మంది విద్యార్థులకు మాత్రలు = 32 కాంట్రాక్టు ఏఎన్ఎం పోస్టులకు 2369 దరఖాస్తులు! కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జవహార్ బాల ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు, బడిబయట పిల్లలకు మంగళవారం నుంచి డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జే సరసిజాక్షి తెలిపారు. డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డీ-వార్మింగ్ కార్యక్రమంలో జిల్లాలోని 5,62,268 మంది విద్యార్థులకు మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఐదు నుంచి 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్రలు వేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. సంవత్సరానికి రెండుసార్లు డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించటం వల్ల విద్యార్థుల్లో నులిపురుగులు, నట్టలు, బద్దె పురుగులు తదితర క్రిముల వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. డీ-వార్మింగ్ (అల్బెండజోల్-400 మిల్లీగ్రాములు) మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం వేసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు చేతులు పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. విద్యాశాఖ, మాతా, శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖల్లో పనిచేస్తున్న 20వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఏడుగురు జిల్లాస్థాయి అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించామని తెలిపారు. కాంట్రాక్టు ఏఎన్ఎం పోస్టులకు 2,369 దరఖాస్తులు ... ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎంలుగా పనిచేసేందుకు దరఖాస్తులు కోరామని, 32 పోస్టులకు గానూ సోమవారం నాటికి 2,369 దరఖాస్తులు అందాయని సరసిజాక్షి తెలిపారు. ఏఎన్ఎం పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రతిభ, రోష్టర్ పాయింట్ల ఆధారంగా జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన జాబితా జిల్లా కమిటీ అనుమతి పొందిన అనంతరం నియామకాలు జరుగుతాయని తెలిపారు. జబార్ కో-ఆర్డినేటరు డాక్టర్ రమేష్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వై.సుబ్రమణ్యం, డాక్టర్ ఎన్.రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.