నేటి నుంచి ‘డీ-వార్మింగ్’
= 5,62,268 మంది విద్యార్థులకు మాత్రలు
= 32 కాంట్రాక్టు ఏఎన్‌ఎం పోస్టులకు 2369 దరఖాస్తులు!
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జవహార్ బాల ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు, బడిబయట పిల్లలకు మంగళవారం నుంచి డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జే సరసిజాక్షి తెలిపారు. డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డీ-వార్మింగ్ కార్యక్రమంలో జిల్లాలోని 5,62,268 మంది విద్యార్థులకు మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఐదు నుంచి 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్రలు వేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. సంవత్సరానికి రెండుసార్లు డీ-వార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించటం వల్ల విద్యార్థుల్లో నులిపురుగులు, నట్టలు, బద్దె పురుగులు తదితర క్రిముల వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
డీ-వార్మింగ్ (అల్బెండజోల్-400 మిల్లీగ్రాములు) మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం వేసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు చేతులు పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. విద్యాశాఖ, మాతా, శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖల్లో పనిచేస్తున్న 20వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఏడుగురు జిల్లాస్థాయి అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించామని తెలిపారు.
కాంట్రాక్టు ఏఎన్‌ఎం పోస్టులకు 2,369 దరఖాస్తులు ...
ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్‌ఎంలుగా పనిచేసేందుకు దరఖాస్తులు కోరామని, 32 పోస్టులకు గానూ సోమవారం నాటికి 2,369 దరఖాస్తులు అందాయని సరసిజాక్షి తెలిపారు. ఏఎన్‌ఎం పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రతిభ, రోష్టర్ పాయింట్ల ఆధారంగా జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన జాబితా జిల్లా కమిటీ అనుమతి పొందిన అనంతరం నియామకాలు జరుగుతాయని తెలిపారు. జబార్ కో-ఆర్డినేటరు డాక్టర్ రమేష్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వై.సుబ్రమణ్యం, డాక్టర్ ఎన్.రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
బధిరుల జీవితాల్లో ‘ఆదిత్య’ వెలుగులు
Published Tue, Dec 3 2013 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement