అయ్యా... నా వికలాంగ పింఛన్ పోయిందయ్యా
కష్టం: ఈ చిత్రంలో ఉన్న ఈ వికలాంగురాలిని చూడండి. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ఈమె శోకం వినండి...ఓ చెయ్యి వంకర తిరిగింది. దీనికి తోడు మ రో కాలు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. అద్దంకి మండలం రామాయపాలెం గ్రామానికి చెందిన గండు అంకమ్మ పుట్టుకతో వికలాంగురాలు.
ఇదీ సాక్ష్యం:ఈమె వికలాంగురాలేనంటూ సదరమ్ క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం కూడా అందించారు.
ఫలితం:ఆ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 2014 సంవత్సరం వరకు ఈమె పింఛన్ తీసుకుంటూ వస్తోంది. ఈమె పింఛన్ కార్డు ఐడీ నంబరు 1298.
శాపం: సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పడిన ఈ మాయదారి ప్రభుత్వం అసలు నీవు వికలాంగురాలివే కాదంటోంది.
రోదన:నా చెయ్యి, నా కాలు చూడండి... నేను వికలాంగురాలిని కాదా ... వృద్ధాప్యంలో నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు... నా ఉసురు ఊరికే పోదు...నాకు అన్యాయం చేస్తారా అంటూ కార్యాలయాల చుట్టూ ఈమె పాకుకుంటూ తిరుగుతోంది.
అయ్యోపాపం: ఈ రోదన ... ఆవేదన చూసిన వాళ్లు మాత్రం ఇదేమి చిత్రమో... వైకల్యం కనిపించడం లేదా ఈ అధికారులకు? కళ్లుండీ గుడ్డిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, పాలకులు, అధికారులే నిజంగా అవిటివాళ్లంటూ ఛీత్కరించుకుంటున్నారు. వికలాంగులకు ఏదో చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇలాంటి వికలాంగుల గోడు పట్టించుకుంటే అదే పదివేలంటున్నారు ఈ తరహా బాధితులు.
పరిశీలిస్తాం: ఈ వృద్ధురాలి వేదనను ఇన్‌చార్జి ఎంపీడీవో కృష్ణమోహన్ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా అర్హతా పత్రాలు పరిశీలిస్తాం. పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- అద్దంకి
ఓ వైపు ప్రపంచ వికలాంగుల దినోత్సవం వివిధ హామీలతో సందడి గా జిల్లాలో జరుపుకుంటుండగా ఇంకోవైపు అదే రోజు ఓ వికలాంగురాలి రోదన మిన్నంటింది. వైకల్యం ఉన్నా లేదన్న అధికారుల మాటకు తల్లడిల్లింది. మీటింగుల్లో మీ భరోసా సరే.. నాకేదీ ఆసరా అంటూ నిలదీసింది.