దివ్యాంగులకు జననేత ఆత్మీయ స్పర్శ
సాక్షి, కపిలేశ్వరపురం: విశాలమైన అవనిలో ఎత్తుపల్లాలు.. చల్లని సముద్రంలో ఎగిసి..పడే కెరటాలు.. నీలి ఆకాశంలో నల్లని మబ్బులు.. ప్రకృతిలో ఏదీ సక్రమంగా ఉండదు. ప్రకృతి ప్రభావిత మానవుని జీవితంలోనూ సమస్యలు, ఒడిదొడుకులు సహజం. పుట్టుకతోనైనా, విధి వంచనైనా.. కారణమేదైనా దివ్యమైన జీవితాన్ని వైకల్యం వెంటాడినా విధి రాతను ఎదిరించి నిలిచిన దివ్యాంగులెందరో చైతన్యపూరితంగా జీవిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డబ్బు లేదనో, స్థిరాస్థి లేదనో, గౌరవం ఇవ్వడం లేదనో నిత్యం సమస్యలుగా భావించే వారు ఓసారి దివ్యాంగుల జీవితాల వైపు చూస్తే ఎంతో ప్రేరణ పొందుతారు. శరీర భాగాలు సహకరించకపోయినా జీవితంలో ఎదురీదుతూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో ఈ కథనం..
అడుగడుగునా జననేత ఆత్మీయ స్పర్శ
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2018 జూన్, ఆగస్టు మధ్యకాలంలో జిల్లాలో సాగింది. దీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగులు పాదయాత్రలో తమ సమస్యలను చెప్పుకోగా వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు.
చూడలేకున్నా.. వెలుతురును ప్రసాదిస్తున్న శ్రీనివాస్
అంధత్వంతో తాను వెలుగును చూడలేకపోతున్నా తనలాంటి అనేక మందికి జీవితంలో వెలుతురును ప్రసాదిస్తున్నారు అమలాపురానికి చెందిన రామాయణం శ్రీనివాస్. పట్టుదలతో దూరవిద్యలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకుని అంధుల సేవకు అంకితమై పనిచేస్తున్నారు. స్వశక్తితో 2004 అక్టోబర్ 16న లూయిస్ అంధుల పాఠశాలను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి అంధ విద్యార్థులకు తన సంస్థలో లూయీ బ్రెయిలీ అందించిన బ్రెయిలీ లిపితో విద్యాబోధన చేస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నారు. ఆయన సంస్థలోనే దాతల సహకారంతో అంధ విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈయన కృషిని ప్రశంసిస్తూ 2017 జనవరి 4న ప్రభుత్వం తరఫున అప్పటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత రాష్ట్ర ఉత్తమ సేవా అవార్డును అందజేశారు. కోనసీమలోని అనేక సంస్థలు, దాతలు శ్రీనివాస్ కృషి కొనసాగింపునకు సహకరిస్తున్నారు.
తెల్లవారగానే సాయం..
జిల్లాలో 1,590 సచివాలయాల ద్వారా 537 రకాల సేవలందుతున్నాయి. వాటి పరిధిలోని 26,743 మంది వలంటీర్లు శ్రమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ క్రమం తప్పకుండా తెల్లవారుజామునే దివ్యాంగుడికి రూ.మూడు వేలు పింఛను సాయమందిస్తుంది. జిల్లాలో సుమారుగా 70,984 మంది దివ్యాంగులు రూ.22,14,63,000 విలువైన పింఛన్లు నెలనెలా పొందుతున్నారు.
సొంత కాళ్లపై నిలబడిన శ్రీఘాకోళపు
పుట్టుకతోనే వైకల్యం వెంటాడడంతో మండపేటకు చెందిన శ్రీఘాకోళపు వెంకట కృష్ణగుప్తకు తన రెండు కాళ్లు పనిచేయవు. ఈయన ఎమ్‌కాం వరకూ చదువుకున్నాడు. స్థానికంగా కంప్యూటర్ కోర్సు చేసి స్వయం ఉపాధికి బాట వేసుకున్నాడు. ప్రస్తుతం మండపేటలో గుప్త గ్రాఫిక్స్‌ను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో పలువురి నిత్యావసర వస్తువులు అందజేసిఆదర్శంగానిలిచారు.
చైతన్య దివిటీలు
దివ్యాంగులు చైతన్య దివిటీలు. పుట్టుక వెక్కిరించినా, విధి వంచించినా సమాజంలో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తమను సానుభూతితో కాదు.. సామాజిక దృక్పథంతో చూడాలంటున్నారు. గత కాలాల్లో ప్రభుత్వాలు అందజేసిన బహుళ అంతస్తుల భవనంలో దిగువ ఫ్లోర్‌లోనే దివ్యాంగులకు ఫ్లాట్లను కేటాయించేలా చేసుకున్నారు. నాలుగేళ్లుగా మండపేట పురపాలక సంఘం వార్షిక బడ్జెట్లో మూడు శాతం నిధులను దివ్యాంగుల సంక్షేమానికి కేటాయిస్తున్నారు. మండపేటలో దివ్యాంగుల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుట్టు పని, ఫినాయిల్ తయారీ తదితర జీవనాధార అంశాలపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు.
దివ్యాంగుల కోసం ‘సమగ్ర’ సేవ
భానుగుడి(కాకినాడ సిటీ): సమగ్రశిక్షా అభియాన్ ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు పలు ప్రత్యేక పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు దివ్యాంగుల ఉన్నతి కోసం నిరంతర పర్యవేక్షిస్తూ, నెలనెలా పలువిధాలుగా నగదు ఇస్తూ విద్యోన్నతికి తోడ్పాటు అందిస్తోంది.
భవిత సెంటర్ల ద్వారా చిన్నారులకు విద్య
జిల్లాలో 21 భవిత సెంటర్లు, 43 నాన్ భవిత సెంటర్ల ద్వారా 1379 మంది చిన్నారులకు 18మంది ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు.
గృహ ఆధారిత విద్య
128 మంది ఐఈఆర్టీల ద్వారా వారంలో 640 మంది విద్యార్థులకు వారంలో ప్రతి శనివారం హోమ్బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతినెలా రూ.200 చొప్పున అలవెన్సులను ప్రభుత్వమే అందిస్తోంది.
విద్యార్థులకు ట్రాన్స్‌పోర్టు అలవెన్సు
ట్రాన్స్‌పోర్టు అలవెన్సు రూపంలో 2019–20 సంవత్సరానికి సంబంధించి 1094 మంది వీఐ, హెచ్ఐ, ఎంఆర్ కేటగిరీల విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున అలవెన్సులు అందిస్తోంది.
ఎస్కార్టు అలవెన్సు: ప్రత్యేక అవసరాల గల సెరిబ్రల్ పాల్సీ, లోకోమోటార్ డిసెబిలిటీ అండ్ మల్టీపుల్ డిసెబిలిటీ విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ఎస్కార్టు అలవెన్సు, ప్రత్యేక అవసరాలు గల ఆడపిల్లలకు 6,7,8 తరగతుల విద్యార్థినులకు 398 మందికి రూ.200 చొప్పున స్టైఫండ్, ప్రత్యేక అవసరాలు గల 46 మంది విద్యార్థినులకు రీడర్ అలవెన్స్ కింద, తొమ్మిది మంది విద్యార్థులకు నెలకు రూ.200 హాస్టల్ అలవెన్సు అందిస్తున్నారు.
మైనర్ కరెక్టివ్ సర్జరీలు: రాజమండ్రి యూనివర్సల్ హాస్పిటల్ 52మందికి ఎసెస్మెంట్ క్యాంపు నిర్వహించి మైనర్ కరెక్టివ్ సర్జరీలు నిర్వహించారు.
పదిలో 40 మంది పాస్ పదో తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. స్పెషల్ ఒలంపిక్ భారత్ క్రీడలు భవిత, నాన్ భవిత సెంటర్లలో పిల్లలకు స్పెషల్ ఒలింపిక్ భారత్ నిర్వహిస్తున్న క్రీడలకు జిల్లా స్థాయిలో పాల్గొనేందుకు శిక్షణ ఇచ్చారు.
సచివాలయంలోనే సదరం స్లాట్ బుకింగ్...
వైకల్యాన్ని నిర్ధారించేందుకు ప్రామాణికంగా ఉన్న సదరం సర్టిఫికెట్ జారీని ప్రస్తుత ప్రభుత్వం సరళతరం చేసింది. దివ్యాంగుడు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో టైమ్‌స్లాట్‌ను బుక్ చేసుకునే విధానాన్ని అమలు చేస్తోంది. పరీక్షకు వెళ్లాల్సిన తేదీ, సమయం, ఆస్పత్రి వివరాలను స్లాట్‌లో పేర్కొంటారు. పరీక్ష అనంతరం వైద్యుడు అందజేసే సర్డిఫికెట్ను సచివాలయాల్లోనే పొందొచ్చు. దివ్యాంగుల అవస్థలను తొలగించేందుకు వైద్య పరీక్షలు చేసే కేంద్రాల సంఖ్యను 18కు పెంచింది. జీజీహెచ్, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో ఈ కేంద్రాలను నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా కొద్ది నెలల పాటు నిలిచిన సదరన్ శిబిరాల నిర్వహణ ప్రక్రియను పుదరుద్ధరించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భవిత కేంద్రాల ద్వారా సేవలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల సంక్షేమం కోసం సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో భవిత విద్యా వనరుల కేంద్రాల ద్వారా ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. జిల్లాలో 64 భవిత కేంద్రాలుండగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 10,384 ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ప్రబంద్పోర్టల్లో 1524 మంది బాలురు, 1283 మంది బాలికలను నమోదు చేశారు. 18 మంది ఫిజియో థెరపిస్టులు, 124 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, 64 మంది ఆయాలు చిన్నారులకు సేవలందిస్తున్నారు. 21 రకాల వైకల్యాలతో బాధపడే చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి స్పీచ్‌థెరపీ, సైకలాజికల్ థెరపీ, ఫిజియో థెరపీ సేవలందిస్తున్నారు. చిన్నారులకు, చిన్నారుల పర్యవేక్షకులకు అలవెన్స్ రూపంలో నగదును కూడా అందజేస్తుంది.
వికలాంగుల చట్టం 2016 ఏం చెబుతుందంటే..
శారీరకంగా, మానసికంగా వైకల్యం కలిగిన వారిని దివ్యాంగులుగా పరిగణిస్తున్నారు. 2016 డిసెంబర్ 16న దేశంలో వికలాంగుల చట్టం (ఆర్పీడీ) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆత్మ గౌరవం, వ్యక్తి స్వేచ్ఛ, అవకాశాల పెంపు, సామాజిక భద్రత లక్ష్యంగా ఈ చట్టం రూపొందింది. ఏడు రకాల వైకల్యాలను మాత్రమే పరిగణించే పరిస్థితుల స్థానంలో ఆ సంఖ్యను 21కు పెంచారు. వికలాంగుల రిజర్వేషన్ శాతాన్ని మూడు నుంచి నాలుగు శాతానికి పెంచారు. వికలాంగులపై దాడి చేసినా, వివక్ష చూపినా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల నుంచి రూ.ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తారు.
50 శాతం రాయితీ బస్‌పాస్‌ల జారీ
దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ చార్జీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ బస్‌పాస్‌లను జారీ చేస్తోంది. జిల్లాలో 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 24 వేల మందికి రాయితీ పాస్‌లను అందజేసింది. నూరు శాతం వైకల్యం కలిగిన దివ్యాంగుడితోపాటు వారి సహాయకుడికి కూడా 50 శాతం రాయితీతో ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించింది.
దివ్యాంగుల సేవలో ఉమా మనోవికాస కేంద్రం
అనంతకోటి జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది. అటువంటి జన్మకు సార్ధకత చేకూర్చుకునేందుకు ఒక్కక్కరూ ఒక్కో బాటను ఎంచుకుంటారు. అలా కాకినాడ రాయుడుపాలెంలోని ఉమామనో వికాస కేంద్రం నిర్వాహకులు దివ్యాంగులకు సేవ చేసే మార్గాని ఎంచుకుని తరిస్తున్నారు. పుట్టుకనే అంగవైకల్యంతో కొందరు, మానసికంగా ఎదలేని వారు కొందరూ జీవితాన్ని భారంగా మోస్తుంటారు. వారిని అక్కున చేర్చుకుని అవసరమైన ఆరోగ్య, విద్య, జీవనోపాధి, సాంఘిక, సాధికార విషయాలను నేర్పుతూ 33 ఏళ్లుగా ముందుకు సాగుతోంది.
కాకినాడ రూరల్/యానాం: ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ(ఉమామనోవికాస కేంద్రం) తొలుత తొమ్మిది మందితో ప్రారంభమై నేడు 1500 మందికి విద్యనందిస్తోంది. మన జిల్లాతో పాటు ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో సేవలందిస్తోంది.
యానాంలో సేవలు..
యానాంలోని జిక్రియనగర్లోని మానసిక వికలాంగ పిల్లల కోసం పదేళ్ల నుంచి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వారికి బుద్ధిమాంద్యం, సెరిబ్రల్ పాలసీ, వినికిడి, మాట సమస్య అభివృద్ధిలో ఆలస్యమైన వారికి ప్రత్యేక విద్య అందిస్తోంది. దీనిలో భాగంగా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, రోజువారీ పనులు, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యం, విద్య తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
పుదుచ్చేరి ఎల్జీ కిరణ్‌బేడీ సందర్శన
ఈ ఏడాది ఫిబ్రవరిలో యానాంలోని ఉమా మనోవికాస కేంద్రాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ సందర్శించి దివ్యాంగులకు అందిస్తున్న సేవలపై ఆ సొసైటీ డైరెక్టర్ ఎస్పీ రెడ్డిని అభినందించారు.
ఆరుసార్లు జాతీయ పురస్కారాలు
33 ఏళ్లుగా దివ్యాంగ చిన్నారులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉమామనోవికాస కేంద్రానికి ఆరుసార్లు జాతీయ పురస్కారాలు లభించాయి. ఆ విధంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిడ్ నుంచి అనేక అవార్డులను సంస్థ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి అందుకున్నారు. ఏటా డిసెంబర్ 3న ఇంటర్నేషనల్ డే ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పెర్సన్స్ (ప్రపంచ వికలాంగదినోత్సవం)ను సంస్థలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
విభిన్నప్రతిభావంతుల అభివృద్ధికి కృషి
విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సేవలను అందిస్తూ వారి అభివృద్ధి సేవలు అందించేందుకు ఉమామనో వికాస కేంద్రం 1988లో నెలకొల్పాం. తమ సంస్థ ద్వారా మానసిక వికలాంగుల(బుద్ధి మాంద్యత) ప్రత్యేక పాఠశాల, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు, స్టేట్ సెంటర్ ఫర్ డెఫ్ అండ్ బ్లైండ్, జిల్లా దివ్యాంగుల పునరావాసం, కృత్రిమ అవయవాల తయారీ, పంపిణీ యూనిట్, కృత్రిమ అవయవాల రిపేరు మొబైల్ వర్క్‌షాపు, ఘరోంద గ్రూపు హోమ్, సమాజ ఆధారిత పునరావాస కార్యక్రమం, ఇలా పలు కార్యక్రమాల చేపడుతున్నాం. – ఎస్పీ రెడ్డి, డైరెక్టర్, ఉమామనోవికాస కేంద్రం