క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.2,090 చెల్లించేందుకు నిర్ణయం.. 85 వేల టన్నుల సేకరణకు అనుమతి
మే 15వ తేదీ వరకు కొనసాగనున్న కొనుగోళ్లు
నేటినుంచి ఆర్‌బీకేల్లో రైతుల వివరాల నమోదు
మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: మొక్కజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం (ఈ నెల 14న) కొనుగోళ్లు ప్రారంభించి మే 15వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. నాణ్యమైన క్వింటాల్ మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,090 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్‌బాబు మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో ఆర్‌బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది.
రైతును నిలబెట్టేలా మద్దతు ధర
రాష్ట్రంలో రబీ 2023–24లో 4.75 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 16.82 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా.. నెలాఖరు నాటికి ముమ్మరమవుతాయి. సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు.
అయితే.. పంట చేతికొచ్చే సమయంలోమార్కెట్‌ను బూచిగా చూపి వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తారేమోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర విషయంలో రైతులకు అండగా నిలవాలన్న సంకల్పంతో క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఇందుకోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేసి కనీసం 85 వేల టన్నులను సేకరించేందుకు అనుమతిచ్చింది.
కొనుగోలుకు పక్కా ఏర్పాట్లు
మొక్కజొన్న కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ (ఆర్‌బీకే అండ్ ఆర్) నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది. కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, తేమను కొలిచే మీటర్లు, డ్రయ్యర్లు, జల్లెడ, కుట్టు యంత్రాలు, వేయింగ్ మెషిన్లు వంటి వాటిని సమకూర్చే బాధ్యతను మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. మొక్కజొన్న సేకరణకు అవసరమైన నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి సమీకరించుకునే వెసులుబాటును మార్క్‌ఫెడ్‌కు కల్పించింది.
అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు సకాలంలో నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి తిరిగి చెల్లిస్తుంది. మొక్కజొన్నను నిల్వ చేసుకునేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీలతో పాటు వ్యవసాయ, ఇతర గిడ్డంగులను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
ధరలు పెరిగేలా చర్యలు
మార్కెట్‌లో మొక్క జొన్న ధరల హెచ్చుతగ్గులను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సమీప రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏ ఒక్కరూ తొందరపడి అమ్ముకోవద్దు. మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. ఇప్పటికే మినుము, పెసలు, వేరుశనగ, శనగ, జొన్నల సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాజాగా మొక్కజొన్న కొనుగోలుకు కూడా అనుమతి ఇచ్చింది. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment