Corn purchases
-
నేటి నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మొక్కజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం (ఈ నెల 14న) కొనుగోళ్లు ప్రారంభించి మే 15వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. నాణ్యమైన క్వింటాల్ మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,090 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్‌బాబు మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. రైతును నిలబెట్టేలా మద్దతు ధర రాష్ట్రంలో రబీ 2023–24లో 4.75 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 16.82 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా.. నెలాఖరు నాటికి ముమ్మరమవుతాయి. సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. పంట చేతికొచ్చే సమయంలోమార్కెట్ను బూచిగా చూపి వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తారేమోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర విషయంలో రైతులకు అండగా నిలవాలన్న సంకల్పంతో క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఇందుకోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేసి కనీసం 85 వేల టన్నులను సేకరించేందుకు అనుమతిచ్చింది. కొనుగోలుకు పక్కా ఏర్పాట్లు మొక్కజొన్న కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే అండ్ ఆర్) నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది. కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, తేమను కొలిచే మీటర్లు, డ్రయ్యర్లు, జల్లెడ, కుట్టు యంత్రాలు, వేయింగ్ మెషిన్లు వంటి వాటిని సమకూర్చే బాధ్యతను మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. మొక్కజొన్న సేకరణకు అవసరమైన నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి సమీకరించుకునే వెసులుబాటును మార్క్‌ఫెడ్‌కు కల్పించింది. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు సకాలంలో నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి తిరిగి చెల్లిస్తుంది. మొక్కజొన్నను నిల్వ చేసుకునేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీలతో పాటు వ్యవసాయ, ఇతర గిడ్డంగులను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ధరలు పెరిగేలా చర్యలు మార్కెట్లో మొక్క జొన్న ధరల హెచ్చుతగ్గులను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సమీప రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏ ఒక్కరూ తొందరపడి అమ్ముకోవద్దు. మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. ఇప్పటికే మినుము, పెసలు, వేరుశనగ, శనగ, జొన్నల సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాజాగా మొక్కజొన్న కొనుగోలుకు కూడా అనుమతి ఇచ్చింది. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
మొక్కజొన్నతో మార్క్‌ఫెడ్‌కు నష్టాలు
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొంటున్న మార్క్‌ఫెడ్ కొన్నేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది. మద్దతు ధరకు కొనడం, తర్వాత వాటిని మార్కెట్ ధరలకు విక్రయిస్తుండటంతో భారీగా నష్టాల పాలైంది. దీంతో చివరకు ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కూడా డబ్బుల్లేక, బ్యాం కుల్లో అప్పులు చేస్తోంది. పైగా బ్యాంకు బకాయిలు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితిలోకి కూడా మార్క్‌ఫెడ్ వెళ్లిపోయింది. అయితే తాజా సమగ్ర వ్యవసాయ విధానం నేపథ్యంలో మార్క్‌ఫెడ్ కొన్నేళ్లుగా చేపట్టిన కొనుగోళ్లు, నష్టాలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఏ పంట వల్ల ఎక్కువ నష్టం వచ్చిందో అంచనా వేసింది. ఆరేళ్లలో రూ.1,114 కోట్ల నష్టం.. మార్క్‌ఫెడ్ ఆరేళ్లలో ఏకంగా రూ.1,114 కోట్లు నష్టపోయింది. మొత్తం కొనుగోళ్లలో 26.45 శాతం నష్టాలు రావ డం గమనార్హం. ఇందులో మొక్కజొన్న కొనుగోళ్లతోనే అ ధిక మొత్తంలో నష్టం రాగా, ఆ తర్వాతి స్థానంలో కందులున్నాయి. 2014–15 నుంచి 2019–20 వరకు మార్క్‌ఫెడ్ 18.42 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. వీటి విలువ నిర్వహణ ఖర్చులతో కలిపి రూ.4,213 కోట్లు. తిరిగి వీటిని టెండర్ల ద్వారా విక్రయాలు జరపగా వచ్చిన మొత్తం రూ.3,099 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఏకంగా రూ.1,114 కోట్లు నష్టం వచ్చింది. అందులో మొక్కజొన్న విక్రయాల ద్వారా రూ.532 కోట్లు నష్టం మూటగట్టుకుంది. 2014–15లో రూ.154 కోట్లు నష్టం రాగా, 2017–18 వానాకాలంలో రూ.140 కోట్లు, యాసంగిలో రూ.111 కో ట్లు, 2018–19 వానాకాలంలో రూ.127 కోట్ల నష్టం వచ్చింది. ఆ తర్వాత కందుల ద్వారా రూ.412 కోట్ల నష్టం వాటిల్లింది. 2017–18లో రూ.350 కోట్లు, 2018–19లో రూ.62 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక జొన్నలు, ఎర్ర జొ న్నలతో రూ.56 కోట్లు, శనగలతో రూ.73 కోట్ల నష్టాలు వచ్చినట్లు ప్రాథమిక నివేదికలో మార్క్‌ఫెడ్ పేర్కొంది. డిమాండ్ లేని పంటలతోనే నష్టమా? నియంత్రిత సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అం దులో భాగంగానే అసలు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభు త్వం గత ఆరేళ్లలో కొనుగోలు చేసిన పంటలేవీ? వాటికి ఎంత ఖర్చు అయింది.. తిరిగి విక్రయించే సమయంలో ఎంత నష్టం వచ్చిందనే దానిపై ఈ లెక్కలు తీశారు. ఈ కాలం లో మద్దతు ధరకు కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని తేలింది. పైగా తీవ్ర నష్టాలను చవిచూసింది. డిమాండ్ లేని పంటలను అధికంగా పండించ డం ద్వారానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు నిర్ధారణకు వచ్చా రు. ఇటు కొందరు మార్క్‌ఫెడ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై నష్టాలు వచ్చేలా విక్రయాలు జరపడం కూడా ఓ కారణమన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మేలు జరిగేలా కొనుగోళ్లలోనూ సమూ ల సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. -
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో...
‘సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన పత్తి డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.. మధ్య దళారుల మోసాల బారిన పడకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌కు సిఫార్సు లేఖ రాశాం. రైతులు తప్పని సరిగా వారి బ్యాంకు పాసుపుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలను సీసీఐకి ఇవ్వాలి. మూడు రోజుల్లో ఈ నిర్ణయం అమలయ్యేలా చూస్తాం’ అని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ టి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ సాక్షి : పత్తి కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే ధరలో కోత పెడుతున్నారు. ఈ అక్రమాలకు ఎలా చెక్ పెడుతున్నారు..? అసిస్టెంట్ డెరైక్టర్ : రైతులు పత్తిని నేరుగా ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడంతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అలా కాకుండా రైతులు పత్తిని మార్కెట్ యార్డుల్లోనే విక్రయిస్తే తూకాల్లో మోసాలకు తావుండదు. ప్రైవేటు వ్యాపారుల కాంటాల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సీజన్ ప్రారంభానికి ముందే తూనికల కొలతల శాఖ అధికారులకు లేఖ రాశాం. సాక్షి : తేమ పేరుతో సీసీఐ కొనుగోళ్లకు నిరాకరిస్తోంది కదా..? ఏడీ : 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తోంది. ఈ ఖరీఫ్ కొనుగోలు సీజన్లో ఇప్పటి వరకు 2.48 లక్షల క్వింటాళ్ల పత్తి సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు కొన్నది కేవలం 46 వేల క్వింటాళ్లు మాత్రమే. సాక్షి : ప్రైవేటు వ్యాపారులు పెద్ద మొత్తంలో మార్కెట్ ఫీజు, వ్యాట్ ఎగవేస్తున్నారు. జీరో వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏడీ : రైతుల ఉత్పత్తులు ముఖ్యంగా పత్తి, సోయా క్రయవిక్రయాలు వ్యాపారుల వద్ద కాకుండా, మార్కెట్ యార్డుల్లోనే క్రయవిక్రయాలు జరిగేలా జాగ్రత్త పడుతున్నాం. నేరుగా కొనుగోలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సాక్షి : మొక్కజొన్న కొనుగోళ్ల మాటేమిటి? ఏడీ : జిల్లాలో ఈసారి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 30,976 క్వింటాళ్ల మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.1,310 చొప్పున మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. రైతులు నాణ్యమైన మొక్కజొన్నను ఈ కేంద్రాల్లో విక్రయించవచ్చు. సాక్షి : సోయా కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? ఏడీ : జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, కుభీర్ మార్కెట్ యార్డులకు ఇప్పుడిప్పుడే సోయాబీన్ వస్తోంది. ఈసారి ఈ పంట దిగుబడి పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిసింది. కానీ ధర మాత్రం కొంత ఆశాజనకంగా ఉంది. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,560 (పసుపు పచ్చ రకం) ఉండగా, ప్రస్తుతం రూ.3,400 నుంచి 3,500 వరకు పలుకుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల క్వింటాళ్లు యార్డుల్లో క్రయవిక్రయాలు జరిగాయి. సాక్షి : దూర ప్రాంతాల నుంచి పత్తిని యార్డుకు తెస్తున్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు కాంటాలు కాక రోజుల తరబడి యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఏడీ : ఇలాంటి రైతుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాలో అమలు చేస్తున్న మాదిరిగా ‘సద్దిమూట’ పథకాన్ని జిల్లాలో కూడా అమలు చేయాలనే యోచనలో ఉన్నాం. ఎవరైనా దాతలు ముందుకొస్తే ఈ పథకాన్ని అమలు చేసి, రైతులకు ఉచితంగా భోజన వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.