నల్లగొండ జిల్లా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ వద్ద టోకెన్ల కోసం రైతుల తోపులాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలపు వరి కోతలు ఊపందుకున్నాయి. చాలా జిల్లాల్లో 40శాతం వరకు కోతలు, నూర్పిడి పూర్తయి ధాన్యం రాశులు పోగుపడ్డాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. అవసరాలకు, అప్పులు తీర్చడానికి డబ్బులు లేక.. ఇంకా వేచి చూడలేక.. దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు, మిల్లర్లు అగ్గువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి మద్దతు ధరకన్నా మూడు వందల నుంచి ఆరు వందలదాకా తక్కువ రేటు చెల్లిస్తున్నారు. దీనికితోడు తేమశాతం, తాలు పేరుతో తరుగుతీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పౌరసరఫరాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నవిమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మూడో వంతు కేంద్రాలే..
ప్రస్తుత వానాకాలంలో పెరిగిన వరి సాగుకు అనుగుణంగా 6,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. కోటీ రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలం కోతలు మొదలై 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు తెరిచిన కొనుగోలు కేంద్రాలు 2,142 మాత్రమే. ముఖ్యంగా నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో వరికోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయంలో పౌరసరఫరాల శాఖ తాత్సారం చేస్తోంది. తెరిచిన కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. వడ్లు కొనే పరిస్థితి లేదు.
నల్లగొండ నుంచి పెద్దపల్లి దాకా పెద్ద సంఖ్యలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తమ టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటంతోనే గడిచిపోతోందని నల్లగొండకు చెందిన రమేశ్ అనే రైతు వాపోయారు. రాష్ట్రంలో కోటి టన్నులకుపైగా ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 2.36 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి ఉన్నాయి. వానలు పడితే తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధరకన్నా తక్కువతో..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం, ఏర్పాటైన చోట కొనుగోళ్లకు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి కారణంగా రైతులు నేరుగా మిల్లర్లను, దళారులకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వెంటనే కొనుగోలు చేస్తుండటం, డబ్బులు చెల్లిస్తుండటంతో.. అగ్గువ సగ్గువకైనా ధాన్యాన్ని అప్పగిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొంటున్న దళారులు, మిల్లర్లు.. రకం, తేమశాతం, ఇతర అంశాలను బట్టి క్వింటాల్‌కు రూ.1,360 నుంచి రూ.1,650 వరకే చెల్లిస్తున్నారు. వరి ఏ గ్రేడ్‌కు రూ.1,960.. బీ గ్రేడ్‌కు రూ.1,940గా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఇవి ఐదారు వందలదాకా తక్కువ కావడం గమనార్హం.
సన్న వడ్లకే కాస్త ధర..
వచ్చే యాసంగి నుంచి దొడ్డు బియ్యం, ఉప్పుడు (పారాబాయిల్డ్ రైస్)ను కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పలు సూచనలు చేసింది. దీంతో వానాకాలం పంట విషయంలో కూడా మిల్లర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దొడ్డు వడ్లను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సన్న వడ్లను మాత్రం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సన్నరకాలకు క్వింటాల్ రూ.1,600 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తుండగా.. రైతులెవరైనా దొడ్డు వడ్లను తెస్తే మరో రెండు, మూడు వందలు తక్కువగా ఇస్తున్నారు. దీనికితోడు తేమ, తాలు అంటూ మరింత కోత పెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇప్పటికే వరి దిగుబడి దశకు చేరింది. కోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ భువనగిరి, సూర్యాపేటల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పలు కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో శనివారం మొదలు కానున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యం కావడంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకు విక్రయిస్తున్నారు.
కస్టమ్ మిల్లింగ్ పూర్తికాకున్నా..
గత యాసంగికి సంబంధించిన లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లుల్లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ఆ ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించాల్సి ఉంది. కానీ ఆ పని ఆపేసి.. రైతుల నుంచి వానాకాలం పంటను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకే సన్నరకాల ధాన్యం కొనవచ్చని.. డిమాండ్ వచ్చినప్పుడు రెట్టింపు రేటుకు అమ్ముకోవచ్చన్నది మిల్లర్లు ఆలోచన అని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి.
రూ.1,650కే అమ్ముకోవాల్సి వచ్చింది
నాకున్న ఒకటిన్నర ఎకరం భూమిలో సన్నరకం వరి వేశాను. పదిహేను రోజుల కింద పంటకోసి నూర్పిడి పూర్తయింది. ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు కాలేదు. వానలు పడతాయన్న భయంతో వడ్లను వ్యాపారులకు అమ్ముకున్నా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.1,650 రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది.
– షేక్ నిస్సార్, బర్ధీపూర్ గ్రామరైతు, బోథ్ మండలం
Comments
Please login to add a commentAdd a comment