తేమ సాకు.. పత్తి రైతుకు షాకు
పత్తి రైతులను ప్రైవేట్ వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తుంటే.. మద్దతు ధర అందించి ఆదుకోవాల్సిన సీసీఐ ప్రేక్షకపాత్ర వహిస్తోంది. పత్తిలో తేమ, నాణ్యత సాకుతో కొనుగోళ్లు చేపట్టకుండా గంపెడాశలతో వచ్చిన రైతులకు షాకిస్తోంది.
మద్దత ధర రూ.4050
కనిష్టం రూ.3500
మోడల్ రూ.3700
గరిష్టం రూ.3900
జమ్మికుంట:
పత్తి మార్కెట్ సీజన్ షురువైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కాస్త ఆలస్యంగానే మేల్కొంది. జిల్లాలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ మార్కట్‌లో తెరిచింది. రెండో కేంద్రాన్ని మంగళవారం మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా జమ్మికుంట మార్కెట్‌లో ప్రారంభిం చింది. మొన్నటిదాకా ప్రైవేట్ వ్యాపారుల చేతిలో చిత్తయిన రైతులు సీసీఐ రాకతో మద్దతు ధర లభిస్తుందని ఆశపడ్డారు.
బుధవారం కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పలువురు రైతులు సుమారు ఐదు వేల క్వింటాళ్ల పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చారు. కానీ.. తేమ సాకుతో బస్తాలు చూసేందుకు సీసీఐ అధికా రులు ముఖం చాటేశారు. ఉదయం 11 గంటల వరకు సీసీఐ కొనుగోళ్లు చేపట్టలేదు. అధికారులు కనీసం తేమ పరిశీలించేందుకు కూడా ముందుకు రాకపోవడం రైతులను నిరాశ పరిచింది.
సమాచారం అందుకున్న సాక్షి మార్కెట్‌కు వెళ్లి రైతులను పలకరించింది. ‘సీసీఐ పత్తి కొంటుం దని పొద్దున్నుంచి చూస్తున్నా.. పగలైనా ఒక్క బస్తా కొనలేదు..’ అని జమ్మికుంట మండలం గండ్రపల్లికి చెందిన మల్లారావు అనే రైతు అధికారుల తీరుపై మండిపడ్డాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మార్కెట్లోకి వచ్చిన పాత్రికేయులను చూసిన సీసీఐ అధికారులు ఓ పత్తి కూటు వద్ద తేమ పరికరంతో పరీక్షించారు.
12 నుంచి 16 శాతం వరకు తేమ ఉందని, తాము కొనలేమని చేతులెత్తేశారు. దీంతో ఇదే పత్తిని ప్రైవేట్ వ్యాపారులు గరిష్టంగా క్వింటాల్‌కు రూ.3900 వరకు చెల్లించారు. వేలాది బస్తాలకు మాత్రం రూ.3500 నుంచి రూ.3700 ధర మాత్రమే పెట్టారు. సర్కారు మద్దతు ధర క్వింటాలుకు రూ. 4050 లభిస్తుందని ఆశించిన రైతులు.. ఎప్పటిలాగే సీసీఐ తీరుతో వ్యాపారుల చేతిలో నష్టపోయా రు. తమకు ఇంత అన్యాయం జరుగుతుంటే సర్కారు ఏం చేస్తోందని పలువురు రైతులు ప్రశ్నించారు. మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీసీఐ.. అంతే..!
Published Thu, Oct 16 2014 3:17 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement