తూకంలో మోసం! | Fraud score! | Sakshi
Sakshi News home page

తూకంలో మోసం!

Published Fri, Nov 7 2014 4:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

తూకంలో మోసం! - Sakshi

తూకంలో మోసం!

 వెంకటగిరి గ్రామానికి చెందిన రైతులు పరమేశ్వరరెడ్డి, జనార్ధన్‌రెడ్డి తమ పత్తి పంటను పొలం నుంచి రాగానే వే-బ్రిడ్జ్‌లో తూకం వేసి చనుగొండ్ల గ్రామంలోని ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మాడు. 28 క్వింటాళ్ల పత్తి తీసుకుపోగా తూకాల్లో 4 క్వింటాళ్లు మోసం చేసినట్లు బయటపడింది. పంచాయితీ చేసి 2.5 క్వింటాళ్లకు వ్యాపారస్తుల దగ్గరి నుంచి రైతులు డబ్బులు కట్టించుకుని వచ్చారు.
 
 ప్యాలకుర్తిలో ఎలక్ట్రానిక్ కాటాలో 15కిలోలు మైనస్‌లో పెట్టి జోలాపురం లింగన్న అనే రైతు నుంచి ప్రైవేట్ వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేశారు. ఆ రైతుకు అనుమానం వచ్చింది. స్వయంగా తనే కాటా ఎక్కి బరువును చూసుకున్నాడు. 75 కేజీల బరువు ఉండాల్సిన లింగన్న 60 కేజీలే కాటాలో చూపించడంతో వ్యాపారిని నిలదీశాడు. జరిగిన మోసం బయటికి రాకుండా ఆ రైతుకు అంతో ఇంతో ముట్టజెప్పి వ్యాపారి పరారయ్యాడు.
 
 విత్తనాల కొనుగోలు నుంచి పంట ఉత్పత్తులు అమ్మే వరకు రైతన్నను నట్టేట ముంచేస్తున్నారు. మోసపోవడం రైతు వంతైంది. ఎంతో కష్టపడి ప్రకృతి, చీడపీడల నుంచి పంటను కాపాడుకున్న పత్తి రైతులు దళారుల చేతిలో దగాకు గురవుతున్నారు. అరకొర వర్షాలతో చేతికొచ్చిన పత్తి పంటను అమ్ముకునేలోపే కొందరు దళారులు గద్దల్లా వాలుతున్నారు. అడ్వాన్స్ ఇచ్చి బుట్టలో వేసుకుని అధిక ధర ముసుగులో కొల్లగొడుతున్నారు.  
 - కోడుమూరు
 
 ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంట నెలరోజులుగా కోతకు రావడంతో కొందరు వ్యాపారులు గ్రామాల్లో డబ్బు సంచులతో వాలిపోతున్నారు. నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ మండలాలకు ఆదోని మార్కెట్‌యార్డ్ కొనుగోలు కేంద్రం. అక్కడ క్వింటా రూ.3,800 నుంచి రూ.4,100 వరకు వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రవాణా ఖర్చులు భరించలేని రైతులకు దళార్లు ఎరవేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ కాటాపై అవగాహనలేని వారిని సులువుగా మోసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలో పత్తిని తూకం వేస్తూ వ్యాపారస్తులు తమ చేతిలో రిమోట్‌ను ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. క్వింటాకు 15 కేజీలు మోసం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 75వేల ఎకరాల్లో పత్తిపంట సాగైంది.

ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా దళార్లు గ్రామాలకు చేరుకుంటున్నారు. నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పత్తిని కొనుగోలు చేస్తామని ముందస్తుగా రైతులకు అడ్వాన్స్ ఇస్తున్నారు. గద్వాల, శాంతినగర్, అయిజ, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ వ్యాపారస్థులు పత్తిని కొనుగోలు చేసుకుని ఇతర ప్రాంతాలకు పత్తిని తరలిస్తున్నారు.

మధ్య దళారులకు కమీషన్ ఎర వేస్తూ పంటను విక్రయించే రైతులను తమ వద్దకు తీసుకెళ్లేలా చేస్తున్నారు. గ్రామాల్లో యథేచ్ఛగా జీరో బిజినెస్ జరుగుతున్నా అధికారులు మేల్కొవడం లేదు. సరిహద్దు ప్రాంతాలైన ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, కోడుమూరు, మాదవరం ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంతో వీరి వ్యాపారం జోరుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి.
 
 అక్రమాలకు పాల్పడితే క్షమించం
 అన్ని చెక్‌పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. బోగస్ పర్మిట్లపై నిఘా పెట్టాం. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశాం. అక్రమ వ్యాపారస్తులను ప్రోత్సహించే చెక్‌పోస్ట్ సిబ్బందిని ఉపేక్షించేది లేదు.    
 - ఉపేంద్రకుమార్, ఏడీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement