సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులను గాడిన పెట్టడంలో వ్యవసాయశాఖ వైఫల్యంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇతర వ్యవసాయ ఉన్నతాధికారులతో జరిగిన సమా వేశంలో సమితుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.
మార్కెట్‌కు పత్తి సహా ధాన్యం తరలివస్తోంది. ఇటీవలి వర్షాల కారణంగా అనేకచోట్ల పత్తి రంగు మారడం, తేమశాతం అధికంగా ఉండటంతో వ్యాపారులు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో సంబంధి త రైతులకు అండగా ఉండాల్సిన సమన్వయ సమితి సభ్యులు ఎక్కడా పత్తాలేకుండా పోయారన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో వారు పత్తి వ్యాపారులతో మాట్లాడటం, సీసీఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించడం, మార్కెట్ కమిటీ చైర్మ న్లు, కార్యదర్శులను కలవడం, రైతులకు నచ్చజెప్ప డం వంటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి లేదన్న భావన ప్రభుత్వంలో నెలకొంది. రైతులు పత్తితో వ్యవసాయ మార్కెట్లకు తరలివస్తుంటే ఎక్కడా వారి తరఫున సమితి సభ్యులు వచ్చిన దాఖలాలు లేవు. ‘గ్రామ, మండల సమితులు ఏర్పాటు చేశారు. వాటికి సభ్యులను, సమన్వయకర్తలను నామినేట్ చేశారు. సభ్యులు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నారా?’అని ఆ సమావేశంలో సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది.
అడుగడుగునా అందుబాటులో ఉండాల్సింది..
‘అన్ని వర్గాలకూ సంఘాలున్నాయి. కానీ రైతులు అసంఘటితంగా ఉన్నారు. వారిని సంఘటితం చేసేందుకే రైతు సమితులను ఏర్పాటు చేశాము’అని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరుగుతోంది. రాష్ట్రంలో 10,733 గ్రామ రైతు సమన్వయ సమితులు, 559 మం డల సమితులు, 30 జిల్లా సమితులను ఏర్పాటు చేయాలి.
ఇప్పటికి గ్రామ రైతు సమన్వయ సమితు లు పూర్తయ్యాయి. 559 మండల సమితులకు గాను దాదాపు 530 సమితులు ఏర్పాటయ్యాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. విత్తనం వేసే దగ్గర నుంచి పంట పండించి మార్కెట్‌కు చేరి గిట్టుబాటు ధర లభించే వరకు రైతులకు అడుగడుగునా సమితులను అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. పంటకు గిట్టుబాటు ధర రాకుంటే వ్యాపారులతో చర్చించి సరైన ధర ఇప్పించడంలోనూ వీరు కీలకపాత్ర పోషించాలని సర్కారు స్పష్టంగా చెప్పింది. సరైన ధర రాకుంటే వచ్చే వరకు రైతుల పక్షాన ఉండాలని కూడా చెప్పింది.
శిక్షణ పొందారు... సైలెంట్ అయ్యారు
రైతులకు ఎలా సాయపడాలన్నదానిపై గ్రామ, మండల రైతు సమన్వయ సమితులకు ప్రభుత్వం జిల్లాల్లో శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణకు వ్యవసాయ మంత్రి శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ ప్రత్యేకంగా హెలీకాఫ్టర్‌లో వెళ్లి వచ్చారు. ఇంత చేసినా కీలకమైన తరుణంలో సమితి సభ్యులు సైలెంట్ అయ్యారు.
పత్తి రైతులు పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. మార్కెట్లో వారిని దళారులు దోపిడీ చేస్తున్నారు. సోయాబీన్‌కూ సరైన ధర రావడంలేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. గిట్టుబాటు ధర రావడంలేదని ప్రతిపక్షమంతా ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇటువంటి తరుణంలో సమితి సభ్యులంతా ఏమయ్యారన్న ప్రశ్న ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. వారిని నడిపించడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందిందన్న భావన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment