రైతులకూ పార్టీలున్నాయ్..
అన్నదాతల గురించి కల్లబొల్లి కబుర్లతో మభ్యపెట్టే నేతలే తప్ప, వారి సమస్యలను పట్టించుకున్న నేతలు ప్రపంచంలో చాలా అరుదు. రైతుల ప్రయోజనాల కోసం పలు దేశాల్లో రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. కొన్ని మూతపడ్డా.. మరికొన్ని చట్టసభల్లో తమ
గొంతు వినిపిస్తున్నాయి.
(పన్యాల జగన్నాథ దాసు): అమెరికాలో పత్తి రైతులు, గోధుమ రైతుల పరిరక్షణ కోసం 1891లో పీపుల్స్ పార్టీ ఏర్పడింది. నాలుగు సార్లు అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ 1908 నాటికే మూతపడింది.
- మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రైతులు, కార్మికుల ప్రయోజనాల కోసం అమెరికాలో 1918లో ఫార్మర్-లేబర్ పార్టీ ప్రారంభమైంది. 1920, 1924 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఈ పార్టీ, 1936లో ఉనికి కోల్పోయింది. కానీ, మనుగడ కొనసాగించిన కాలంలో అమెరికా సెనేట్, ప్రతినిధుల సభల్లో స్వల్పంగా సీట్లు దక్కించుకోగలిగింది.
- కెనడాలో1914లో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ కెనడా ఏర్పడింది. ఇది ఓంటారియో, అల్బెర్టా, మానిటోబా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేయగలిగింది. కానీ, 1930 నాటికి ఇది మూతబడింది.
- {బిటన్‌లో అగ్రికల్చరల్ పార్టీ 1931లో ప్రారంభమైంది. తొలుత నార్‌ఫోక్ ఫార్మర్స్ పార్టీగా ఏర్పడ్డ ఈ పార్టీ, వారం రోజుల్లోనే అగ్రికల్చరల్ పార్టీగా పేరు మార్చుకుంది. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోను, 1933 ఉప ఎన్నిక ల్లోను పోటీచేసినా ఒక్క సీటూ గెలుచుకోలేదు. దశాబ్దానికి మించి ఈ పార్టీ మనుగడ సాగించలేకపోయింది.
- లాట్వియాలో 1917లో ఏర్పడిన లాట్వియన్ ఫార్మర్స్ యూనియన్ రెండు ప్రపంచ యుద్ధాల నడుమ కాలంలో బలమైన పార్టీగా కొనసాగింది. రష్యా నుంచి విడివడి 1918లో లాట్వియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత కీలక పాత్ర పోషించిన ఈ పార్టీ, సైనిక కుట్ర తర్వాత 1934లో నిషేధానికి గురైంది. అయితే, 1990లో లాట్వియా తిరిగి స్వతంత్య్రాన్ని పొందడంతో ఈపార్టీ కూడా పునః ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది యూనియన్ ఆఫ్ గ్రీన్స్ అండ్ ఫార్మర్స్ కూటమిలో భాగస్వామి. 2011ఎన్నికల్లో ఈ కూటమి 13 స్థానాలను గెలుచుకుంది.
- నెదర్లాండ్స్‌లోని ఫార్మర్స్ పార్టీ రెండో ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతినిధుల సభలో చోటు దక్కిం చుకోగలిగింది. ఆ తర్వాత పలు స్థానిక సంస్థల్లో అధికారం లోకి వచ్చినా 1980 తర్వాత ఇది ఉనికి కోల్పో యింది.
- లిథువేనియాలో 2001లో ప్రారంభమైన లిథువేనియన్ పీజంట్ అండ్ గ్రీన్స్ యూనియన్ 2004 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 141 స్థానాలకు 10 స్థానాలు గెలుచు కుంది. 2008 ఎన్నికల్లో మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం ఈ పార్టీ బలహీనంగా మనుగడ కొనసాగిస్తోంది.
- చైనాలో 1930లో ప్రారంభమైన చైనీస్ పీజంట్స్ అండ్ వర్కర్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని పాట్రియాటిక్ యునెటైడ్ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉంది.
- వివిధ దేశాల్లో రైతుల పార్టీల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. స్మాల్ పీజంట్స్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్, టర్కీలోని వర్కర్స్ పార్టీ, పోలండ్‌లో పోలిష్ పీపుల్స్ పార్టీ, బెలారష్యన్ పీజంట్స్ పార్టీ.. తదితర పార్టీలు తమ దేశాల్లో కొంతకాలం కాస్త ప్రభావం చూపగలిగినా, బలం పుంజుకుని నిలదొక్కుకోలేక పోయాయి.