అమెరికా తర్వాత మనమే..
ఎన్నికల ఖర్చు రూ.30 వేల కోట్లు...
ఈసారి లోక్‌సభ ఎన్నికలకు రూ.30 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ మేరకు ఖర్చు చేయనున్నారు. రెండేళ్ల కిందట జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 700 కోట్ల డాలర్లు (సుమారు రూ.42 వేల కోట్లు) ఖర్చు కాగా, ఎన్నికల ఖర్చులో అమెరికా తర్వాతి స్థానం మనదే. లెక్కలకు చిక్కని భారీ సొమ్ము ఎన్నికల కోసం ఖర్చయ్యే అవకాశాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెబుతోంది.
కోటీశ్వరులైన అభ్యర్థులు ఎన్నికల్లో భారీ ఎత్తున సొమ్ము వెదజల్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఖర్చుగా అంచనా వేసిన మొత్తం రూ.30 వేల కోట్లలో ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.7 వేల నుంచి రూ.8 వేల కోట్ల దాకా వెచ్చించాల్సి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ రూ.3,500 కోట్లు ఖర్చు చేయనుంది. ఎన్నికల సమయంలో భద్రత, రవాణా వంటి అవసరాల కోసం హోంశాఖ, రైల్వే శాఖలు కూడా దాదాపు ఎన్నికల కమిషన్ స్థాయిలోనే ఖర్చు చేయనున్నాయి.
అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని రూ.70 లక్షలకు పెంచడం వల్ల కూడా ఈసారి ఎన్నికల ఖర్చు మొత్తం రూ.30 వేల కోట్లు దాట వచ్చనే అంచనాలు ఉన్నాయి. లోక్‌సభ బరిలోని 543 స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులు దాదాపు రూ.4 వేల కోట్ల మేరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇదివరకు అభ్యర్థుల కంటే, వారిని బరిలోకి దించిన రాజకీయ పార్టీలే ఎక్కువగా ఖర్చు చేసేవి. ఇటీవల కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. కొన్నిచోట్ల పార్టీల కంటే భారీగా అభ్యర్థులే ఖర్చు చేస్తున్నారు. ఈ సొమ్మంతా కోటీశ్వరులైన అభ్యర్థులు, కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి వచ్చి పడుతోందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెబుతోంది.