పత్తి రైతుకు మద్దతు | Govt ready to minimum price of cotton: CM Kcr  | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు మద్దతు

Published Thu, Nov 2 2017 1:03 AM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM

 Govt ready to minimum price of cotton: CM Kcr  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పత్తి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. పత్తికి మద్దతు ధర కల్పిస్తామని, అంతకంటే ఎక్కువ ధర వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 3 శాతం పత్తి మాత్రమే మార్కెట్‌కు వచ్చిందని చెప్పారు. వర్షాలతో తడిసిన పత్తికి మాత్రమే తక్కువ ధర వస్తోందని.. ఎక్కువ శాతం పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తోందని పేర్కొన్నారు. పంట రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, వ్యవసాయ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో బుధవారం లఘు చర్చ జరిగింది. విపక్ష సభ్యుల ప్రశ్నలు, సందేహాలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. రైతులకు కనీస మద్దతు ధరలు ఇప్పించే విషయంలో తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటోందని చెప్పారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో గత ప్రభుత్వాలు చేయలేని విధంగా తమ ప్రభుత్వం చేసిందన్నారు. కేసీఆర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 
మద్దతు ధరలో ఇబ్బందులేమీ లేవు 

భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్రాల్లో వడ్లు కొనుగోలు చేయడం 2011 నుంచే నిలిపివేసింది. అప్పట్నుంచి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేశాం. 2016–17లో రూ.8,083 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేశాం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఎఫ్‌సీఐ కొత్త విధానం తెచ్చింది. అప్పుడు ఇప్పటిలో సగం మొత్తం కూడా కేటాయించలేదు. నిరంతర ఉచిత కరెంటు, సాగునీటిపై ప్రభుత్వం చొరవతో పంటలు బాగా పండాయి. 97 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. మా కండ్లు మండలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని రిజర్వ్‌ బ్యాంకు వద్ద రుణ పరిమితిని పెంచుకుంది. రైతులకు కనీస మద్దతు ఇప్పించేందుకు రూ.8 వేల కోట్లతో వడ్లు కొనుగోలు చేసింది.

ఈ ఏడాది వరి పంట ఇప్పుడే వస్తోంది. ప్రస్తుతం 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇవి 5 వేలకు చేరతాయి. రాష్ట్రంలో ఇప్పుడే వడ్లు, మక్కలు, పెసలు, కందుల వంటి పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలో ఇబ్బందులేమీ లేవు. పత్తి విషయంలోనే కొంచెం ఆలోచించాలి. నానిన పత్తిని కొనాలె. రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లోని పత్తి తడిసింది. సాధారణంగా పత్తిని మూడు నుంచి ఐదుసార్లు ఏరుతరు. రాష్ట్రంలో ఈ సారి 48 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. 30 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా ఉంది. ఇప్పటివరకు 92 వేల టన్నులే మార్కెట్‌కు వచ్చింది. ఇంకా 29 లక్షల టన్నులు రావాలి. 

మార్కెట్‌కు వచ్చిన పత్తిలో 50 శాతానికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువే వచ్చింది. ఆదిలాబాద్, నారాయణఖేడ్‌ మార్కెట్‌లకు మహారాష్ట్ర నుంచి రైతులు వచ్చి పత్తి అమ్ముతున్నారు. వాళ్ల రాష్ట్రంలో కంటే ఇక్కడ అధిక ధర వస్తోందని చెబుతున్నారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీపీఐ) మొత్తం పత్తిని కొనదు. కనీస మద్దతు ధర వచ్చేలా జోక్యం చేసుకుంటుంది. ఎక్కువ శాతం పత్తిని ప్రైవేటు వ్యాపారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులే కొనుగోలు చేస్తారు. కేంద్రం పత్తికి క్వింటాల్‌కు రూ.4,300 కనీస మద్దతు ధర ఖరారు చేసింది. బయట ధర వస్తుండడంతో సీసీఐ వద్దకు వెళ్లడం లేదు. 

ఎక్కువగా తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ నిరాకరిస్తోంది. పత్తి కొనుగోలుపై ఈ రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. పత్తి ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే రెండు, మూడు స్థానంలో ఉంది. భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేసే వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. అక్కడ ఎక్కువగా స్పిన్నింగ్‌ మిల్లులు ఏర్పాటవుతాయి. ప్రభుత్వపరంగా విడుదల కావాల్సిన రాయితీలు ఇస్తే రాష్ట్రంలో స్పిన్నింగ్‌ మిల్లులను ఏర్పాటు చేస్తామని, ఎక్కువ పత్తి కొంటామని పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చారు. పత్తి రైతుకు ఎంఎస్‌పీ, అంతకంటే ఎక్కువ ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. 

ఉచిత విద్యుత్‌ మొదలుపెట్టింది వైఎస్సార్‌గారు.. 
ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వడం గౌరవనీయులు వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు మొదలుపెట్టారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.. మేం కాదంటే అది తప్పు అవుతుందా? అది అందరం అంగీకరించాల్సిందే. ఇప్పుడు మేం నిరంతర కరెంట్‌ ఇస్తున్నాం. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో కరెంటు వినియోగం 3 వేల మెగావాట్ల నుంచి 4 వేల మెగావాట్ల మధ్య ఉండేది. నిరంతర సరఫరాతో ఇప్పుడు 10 వేల మెగావాట్లకు చేరింది. పక్కరాష్ట్రంలోనే కాదు మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి. అయితే పక్కరాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేస్తామని అక్కడ చెప్పారు. కానీ రెండు విడతలు మాత్రమే ఇచ్చారు. 56 అంశాలను పెట్టి ఏదో చేశారు. పక్కరాష్ట్రం మన కంటే దేంట్లోనూ ఇదిగా లేదు.  

వడ్డీ భారం ఎక్కడుందో చెప్పండి.. 
రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ విషయంలో మా వైఖరి నిరూపించాం. రుణమాఫీ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 35.30 లక్షల మంది రైతులకు రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేశాం. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆర్థిక సంఘం మాజీ సలహాదారు జీఆర్‌రెడ్డి సూచన మేరకు నాలుగు దశల్లో పూర్తిగా చెల్లించాం. వేల కోట్ల రూపాయలను చెల్లించిన మాకు వంద, రెండొందల కోట్లు చెల్లించడానికి ఇబ్బందా? రుణమాఫీ అయిన రైతులకు వడ్డీ భారం పడిందని గతంలో శాసనసభలో విపక్ష నేత జానారెడ్డిగారు చెప్పినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే జాబితా ఇవ్వండి. వారికి ఇవ్వాల్సిన మొత్తం చెల్లిస్తామని సభలోనే చెప్పా. ఆ తర్వాత బ్యాంకర్లను ఈ అంశంపై సమాచారం కోరాం. ఎక్కడా వడ్డీ చెల్లింపు అంశం లేదని చెప్పారు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లిన సందర్భంలోనూ ఎవరు ఇలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదు. ఆ సమయంలో ఒంటరి మహిళలు తమకు ఆసరా కావాలని కోరారు.

వారికి పింఛన్‌ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నాం. వడ్డీ భారం విషయం ఏమీ లేదని బ్యాంకర్లు, అధికారులు చెప్పారు. రుణాలు మాఫీ అయినట్లు ఫామ్‌–ఎఫ్‌ జారీ చేస్తున్నట్లు బ్యాంకర్లు చెప్పారు. ప్రజలకు సమస్యలు ఉంటే ఒక్క కాంగ్రెస్‌ వారి వద్దకే రారు. మా పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ విషయంపై ఫిర్యాదులు రావాలి. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. రుణమాఫీ అయి వడ్డీ భారం పడిన వారు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. అసెంబ్లీ జరుగుతోంది. సమావేశాలు ముగిసేలోపు అయినా.. మరో పది రోజుల్లో అయినా ఫర్వాలేదు అలాంటి రైతుల వివరాలు ఉంటే తీసుకురండి. 

స్పీకర్‌కు ఇవ్వండి. వెంటనే వాటిని ఇక్కడే పరిశీలించి అవసరమైన చెల్లింపులు జరుపుతాం. రూ.16 వేల కోట్లు చెల్లించినప్పుడు... ఇంకో వందో, మూడొందల కోట్లు భారమవుతాయా? రైతులకు మొదటి విడత రుణమాఫీ జరిగినప్పుడే బ్యాంకులు రెన్యూవల్‌ చేశాయి. నిజమైన రైతులు అనేవారు రుణమాఫీ విషయంలో ఆలస్యం చేయరు. ఆలస్యం అయిందంటే ఏదో మతలబు ఉంటుంది. మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో నకిలీ పాస్‌బుక్కులతో బ్యాంకు అధికారులు రుణాలు తీసుకున్నారు. కచ్చితంగా రైతు అయితే మాఫీ విషయంలో ఆలస్యం జరగదు. అయినా సరే వడ్డీ భారం ఉన్న రైతుల వివరాలు ఉంటే తీసుకు రండి. ఖమ్మం జిల్లాలో అటవీ ప్రాంతాల్లోని రైతులకు రుణ మాఫీ, వడ్డీ భారం విషయం గతంలో పరిశీలించాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారి జాబితాతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వస్తే పరిశీలిస్తా. 

నకిలీలపై ఉక్కుపాదం 
కల్తీ, నాసిరకం విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలె. బ్రాండెడ్‌ కంపెనీలు నాణ్యత విషయంలో రాజీపడవు. ధర విషయంలో తగ్గింపులు ఉండవు. మోసగాళ్లు నాసిరకం విత్తనాలు తయారు చేసి తక్కువ ధరకు అమ్ముతరు. కొందరు రైతులు చేతిలో డబ్బుల్లేని సందర్భాల్లో, ఉద్దెర వస్తుందనో ఇలాంటివి కొంటరు. తర్వాత అన్యాయానికి గురవుతరు. నాసిరకం విత్తనాలు అమ్మిన ఏడుగురిపై పీడీ చట్టం పెట్టాం. నకిలీ విత్తనాలకు ఈ చట్టం వర్తించదని వారు కోర్టుకు వెళ్లారు. పీడీ యాక్టులో ఇటీవల నాసిరకం విత్తనాలను చేర్చాం. దీనిపై ఆర్డినెన్స్‌ తెచ్చాం. దీన్నే ఇప్పుడు సభలో చట్టం చేయబోతున్నాం.

రాళ్ల వానలతో నష్టపోయిన రైతులకు రూ.20 కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చా. విపత్తులతో నష్టపోతే ఇచ్చేది నష్టపరిహారం కాదు. కేవలం సహాయ చర్య మాత్రమే. నష్టం వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వారికి ఇచ్చేది అప్పటికి ఆసరాగా ఉండేలా కొంతే ఉంటుంది. దీన్ని నష్టపరిహారం అనడం సరికాదు. పంటల బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేస్తోంది. రైతు యూనిట్‌గా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రతిపాదించాం. 
 
బోనస్‌ ఇవ్వాలి:
కె.జానారెడ్డి, సీఎల్పీ నేత 
రాష్ట్రంలో పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని గతంలో డిమాండ్‌ చేశాం. సాధ్యం కాదని నాలుగు దశల్లో చేస్తామని చెప్పారు. తొలిదశ రుణమాఫీ జరిగిప్పుడు మిగిలిన మొత్తానికి వడ్డీ పడుతుందని, దాన్ని ప్రభుత్వమే భరించాలని కోరాం. అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్‌ దీనిపై హామీ ఇచ్చారు. ఇప్పటివరకు నెరవేర్చలేదు. వడ్డీ భారంపై బ్యాంకులతోనే నివేదికలు తెప్పించండి. పంటలకు మద్దతు ధరలు కల్పించాలి. పక్క రాష్ట్రంలో వడ్డీ మాఫీపై చేసినట్లుగా ఇక్కడా చేయాలి. వరి, కంది, పత్తి వంటి పంటలకు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా బోనస్‌ ఇవ్వాలి. పత్తికి కనీసం వెయ్యికి తగ్గకుండా బోనస్‌ ఇవ్వాలి. సీఎం కొన్ని విషయాలలో బాగా ఉదారంగా ఉంటారు. రూ.3 వేల బోనస్‌ ఇచ్చినా మంచిదే. 

వడ్డీ భారం భరించాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 
రుణ మాఫీ దశల వారీగా చేయడం వల్ల రైతులపై వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ఈ వడ్డీని భరించాలి. తహశీల్దార్లు, ఎమ్మెల్యేలతో దరఖాస్తులు తెప్పించేలా సీఎం ప్రకటన చేయాలి. వారం రోజులు గడువు ఇస్తే జాబితా తెప్పిస్తాం. 

పరిహారం చెల్లించలేదు: జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత 
రాష్ట్రంలో రైతులు తక్కువ మంది మాత్రమే పంటల బీమా పథకంలో చేరుతున్నారు. పంట నష్టపరిహారం చెల్లింపులో కంపెనీల తీరు సరిగా లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కంపెనీలు రైతులకు చెల్లించలేదు. విపత్తుల పరిహారాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయలేదు. 

నాసిరకంపై చర్యలేవి?: సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే 
కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. నాసిరకం వరి, పత్తి, మిరప విత్తనాలతో ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో రైతులు నష్టపోయారు. వినియోగదారుల ఫోరంలో రైతులు కేసులు వేస్తే వ్యవసాయ శాఖ సరైన వాదనలు వినిపించడం లేదు. ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ చెప్పలేదు. ఏజెన్సీ ప్రాంతంలో రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అర్హులు ఇంకా ఉన్నారు. చెల్లింపులు జరపాలి. 

 
మేం మేలురకం.. మీరు నాసిరకం 

వ్యవసాయ అంశాలపై జరిగిన చర్చల్లో సీఎం చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వించాయి. పత్తి రైతులకు కనీస మద్దతు ధక్కడం లేదని, బోనస్‌ ఇవ్వాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ.. ‘ఏ పంటకైనా నాణ్యతోనే ధర ఉంటుంది. మేలు రకంగా ఉన్న పంటకు ఒక ధర.. నాసిరకంగా ఉన్న పంటకు ఇంకో ధర పలుకుతది. తేమ శాతాన్ని బట్టి పత్తి ధర నాలుగు రకాలుగా ఉంది. కేంద్ర ప్రకటించిన ధరలోనే ఇలా ఉంది. ఇదే అంశం రాజకీయాలకు వర్తిస్తుంది.

ఎవరేం చేస్తున్నారో ప్రజలు, రైతులు చూస్తున్నారు. అంతిమంగా వారే నిర్ణయిస్తారు. అందరం ప్రజలకు దగ్గరకు వెళ్లాల్సిందే. అయితే వేర్వేరు జెండాలతో వెళ్తాం. మేలు రకం వారికి మేలు ధర, నాసిరకం వారికి నాసిరకం ధర పలుకుతుంది. అప్పుడు(గత ఎన్నికల్లో) మేం మేలురకం అయ్యాం. మీరు నాసిరకం అయ్యారు. మళ్లీ వెళ్తాం. ఎవరు మేలురకమో, ఎవరు నాసిరకమో ప్రజలు నిర్ణయిస్తారు’అని అనడనంతో అన్ని పార్టీల సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement