సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రుణ ప్రణాళిక లేకపోవడం, పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగుమందుల కారణంగా రైతులు అప్పులపాలై దిక్కుతోచనిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ మంగళవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. మిర్చి, పత్తి రైతుల పరిస్థితి తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. ఒక్క మహబూబ్‌బాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. రైతులకు ఒక్క ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుందని, ప్రతి రైతుకు రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు అప్పు ఉందని, అప్పులబాధలు భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధిత రైతు కుటుంబాలకు వెంటనే రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పుల విషయమై ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆ కుటుంబాల్లోని పిల్లలను ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలని కోరారు. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, కల్తీ, నకిలీ పురుగుమందుల నివారణకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతువేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment