
సాక్షి, హైదరాబాద్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), రాష్ట్ర ప్రభుత్వ పరస్పర సహకారం ద్వారా పత్తిని రైతుల నుంచి చివరి కిలో దాకా మధ్య దళారుల వ్యవస్థ లేకుండా కేంద్రం కొనుగోలు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. పత్తిలో 12 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ.5,232కు కొనుగోలు చేయాలని, మూడు నుంచి ఏడు రోజుల్లోగా రైతుల ఖాతా ల్లోకి నేరుగా నగదు జమచేయాలని సీసీఐను కేంద్రం ఆదేశించిందని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు.
శనివారం సీసీఐ సీజీఎం (మార్కెటిం గ్) ఎస్‌కే పాణిగ్రాహి, సీసీఐ జీఎం అతుల్ ఖాలా, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్, వరంగల్ రీజినల్ మేనేజర్ జయకుమార్ తదితరులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరుపై నివేదిక తెప్పించుకుంటామని కిషన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన తన దృష్టికి రాగానే డీజీపీతో, ఎంపీ సంజయ్‌తో మాట్లాడినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా జి.కిషన్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో జరిగే ఉగ్రవాద ప్రభావిత దేశాల హోంమంత్రుల అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు.