రహదారిపై బైఠాయించిన రైతులు
ఆసిఫాబాద్ అర్బన్: పత్తికి గిట్టుబాటుధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమురంభీం జిల్లా రైతులు రోడ్డెక్కారు. జిల్లా రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లోని అంబేడ్కర్ చౌక్ వద్ద హైదరాబాద్–నాగ్‌పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. విత్తనాలు, ఎరువులు, కూలిరేట్లు పెరగడంతో పెట్టుబడి రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాల్‌కు రూ.15 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు వచ్చి రైతులకు మద్దతు పలికారు. అనంతరం కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. సీసీఐ అధికారులు, మిల్లుల యజమానులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేవిధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment