గుంటూరు నుంచి నకిలీ విత్తనాల దిగుమతి
కమీషన్లు ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్ చేయిస్తున్న వైనం
పడకేసిన విజిలెన్స్.. పట్టించుకోని వ్యవసాయాధికారులు
పత్తిరైతును నకిలీ విత్తనాలు చిత్తు చేస్తున్నాయి. మిగతా పంటలకు విత్తనాలను అందిస్తున్న ప్రభుత్వం పత్తి విత్తనాలు మాత్రం అందించడం లేదు. దీంతో బయటి మార్కెట్లోనే కొనాల్సి వస్తోంది. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు బయట నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి అంటగడుతున్నారు. ఈ విత్తనాలు వేసిన రైతులు సరైన దిగుబడి రాక నష్టాల పాలవుతున్నారు. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతున్నా.. వాటిని నియంత్రించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
మహబూబ్ నగర్ వ్యవసాయం:
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి రైతులు విత్తనాల సేకరణలో పడ్డారు. అయితే, వర్షాలకంటే ముందుగానే నకిలీ పత్తి విత్తనాలు జిల్లాను ముంచెత్తాయి. అక్కడక్కడా అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. నకిలీ విత్తనాల ముఠా మాఫీయాగా ఏర్పడ్డారు. ప్రధాన కంపెనీలకు చెందిన బ్రాండ్ల పేరుతో నకిలీ విత్తనాలను తయారు చేయిస్తున్నారు. వాటిని తమకు అనుకూలంగా వ్యవహరించే డీలర్లకు చేరవేస్తూ అక్కడి నుండి రైతులకు అంటగడుతున్నారు. గుంటూరుకు కొందరు పత్తి విత్తనాల వ్యాపారులు.. జిల్లాలోని కొందరు సీడ్స్ డీలర్లు, స్థానిక నాయకులు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం.
నకిలీ దందా ఇలా..
గుంటూరుకు చెందిన వ్యక్తులు అక్కడి నుంచి తక్కువ ధరకు దాదాపు కిలో రూ.100-200 లెక్కన నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి తమ రహస్య ప్రదేశాలకు చేరవేస్తున్నారు. వాటిని ఎక్కువగా పత్తి సాగుచేసే గద్వాల, ధరూర్, అచ్చంపేట, కల్వకుర్తి, మిడ్జిల్, భూత్పూర్, షాద్‌నగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మాఫియా దాదాపుగా 20చోట్ల వీటిని అమ్మేందుకు కొందరు వ్యక్తుకు బాధ్యత అప్పగించింది. వీరికి ప్యాకేట్‌కు రూ.100 నుంచి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తుల్లో గతంలో సీడ్ కంపెనీలో పనిచేసి మానేసిన వ్యక్తులు, పత్తివిత్తనాల ప్యాకింగ్‌లో అనుభవం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరికి నకిలీ విత్తనాల పంపిణీ నుండి ప్యాకింగ్ చేసేందుకు పౌచ్‌లు(ఖాళీప్యాకేట్ లు), విత్తనాలకు బీటీ రంగులు అద్దడానికి రంగు, ప్యాకింగ్ హీట్‌మిషన్, తుకాల నిర్వహణకు కాంటాలను మాఫీయా సభ్యులే సమకురుస్తున్నారు. ఇలా వీటి ప్యాకింగ్‌కు కావాల్సిన కూలీల ఖర్చులను, రవాణాకు మాఫీయా సభ్యులే అదనంగా భరిస్తారు.
దుకాణదారులే సూత్రధారులు
జిల్లాలో లెసైన్స్ పొందిన కొందరు సీడ్ దుకాణందారులు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మార్జీన్‌మనీ సంపాదించవచ్చనే ఆశతో కొందరూ డీలర్లు మాఫియాతో చేతులు కలిపారు. వీరంతా తమకు అనుకూలంగా ఉండే మరికొందరు డీలర్లను కలుపుకుని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పత్తివిత్తనాలు ఎక్కువగా అమ్ముడయ్యే ప్రాంతాలలో ఒక్కరిద్దరు దుకాణదారులను గుర్తించి వారికి ఎక్కువ మార్జిన్‌మనీ ఆశ చూపి పంపిణీ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం ఎక్కువగా కల్వకుర్తి, గద్వాల్, షాద్‌నగర్, మిడ్జిల్, వంగూరు, ఐజ, ధరూర్, భూత్పూర్, అచ్చంపేట, బిజినపల్లి, నాగర్‌కర్నూల్, కోస్గి, నారాయణపేట మండలాల్లో కొందరు దుకాణాదారులు కీలకంగా వ్యవహరిస్తురనే ఆరోపణలున్నాయి.
ప్రధాన కంపెనీల బ్రాండ్ల మాదిరిగా తయారీ...
బహిరంగ మార్కెట్ ఎక్కువగా అమ్ముడుపోయే ప్రధాన కంపెనీ (కావేరి, జాదు, వ సంత సీడ్స్, నూజీవీడు సీడ్స్ వంటి కంపెనీలకు చెందిన )రకాల మాదిరిగా పౌచ్‌లను ప్రింట్ చేయించి విత్తనాల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇలా తయారు చేసిన విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా షాపులకు చేరవేస్తున్నారు. మార్కెట్లో వీటిని దర్జాగా అమ్మేస్తున్నారు.
తప్పుడు ధ్రువపత్రాలతో మరికొందరు..
సీడ్ విత్తనాలను ప్యాకింగ్ చేసి అమ్మేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొన్ని కంపెనీలు తప్పుడు చిరునామాతో అధికారులను బురడీ కొట్టిస్తూ నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు హైదరాబాద్ నగరం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం, కర్ణాటక వంటి ప్రాంతాలలోని చిరునామాతో ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్‌కు అనుమతులు పొందుతున్నారు. తీరా చూస్తే అదే అడ్రస్‌పై దొంగచాటుగా గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు.
దీంతో అధికారులు వారు చిక్కడం లేదు. గద్వాల్, జడ్చర్ల, భూత్పూర్, కల్వకుర్తి వంటి ప్రాంతాలలో కొందరు హైదరాబాద్,మహబూబ్‌నగర్ పట్టణం అడ్రస్‌లతో అనుమతులు పొంది రహస్య ప్రదేశాలలో రాత్రివేళ్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా దొంగచాటుగా ప్యాకింగ్ చేసిన వాటిలో కొన్నింటిని ఇతర ప్రాంతాలకు తరలించగా మరికొన్నింటిని సొంతంగా సీడ్‌దుకాణం లెసైన్స్ పొంది అమ్మేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏదో అడపా దడపా తప్ప పూర్తిస్థాయిలో వీటిని నివారించడంలో విజిలెన్‌స, వ్యవసాయాధికారులు శ్రద్ధ కనబర్చడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పత్తి రైతుకు నకిలీ దెబ్బ
Published Wed, Jun 17 2015 11:41 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement