విత్తన పత్తి రైతులకు పరిహారం చెల్లించాలి
► ఎమ్మెల్యే డీకే ఆరుణ
► చలో అసెంబ్లీని భగ్నం చేసిన పోలీసులు
దోమలగూడ : నష్టపోయిన గద్వాల విత్తన పత్తి రైతులకు కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు నుంచి రైతులు చేపట్టిన చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకొని అరెస్టులతో భగ్నం చేశారు. తెలంగాణ రైతాంగ సమితి, రైతు సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద వేర్వేరుగా రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శనగా చలో అసెంబ్లీ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు అనుమతి లేదంటూ రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా రైతులను అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ధర్నాలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్యే డీకే అరుణ, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు టి. సాగర్, ప్రసాదరావు తదితరులు, రైతాంగ సమితి ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముడుపు నర్సింహరెడ్డి, సహాయ కార్యదర్శి జక్కుల వెంకటయ్య, నాయకులు సాయన్న, జి గోపాల్, పి రామిరెడ్డి, గోవింద్, శంకర్‌రెడ్డి మాట్లాడారు. గద్వాల డివిజన్‌లో ఆరు మండలాల్లో దాదాపు 50వేల ఎకరాల్లో 20వేల మంది రైతులు పత్తి విత్తనాలను పండిస్తారని, వీరికి కావేరి, అంకుర్, రాశి, బయోసీడ్, నూజివీడు, జేకే అగ్రి జెనిటిక్స్, సత్య తదితర కంపెనీలు విత్తనాలు సరఫరా చేస్తాయని అన్నారు. విత్తనపత్తికి కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం ప్రకారం రైతుకు, కంపెనీకి రాతపూర్వక ఒప్పందం ప్రకారంగా జరగాలని, రైతుకు గిట్టుబాటు ధర, పెట్టుబడి, సాంకేతిక సహకారం కంపెనీ ఇవ్వాలని అన్నారు.
రైతులను దోచుకుంటున్నారు
విత్తన కంపెనీలు దళారుల ద్వారా రైతులకు విత్తనాలు సరఫరా చేస్తారని, వీరు రైతులు పండించిన విత్తనాల ధర విషయంలోనూ, పెట్టుబడి కోసం ఇచ్చిన డబ్బులపై వడ్డీరూపంలో రైతులను దోచుకుంటున్నారని అన్నారు. రెండు దశాబ్దాలుగా గద్వాలలో కొనసాగుతున్న దోపిడి ఇది అని వాపోయారు. విత్తన బాంఢాగారం గురించి హోరె త్తిస్తున్న ప్రభుత్వం విత్తన కంపెనీల వల్ల మోసపోయిన రైతుల గురించి నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు.
గద్వాలలో విత్తన కంపెనీలు, దళారులు కలిసి రైతులపై కొనసాగిస్తున్న దోపిడీ, దౌర్జన్యాలకు బంగారు తెలంగాణలోనూ అంతం లేదా? అంటూ ప్రశ్నించారు. కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం ఇచ్చిన జీఓ 458ని అమలు చేయక పోవడాన్ని చూస్తే కంపెనీల ప్రభుత్వమా, ప్రజా ప్రభుత్వమా అనే సందేహం కలుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం కంపెనీలు రైతులకు 60 శాతం పెట్టుబడి న ష్టాన్ని పరిహారంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.