పత్తి రైతు దగా.. | Dishonesty cotton farmer .. | Sakshi
Sakshi News home page

పత్తి రైతు దగా..

Published Mon, Jan 12 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

పత్తి రైతు దగా..

పత్తి రైతు దగా..

‘ముందు దగా.. వెనుక దగా.. కుడి ఎడమల దగా దగా’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు పత్తి రైతుల విషయంలో అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు బోరాలతో కొనుగోలు కేంద్రానికి  వచ్చిన రైతులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. సరుకు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన దగ్గరి నుంచి, చెక్కు చేతికొచ్చే వరకు ప్రతి దశలోనూ రైతు జేబుకు చిల్లుపెడుతున్నారు. పత్తి లోడు వాహనం లోనికి ప్రవేశించాలంటే గేట్‌పాస్, పనిచేసే సిబ్బందికి, కాటా వేసిన ముఠాకు ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందే.

ఇవన్నీ చాలవన్నట్లు బయ్యర్ పాసింగ్ చేసే సమయంలో నాణ్యత సాకుచూపి ఒక్కో బోరానికి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు తగ్గించేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే సరుకు కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. ఈ ప్రక్రియలన్నీ ముగిసి, బిల్లు మంజూరైనా చేయి తడపనిదే చెక్కు రైతు చేతికి రావడం లేదు. ఈ అవకతవకల కారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రానికి వెళ్లాలంటే రైతులు వెనకడుగు వేస్తున్నారు.

 
చిలకలూరిపేటరూరల్ : పుడమితల్లినే నమ్ముకుని పత్తి పండించే కర్షకులు అడుగడుగునా దగాపడుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరను అందిస్తామన్న నేతల హామీలు అమలులో పూర్తిగా విఫలమయ్యారుు.

సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయశాఖ  మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట ప్రారంభించిన  సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే సీసీఐ సిబ్బంది, యార్డు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో నాణ్యత లోపించిందని, నెమ్ము ఉందని బోరాల్లో కొంత పత్తిని తీసి లెస్‌లు విధిస్తున్నారు. ప్రశ్నించిన రైతులను బ్లాక్‌లిస్టులో (విక్రయానికి తీసుకువచ్చిన పత్తిని తిరస్కరిస్తున్నారు) చేరుస్తున్నారు. ఈ తలనొప్పుల కారణంగా సీసీఐ కేంద్రాలకు రాకుండా గ్రామాల్లోనే అందినకాడికి సరుకు అమ్మేసుకుంటున్నారు.
 
కొనుగోళ్లు నాలుగో వంతే..
చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మూడు మండలాల్లో రైతులు అధికశాతం 52,890 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ పంట నుంచి ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున 5,28,900 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీటి ప్రకారం ఇప్పటికే నాలుగో వంతు, అంటే 1,32,225 క్వింటాళ్ల దిగుబడి లభించింది. కానీ ఇప్పటి వరకు చిలకలూరిపేట కొనుగోలు కేంద్రంలో 32,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

పత్తిదిగుబడి ప్రారంభంలో కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. నాటి నుంచి పత్తిలో తేమ శాతం ఆధారంగా కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. పత్తి పింజ పొడవు 29.5 నుంచి 30.5 ఉండి, తేమశాతం(మైక్రోనైర్) 3.5 నుంచి 4.3గా ఉన్న పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర రూ.4,050కు కొనుగోలు చేస్తామన్నారు. పింజ పొడవు 27.5 నుంచి 28.5, తేమ శాతం 3.5 నుంచి 4.7 ఉన్న పత్తిని రూ.3,950 అందిస్తామన్నారు. సీసీఐ ప్రకటనలతో హర్షించిన రైతులు అంతా నిజమేనని నమ్మారు. తీరా కేంద్రాల్లో ఆశించిన స్థారుులో చెల్లింపులు లేవు. లేని పోని కారణాలతో వేధిస్తూనే ఉన్నారు.
 
పాసింగ్‌కు ముందు.. తర్వాత..
సరుకు లోనికి ప్రవేశించాలంటే గేట్‌పాస్ పేరిట వాచ్‌మెన్ ఆటోకి రూ.100, ట్రాక్టర్‌కి రూ.200 వసూలు చేస్తున్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది బోరానికి రూ.40 చొప్పున గుంజుతున్నారు. ఒక పత్తి బోరెం కాటా వేస్తే రూ.5, యార్డుకు రూ.5, ముఠాకు మరో రూ.5 చెల్లించాల్సి వస్తోంది. బయ్యర్ పాసింగ్ చేసే సమయంలో పత్తిలో తేమశాతం అధికంగా ఉందని, గుడ్డికాయ ఎక్కువగా ఉందని, పత్తి పింజ పొడవు తగ్గిందని తదితర కారణాలు చూపుతూ ఒక్కో బోరెం నుంచి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు లెస్ చేస్తున్నారు. అది కూడా ప్రతి బోరెం నుంచి పత్తిని తీయకుండా ఒక రైతుకు ఒక బోరెం నుంచి ఆ మొత్తాన్ని తీస్తున్నారు.  
 
ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విక్రయించిన పత్తి తాలూకు బిల్లు మంజూరు అయ్యేందుకు మరో ఇరవై రోజులు పడుతుంది. ఈ సమయంలో రైతుల పేరుతో చెక్కు రాసినందుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వీటితో పాటు కొనుగోలు కేంద్రానికి వచ్చే ముందు అనేక పత్రాలను మార్కెట్ యార్డులో అందించాల్సి వ స్తోందని పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి సీసీఐ కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు.
 
నాణ్యతలేని బోరాల్లో రెండు కేజీలు తీస్తున్నాం..
మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సక్రమంగానే ఉన్నాయి. రైతులు తీసుకువచ్చిన పత్తిలో నాణ్యత లోపిస్తే తిరస్కరిస్తున్నాం. రైతులు తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తించిన బోరెం నుంచి రెండు కేజీలు లెస్ చేస్తున్నాం.
 - వీరబాబు, సీసీఐ బయ్యర్, చిలకలూరిపేట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement