unjustice
-
‘రాష్ట్రంలో బీసీలకు అన్యాయం’
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, బస్వ లక్ష్మీనర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్, జిల్లా ఇన్చార్జి నీలకంఠ రాజు తదితరులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు. బీసీల సంక్షేమానికి నిధులివ్వాలని కోరుతూ కలెక్టర్ రామ్మోహన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించినా వాటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి కేవలం రూ. 5,919.83 కోట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓబీసీలకు చట్ట సభలు, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, ఉపాధ్యక్షులు రాజన్న, నాయకులు అరుణ్, శ్రీనివాస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్యాయం... అధర్మం!
ముక్కారు పంటలతో, పచ్చని పరిసరాలతో మెరిసిపోవడమే కాదు...లక్షలాది కుటుంబాలకు జీవికగా ఉంటున్న తుళ్లూరు ప్రాంతాన్ని కాంక్రీటు కీకారణ్యంగా మార్చడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుంది. రైతుల రోదనలనూ, కూలీల ఆక్రందనలనూ బేఖాతరు చేస్తూ...అన్నా హజారే, మేథా పాట్కర్, స్వామి అగ్నివేశ్, వడ్డే శోభనాద్రీశ్వరరావువంటి సామాజిక ఉద్యమకారుల, మేథావుల, రాజకీయపక్షాల, ప్రజాసంఘాల హితవచనాలను పెడచెవిని పెట్టి బలవంత భూసేకరణకు ప్రభుత్వం తెగించింది. సవరణలతో స్వభావాన్ని మార్చుకుంటుందో... అందరి నిరసనలతోనూ ఆవిరైపోతుందో అర్థంకాని భూసేకరణ ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన నోటిఫికేషన్ జారీచేసింది. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పడుతుందని ప్రకటించినప్పుడు ఏం చెప్పారు? ఆ ప్రాంత రైతులను ఒప్పించి, మెప్పించి భూములు తీసుకుంటామని ప్రకటించారు. అన్నదాతలను ఇబ్బందిపెట్టి, వారిని బలవంతపెట్టి లాక్కోబోమన్నారు. తీరా ఇప్పుడు విడుదలైన నోటిఫికేషన్ రైతుల గుండెలపై తుపాకి గురిపెడుతున్నది. ఇస్తావా...చస్తావా తేల్చుకోమంటున్నది. మరో ప్రత్యామ్నాయం లేదంటున్నది. పదకొండేళ్లక్రితం అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఉసురుపెట్టడంలో చంద్రబాబు అపకీర్తి గడించారు. వారు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని... ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఎగ్గొడుతున్నారని తరచు విరుచుకుపడేవారు. అలాంటి ఆరోపణలపై ఎందరో అన్నదాతలు జైళ్లపాలయ్యారు కూడా. ఇన్నాళ్లకు మళ్లీ ఆయనకొక అవకాశం వచ్చింది. ఇప్పుడు భూసేకరణ నోటిఫికేషన్‌తో రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టించడానికి సిద్ధపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం మొన్న డిసెంబర్లో 2013నాటి భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీచేసినప్పుడు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలతోసహా దాదాపు అన్ని పార్టీలూ నిరసనలు వ్యక్తంచేశాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉలక లేదు... పలకలేదు. అందులోని ఆంతర్యమేమిటో తాజాగా జారీ అయిన నోటిఫికేషన్ వెల్లడిస్తున్నది. ఆరు దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న భూసేకరణ చట్టంవల్ల దాదాపు ఆరుకోట్లమంది నిర్వాసితులు కాగా వారిలో 20 శాతంమందికి కూడా పునరావాసం దక్కలేదు. ప్రజా ప్రయోజనాల పేరుతో, అభివృద్ధి పేరుతో అమ్మ లాంటి పంటభూమిని పాలకులు తన్నుకుపోతున్న తీరుపై దేశవ్యాప్తంగా రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. నెత్తురు చిందించారు. ప్రాణాలొడ్డారు. అలాంటివారి త్యాగ ఫలితంగా కాస్త మెరుగైన చట్టం అమల్లోకి వచ్చిందనుకునే లోగానే ఎన్డీయే సర్కారు భూ సేకరణ ఆర్డినెన్స్‌తో దానికి సవరణలు తీసుకొచ్చింది. అటు తర్వాత నిరసనలు వ్యక్తం కావడంతో ఆ ఆర్డినెన్స్‌ను కూడా సవరించుకుని మరో ఆర్డినెన్స్ జారీచేసింది. దాన్ని సైతం అంగీకరించేది లేదని సామాజిక ఉద్యమకారులు, రైతులు కత్తులు నూరుతున్నారు. అందువల్లే లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్నా మొన్న ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీయే సర్కారు ఈ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే సాహసం చేయలేదు. అదిప్పుడు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. ఆ కమిటీ ఎలాంటి సూచనలు చేస్తుందో, అలా వచ్చే సూచనలపై కేంద్రం ఏం చేయదల్చుకున్నదో ఇంకా తేలాల్సి ఉన్నది. మరో పక్క సుప్రీంకోర్టులో ఆ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఇవన్నీ ఒక కొలిక్కి రాకుండానే ఆ ఆర్డినెన్స్‌ను అడ్డంపెట్టుకుని నోటిఫికేషన్ జారీచేయడం దారుణం. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం దేశంలో భూసేకరణ ఆర్డినెన్స్‌పై పోరాడుతున్నవారందరికీ కొత్త ఆయుధాన్నిచ్చింది. ఆర్డినెన్స్ చట్టమైతే ఎలాంటి పరిణామాలేర్పడగలవో చెప్పడానికి అవకాశం చిక్కింది. ప్రాజెక్టుల అవసరాన్నిబట్టి సామాజిక ప్రభావ మదింపు చేయాలో వద్దో నిర్ణయించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తే వారు ఆ నిబంధనను తమకు అనుకూలంగా మలుచుకో గలరని... ఇష్టానుసారం వ్యవహరించగలరని తాజా నోటిఫికేషన్ వెల్లడిస్తున్నది. అసలు ఈ భూముల వ్యవహారాన్ని గందరగోళపరచడానికి ఆదినుంచీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. రాజధాని ప్రాంతం కోసమని 57,000 ఎకరాలు సేకరించదల్చుకున్నట్టు, భవిష్యత్తులో దాన్ని లక్ష ఎకరాలకు పెంచనున్నట్టు మొదట్లో ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకూ 44,000 ఎకరాలకు సంబంధించి భూ సమీకరణ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిపై వచ్చిన అభ్యంతరాలకు ప్రభుత్వం వైపునుంచి ఇంతవరకూ జవాబు లేదు. ఈలోగా రైతులు స్వచ్ఛందంగా క్యూ కట్టి 33,400 ఎకరాల భూమిని తీసుకోమంటూ అంగీకార పత్రాలిచ్చారని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా ఇప్పుడు చెబుతున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. తమకు 14,800 ఎకరాలకు సంబంధించిన అంగీకారపత్రాలు అందాయని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇప్పుడు భూ సమీకరణకు అంగీకరించకుండా కోర్టుకు వెళ్లినవారి నుంచి దాదాపు 900 ఎకరాల సేకరణే లక్ష్యంగా తాజా నోటిఫికేషన్ జారీచేశామని ఆయన మాట్లాడుతున్నారు. ఇందులో నిజానిజాలేమిటో, ఇప్పుడు జారీచేసిన 166 జీవోలోని ఆంతర్యమేమిటో మున్ముందుగానీ తెలిసే అవకాశం లేదు. భూ సమీకరణకు అంగీకార పత్రాలిచ్చిన రైతుల్లో కొందరు తమను బెదిరించి, భయపెట్టి ఆ పత్రాలు తీసుకున్నారని హైకోర్టును ఆశ్రయించారు. దానిపై న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలిచ్చి విచారిస్తుండగానే ఆదరాబాదరాగా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం ఏం న్యాయం? రాజధాని గురించి ప్రకటించిన తొలినాళ్లలో భూ సమీకరణ ద్వారా మాత్రమే భూములు సేకరిస్తామని, ఇదంతా స్వచ్ఛందంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా ఆచరణకొచ్చేసరికి అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. రైతుల్లో భయోత్పాతం కలిగించి అనుకున్నది నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఇంతకూ రాజధాని నగరంలో ఏమేమి ఎక్కడుంటాయో, ఈ స్థాయిలో భూముల అవసరం ఎందుకో ప్రభుత్వం సంతృప్తికరమైన వివరణనివ్వలేకపోయింది. తాము తెల్లారిలేస్తే జపించే సింగపూర్‌లో కూడా రాజధాని ప్రాంతం వేయి ఎకరాలు మించనప్పుడు ఇక్కడ అంత పెద్దయెత్తున భూముల్ని గుంజుకుంటున్నది ఎందుకో... అందులోని ప్రజోపయోగం ఏమిటో చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వానికుంది. అన్నీ దాచిపెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే జనం ఊరుకోరు. ఈ విషయంలో గత అనుభవాలను బాబు గుర్తుచేసుకుంటే మంచిది. -
పత్తి రైతు దగా..
‘ముందు దగా.. వెనుక దగా.. కుడి ఎడమల దగా దగా’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు పత్తి రైతుల విషయంలో అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు బోరాలతో కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. సరుకు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన దగ్గరి నుంచి, చెక్కు చేతికొచ్చే వరకు ప్రతి దశలోనూ రైతు జేబుకు చిల్లుపెడుతున్నారు. పత్తి లోడు వాహనం లోనికి ప్రవేశించాలంటే గేట్పాస్, పనిచేసే సిబ్బందికి, కాటా వేసిన ముఠాకు ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవన్నీ చాలవన్నట్లు బయ్యర్ పాసింగ్ చేసే సమయంలో నాణ్యత సాకుచూపి ఒక్కో బోరానికి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు తగ్గించేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే సరుకు కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. ఈ ప్రక్రియలన్నీ ముగిసి, బిల్లు మంజూరైనా చేయి తడపనిదే చెక్కు రైతు చేతికి రావడం లేదు. ఈ అవకతవకల కారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రానికి వెళ్లాలంటే రైతులు వెనకడుగు వేస్తున్నారు. చిలకలూరిపేటరూరల్ : పుడమితల్లినే నమ్ముకుని పత్తి పండించే కర్షకులు అడుగడుగునా దగాపడుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరను అందిస్తామన్న నేతల హామీలు అమలులో పూర్తిగా విఫలమయ్యారుు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే సీసీఐ సిబ్బంది, యార్డు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో నాణ్యత లోపించిందని, నెమ్ము ఉందని బోరాల్లో కొంత పత్తిని తీసి లెస్‌లు విధిస్తున్నారు. ప్రశ్నించిన రైతులను బ్లాక్‌లిస్టులో (విక్రయానికి తీసుకువచ్చిన పత్తిని తిరస్కరిస్తున్నారు) చేరుస్తున్నారు. ఈ తలనొప్పుల కారణంగా సీసీఐ కేంద్రాలకు రాకుండా గ్రామాల్లోనే అందినకాడికి సరుకు అమ్మేసుకుంటున్నారు. కొనుగోళ్లు నాలుగో వంతే.. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మూడు మండలాల్లో రైతులు అధికశాతం 52,890 ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. ఈ పంట నుంచి ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున 5,28,900 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీటి ప్రకారం ఇప్పటికే నాలుగో వంతు, అంటే 1,32,225 క్వింటాళ్ల దిగుబడి లభించింది. కానీ ఇప్పటి వరకు చిలకలూరిపేట కొనుగోలు కేంద్రంలో 32,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పత్తిదిగుబడి ప్రారంభంలో కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. నాటి నుంచి పత్తిలో తేమ శాతం ఆధారంగా కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. పత్తి పింజ పొడవు 29.5 నుంచి 30.5 ఉండి, తేమశాతం(మైక్రోనైర్) 3.5 నుంచి 4.3గా ఉన్న పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర రూ.4,050కు కొనుగోలు చేస్తామన్నారు. పింజ పొడవు 27.5 నుంచి 28.5, తేమ శాతం 3.5 నుంచి 4.7 ఉన్న పత్తిని రూ.3,950 అందిస్తామన్నారు. సీసీఐ ప్రకటనలతో హర్షించిన రైతులు అంతా నిజమేనని నమ్మారు. తీరా కేంద్రాల్లో ఆశించిన స్థారుులో చెల్లింపులు లేవు. లేని పోని కారణాలతో వేధిస్తూనే ఉన్నారు. పాసింగ్కు ముందు.. తర్వాత.. సరుకు లోనికి ప్రవేశించాలంటే గేట్పాస్ పేరిట వాచ్మెన్ ఆటోకి రూ.100, ట్రాక్టర్‌కి రూ.200 వసూలు చేస్తున్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది బోరానికి రూ.40 చొప్పున గుంజుతున్నారు. ఒక పత్తి బోరెం కాటా వేస్తే రూ.5, యార్డుకు రూ.5, ముఠాకు మరో రూ.5 చెల్లించాల్సి వస్తోంది. బయ్యర్ పాసింగ్ చేసే సమయంలో పత్తిలో తేమశాతం అధికంగా ఉందని, గుడ్డికాయ ఎక్కువగా ఉందని, పత్తి పింజ పొడవు తగ్గిందని తదితర కారణాలు చూపుతూ ఒక్కో బోరెం నుంచి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు లెస్ చేస్తున్నారు. అది కూడా ప్రతి బోరెం నుంచి పత్తిని తీయకుండా ఒక రైతుకు ఒక బోరెం నుంచి ఆ మొత్తాన్ని తీస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విక్రయించిన పత్తి తాలూకు బిల్లు మంజూరు అయ్యేందుకు మరో ఇరవై రోజులు పడుతుంది. ఈ సమయంలో రైతుల పేరుతో చెక్కు రాసినందుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వీటితో పాటు కొనుగోలు కేంద్రానికి వచ్చే ముందు అనేక పత్రాలను మార్కెట్ యార్డులో అందించాల్సి వ స్తోందని పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి సీసీఐ కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. నాణ్యతలేని బోరాల్లో రెండు కేజీలు తీస్తున్నాం.. మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సక్రమంగానే ఉన్నాయి. రైతులు తీసుకువచ్చిన పత్తిలో నాణ్యత లోపిస్తే తిరస్కరిస్తున్నాం. రైతులు తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తించిన బోరెం నుంచి రెండు కేజీలు లెస్ చేస్తున్నాం. - వీరబాబు, సీసీఐ బయ్యర్, చిలకలూరిపేట.