ముక్కారు పంటలతో, పచ్చని పరిసరాలతో మెరిసిపోవడమే కాదు...లక్షలాది కుటుంబాలకు జీవికగా ఉంటున్న తుళ్లూరు ప్రాంతాన్ని కాంక్రీటు కీకారణ్యంగా మార్చడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుంది. రైతుల రోదనలనూ, కూలీల ఆక్రందనలనూ బేఖాతరు చేస్తూ...అన్నా హజారే, మేథా పాట్కర్, స్వామి అగ్నివేశ్, వడ్డే శోభనాద్రీశ్వరరావువంటి సామాజిక ఉద్యమకారుల, మేథావుల, రాజకీయపక్షాల, ప్రజాసంఘాల హితవచనాలను పెడచెవిని పెట్టి బలవంత భూసేకరణకు ప్రభుత్వం తెగించింది. సవరణలతో స్వభావాన్ని మార్చుకుంటుందో... అందరి నిరసనలతోనూ ఆవిరైపోతుందో అర్థంకాని భూసేకరణ ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన నోటిఫికేషన్ జారీచేసింది.
తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పడుతుందని ప్రకటించినప్పుడు ఏం చెప్పారు? ఆ ప్రాంత రైతులను ఒప్పించి, మెప్పించి భూములు తీసుకుంటామని ప్రకటించారు. అన్నదాతలను ఇబ్బందిపెట్టి, వారిని బలవంతపెట్టి లాక్కోబోమన్నారు. తీరా ఇప్పుడు విడుదలైన నోటిఫికేషన్ రైతుల గుండెలపై తుపాకి గురిపెడుతున్నది. ఇస్తావా...చస్తావా తేల్చుకోమంటున్నది. మరో ప్రత్యామ్నాయం లేదంటున్నది. పదకొండేళ్లక్రితం అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఉసురుపెట్టడంలో చంద్రబాబు అపకీర్తి గడించారు. వారు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని... ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఎగ్గొడుతున్నారని తరచు విరుచుకుపడేవారు. అలాంటి ఆరోపణలపై ఎందరో అన్నదాతలు జైళ్లపాలయ్యారు కూడా. ఇన్నాళ్లకు మళ్లీ ఆయనకొక అవకాశం వచ్చింది. ఇప్పుడు భూసేకరణ నోటిఫికేషన్‌తో రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టించడానికి సిద్ధపడ్డారు.
ఎన్డీయే ప్రభుత్వం మొన్న డిసెంబర్‌లో 2013నాటి భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీచేసినప్పుడు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలతోసహా దాదాపు అన్ని పార్టీలూ నిరసనలు వ్యక్తంచేశాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉలక లేదు... పలకలేదు. అందులోని ఆంతర్యమేమిటో తాజాగా జారీ అయిన నోటిఫికేషన్ వెల్లడిస్తున్నది. ఆరు దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న భూసేకరణ చట్టంవల్ల దాదాపు ఆరుకోట్లమంది నిర్వాసితులు కాగా వారిలో 20 శాతంమందికి కూడా పునరావాసం దక్కలేదు. ప్రజా ప్రయోజనాల పేరుతో, అభివృద్ధి పేరుతో అమ్మ లాంటి పంటభూమిని పాలకులు తన్నుకుపోతున్న తీరుపై దేశవ్యాప్తంగా రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. నెత్తురు చిందించారు. ప్రాణాలొడ్డారు. అలాంటివారి త్యాగ ఫలితంగా కాస్త మెరుగైన చట్టం అమల్లోకి వచ్చిందనుకునే లోగానే ఎన్డీయే సర్కారు భూ సేకరణ ఆర్డినెన్స్‌తో దానికి సవరణలు తీసుకొచ్చింది. అటు తర్వాత నిరసనలు వ్యక్తం కావడంతో ఆ ఆర్డినెన్స్‌ను కూడా సవరించుకుని మరో ఆర్డినెన్స్ జారీచేసింది. దాన్ని సైతం అంగీకరించేది లేదని సామాజిక ఉద్యమకారులు, రైతులు కత్తులు నూరుతున్నారు. అందువల్లే లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్నా మొన్న ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీయే సర్కారు ఈ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే సాహసం చేయలేదు. అదిప్పుడు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. ఆ కమిటీ ఎలాంటి సూచనలు చేస్తుందో, అలా వచ్చే సూచనలపై కేంద్రం ఏం చేయదల్చుకున్నదో ఇంకా తేలాల్సి ఉన్నది. మరో పక్క సుప్రీంకోర్టులో ఆ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఇవన్నీ ఒక కొలిక్కి రాకుండానే ఆ ఆర్డినెన్స్‌ను అడ్డంపెట్టుకుని నోటిఫికేషన్ జారీచేయడం దారుణం.
తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం దేశంలో భూసేకరణ ఆర్డినెన్స్‌పై పోరాడుతున్నవారందరికీ కొత్త ఆయుధాన్నిచ్చింది. ఆర్డినెన్స్ చట్టమైతే ఎలాంటి పరిణామాలేర్పడగలవో చెప్పడానికి అవకాశం చిక్కింది. ప్రాజెక్టుల అవసరాన్నిబట్టి సామాజిక ప్రభావ మదింపు చేయాలో వద్దో నిర్ణయించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తే వారు ఆ నిబంధనను తమకు అనుకూలంగా మలుచుకో గలరని... ఇష్టానుసారం వ్యవహరించగలరని తాజా నోటిఫికేషన్ వెల్లడిస్తున్నది. అసలు ఈ భూముల వ్యవహారాన్ని గందరగోళపరచడానికి ఆదినుంచీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. రాజధాని ప్రాంతం కోసమని 57,000 ఎకరాలు సేకరించదల్చుకున్నట్టు, భవిష్యత్తులో దాన్ని లక్ష ఎకరాలకు పెంచనున్నట్టు మొదట్లో ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకూ 44,000 ఎకరాలకు సంబంధించి భూ సమీకరణ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిపై వచ్చిన అభ్యంతరాలకు ప్రభుత్వం వైపునుంచి ఇంతవరకూ జవాబు లేదు.
ఈలోగా రైతులు స్వచ్ఛందంగా క్యూ కట్టి 33,400 ఎకరాల భూమిని తీసుకోమంటూ అంగీకార పత్రాలిచ్చారని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా ఇప్పుడు చెబుతున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. తమకు 14,800 ఎకరాలకు సంబంధించిన అంగీకారపత్రాలు అందాయని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇప్పుడు భూ సమీకరణకు అంగీకరించకుండా కోర్టుకు వెళ్లినవారి నుంచి దాదాపు 900 ఎకరాల సేకరణే లక్ష్యంగా తాజా నోటిఫికేషన్ జారీచేశామని ఆయన మాట్లాడుతున్నారు.
ఇందులో నిజానిజాలేమిటో, ఇప్పుడు జారీచేసిన 166 జీవోలోని ఆంతర్యమేమిటో మున్ముందుగానీ తెలిసే అవకాశం లేదు. భూ సమీకరణకు అంగీకార పత్రాలిచ్చిన రైతుల్లో కొందరు తమను బెదిరించి, భయపెట్టి ఆ పత్రాలు తీసుకున్నారని హైకోర్టును ఆశ్రయించారు. దానిపై న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలిచ్చి విచారిస్తుండగానే ఆదరాబాదరాగా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం ఏం న్యాయం? రాజధాని గురించి ప్రకటించిన తొలినాళ్లలో భూ సమీకరణ ద్వారా మాత్రమే భూములు సేకరిస్తామని, ఇదంతా స్వచ్ఛందంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా ఆచరణకొచ్చేసరికి అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. రైతుల్లో భయోత్పాతం కలిగించి అనుకున్నది నెరవేర్చుకోవాలని చూస్తోంది.
ఇంతకూ రాజధాని నగరంలో ఏమేమి ఎక్కడుంటాయో, ఈ స్థాయిలో భూముల అవసరం ఎందుకో ప్రభుత్వం సంతృప్తికరమైన వివరణనివ్వలేకపోయింది. తాము తెల్లారిలేస్తే జపించే సింగపూర్‌లో కూడా రాజధాని ప్రాంతం వేయి ఎకరాలు మించనప్పుడు ఇక్కడ అంత పెద్దయెత్తున భూముల్ని గుంజుకుంటున్నది ఎందుకో... అందులోని ప్రజోపయోగం ఏమిటో చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వానికుంది. అన్నీ దాచిపెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే జనం ఊరుకోరు. ఈ విషయంలో గత అనుభవాలను బాబు గుర్తుచేసుకుంటే మంచిది.
అన్యాయం... అధర్మం!
Published Sat, May 16 2015 12:56 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement