ఇదేం వింత?!
కొన్ని తేదీలు చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి. స్వతంత్ర భారత చరిత్రలో అందరూ చీకటి అధ్యాయంగా పరిగణించే ఎమర్జెన్సీ విధించిన జూన్ 25 అలాం టిదే. రాజ్యం పౌరులపై విరుచుకుపడి, వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను చిదిమి దేశం మొత్తాన్ని చీకటి కొట్టంగా మార్చిన రోజది. అందువల్లే ఆ తేదీ సమీపిస్తున్నదంటే దేశవ్యాప్తంగా ఏటా సభలూ, సమావేశాలూ జరుగుతాయి. ఈసారి కూడా రివాజుగా అవి కొనసాగుతుండగానే కర్ణాటక అసెంబ్లీ ఆ రాష్ట్రంలోని ఇద్దరు పాత్రికేయులు సభాహక్కుల్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారికి ఏడాది చొప్పున జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించింది.
ఆ జరిమానా చెల్లించకపోతే మరో ఆర్నెల్లు శిక్ష అనుభవించాలని ‘తీర్పు’నిచ్చింది. పాత్రికేయ సంఘాలు, ఒకటి రెండు హక్కుల సంఘాలు, సీనియర్ పాత్రికేయులు తప్ప దీనిపై మరెవరూ పెద్దగా స్పందించలేదు. ఎమర్జెన్సీలో జైలుకుపోయిన బీజేపీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు వివిధచోట్ల జరిగిన సదస్సుల్లో అప్పటి చీకటిరోజులు గుర్తుకుతెచ్చుకున్నారుగానీ కర్ణాటక ఉదంతం గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో మరికొన్ని మాసాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
ఎమర్జెన్సీకి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో పత్రికాస్వేచ్ఛకు ఉరి బిగిం చడం పెద్దగా ఎవరినీ ఆశ్చర్యపరచదు. కానీ ఆ పార్టీని ఓడించి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఆ పాత్రికేయుల ‘నేరాన్ని’ పరిశీలించి, సిఫార్సు చేసిన సభా హక్కుల కమిటీలో భాగస్వామ్యం కావడాన్ని, స్పీకర్ చర్యపై మౌనం వహిం చడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఇదంతా గమనిస్తే మన నేతల చిత్తశుద్ధిపై సందే హాలు తలెత్తుతాయి. ఎమర్జెన్సీపై నిర్వహించే సదస్సుల ఉద్దేశం పౌరుల్ని చైతన్య వంతం చేయడమా, స్వీయ త్యాగాలను స్మరించుకోవడమా అన్న అనుమానాలొ స్తాయి. అన్నీ ఒక తంతుగా మారాయన్న చింత కలుగుతుంది.
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేబీ కొలివాద్ ఆగ్రహానికి గురైన ఇద్దరిలో ఒకరు ‘హాయ్ బెంగళూర్’ ఎడిటర్ రవి బెళగెరె, మరొకరు ‘ఎలహంక వాయిస్’ ఎడిటర్ అనిల్ రాజు. కేబీ కొలివాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సభాహక్కుల కమిటీకి చైర్మ న్‌గా ఉన్నప్పుడు ఆయనపైనా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఎం నాగరాజ్‌పైనా ‘హాయ్ బెంగళూర్’ కథనాలు ప్రచురిస్తే... నిరుడు బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్‌లపై ‘ఎలహంక వాయిస్’ కథనం వెలువరించింది. ఇవన్నీ ఈ నేతల పరువు తీశాయన్నది ప్రధాన ఆరోపణ. మన దేశంలో పెద్ద పత్రికలకూ, మీడియా సంస్థ లకూ ఏమైనా జరిగితే సమాజం నుంచీ, రాజకీయ పక్షాలనుంచీ ఎంతో కొంత స్పందన ఉంటుంది.
అదే స్థానికంగా వెలువడే చిన్న పత్రికల విషయంలో ఈ ధోరణి కనబడదు. ఆ పత్రికలు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతాయని, వాటి కథనాల్లో విశ్వసనీయత తక్కువని అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది అర్ధసత్యం మాత్రమే. అన్నిటిలో మంచీ చెడూ ఉన్నట్టే చిన్న పత్రికల్లోనూ ఉంటాయి. స్వీయ ప్రయోజనాల కోసం పాలకులకు బాకా ఊదే, పాత్రికేయ విలువలను కాలరాసే పెద్ద మీడియా సంస్థలు కూడా లేకపోలేదు. ఎక్కడైనా తప్పుడు కథనాలు వెలువడితే ఆ ఆరో పణలొచ్చిన వారు ఖండించవచ్చు. లేదా న్యాయస్థానాలను ఆశ్రయించి కేసులు పెట్టవచ్చు. పాత్రికేయులకేమీ ప్రత్యేక హక్కులు, అపరిమిత స్వేచ్ఛ ఉండవు. కానీ కర్ణాటక నేతలు ఆ రెండు మార్గాలనూ కాదని సభా హక్కుల కమిటీని ఆశ్రయించారు.
పార్లమెంటుకూ, దాని సభ్యులకూ, సభా కమిటీలకూ ఉండే హక్కులు, అధి కారాల గురించి రాజ్యాంగంలోని 105వ అధికరణం చెబుతుంది. 194వ అధికరణం రాష్ట్రాల్లోని చట్టసభలకూ, వాటి సభ్యులకూ, సభా కమిటీలకూ ఉండే అధికారాలు, హక్కుల గురించి మాట్లాడుతుంది. అయితే ఈ రెండు అధికరణాలకూ అను గుణంగా చట్టసభల హక్కులను క్రోడీకరించే పని స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా సాధ్యపడకపోవడం వింత గొలుపుతుంది. ఇందువల్ల ఏది సభాహక్కుల ఉల్లం ఘనకిందికి వస్తుందో, ఏది రాదో ఎవరికీ తెలియకుండా పోతున్నది. మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ రచనలో భిన్న దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇంగ్లండ్‌లో ఒకప్పుడు దిగువ సభ న్యాయసంబంధ బాధ్యతల్ని కూడా నెరవేర్చేది. అందువల్ల అది సర్వోన్నత న్యాయస్థానంగా అధికారాలు చలాయించేది. కానీ మన రాజ్యాంగం చట్టసభలకు అలాంటి అధికారాలివ్వలేదు.
రాజ్యాంగంలోని 13 మొదలుకొని 311 వరకూ వివిధ అధికరణాలు న్యాయసమీక్ష చేసే అధికారాన్ని న్యాయస్థానాలకు మాత్రమే ఇచ్చాయి. కనుకనే చట్టసభల అధికారాలు, హక్కులను గుర్తిస్తూనే శిక్షించే అధికారం వాటికి లేదని న్యాయ నిపుణులంటారు. ఈ విషయంలో తరచు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. చట్టసభల హక్కుల క్రోడీ కరణ జరిగి ఉంటే, నిర్దిష్టంగా ఏవి హక్కులో, వాటిని ఉల్లంఘించినట్టు నిర్ధా రించడానికి అను సరించదగిన విధానమేమిటో, అలాంటి సందర్భాల్లో తీసుకునే చర్యల పరిధి, పరిమితులేమిటో స్పష్టంగా పేర్కొన్నట్టయితే సమస్య ఉండేది కాదు. అది లోపించడంవల్ల మీడియా స్వేచ్ఛకూ, సాధారణ పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతోంది.
కర్ణాటక విషయాన్నే తీసుకుంటే రవి బెళెగెరెపై ఫిర్యాదు చేసిననాటికి ప్రస్తుత స్పీకర్ కొలివాద్ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన స్పీకర్ అయ్యాక మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రత్నాకర్ ఆ స్థానంలోకొచ్చారు. తాము అనిల్ రాజ్ కేసును మాత్రమే పరిశీలించి శిక్షకు సిఫార్సు చేశామని రత్నాకర్ అంటున్నారు. దీనిపై స్పీకర్‌ని అడిగితే అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని చెబుతున్నారు. ఇలా ఫిర్యాదిదారు, తీర్పరి ఒకరే కావడం న్యాయస్థానాల్లో అయితే ఊహించగలమా? ఈ మాదిరి చర్యలు చట్టసభల గౌరవప్రతిష్టలను పెంచకపోగా తగ్గిస్తాయి. మీడియా స్వేచ్ఛను హరించే, భావప్రకటనాస్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి ధోరణులకు ఎంత త్వరగా అడ్డుకట్ట పడితే అంత మంచిది.