దీన్ని ఎన్‌కౌంటర్ అనగలమా?
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ) ప్రాంతంలో ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో వారం రోజుల వ్యవధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ల పరంపరపై ఏర్పడ్డ అయోమయం తొలగకముందే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న సిమి ఉగ్రవాదులకూ, పోలీసులకూ జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమ వారం ఎనిమిదిమంది మరణించారని వచ్చిన వార్త సంచలనం సృష్టించింది. మృతులంతా వేకువజామున జైలు నుంచి తప్పించుకుపోయారని... అడ్డుకోబో యిన గార్డును హతమార్చారని పోలీసులు చెబుతున్నారు. వారి ఆచూకీ తెలిసి నిర్బంధించడానికి వెళ్తే తిరగబడ్డారని, గత్యంతరం లేక కాల్పులు జరపగా ఆ 8 మంది హతమయ్యారని వారంటున్నారు.
కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న ఎన్‌కౌం టర్ కథలకు ఇదేమీ భిన్నంగా లేదు. మామూలుగా అయితే ఎన్‌కౌంటర్ కథ కూడా అక్కడితో ముగిసేది. కానీ భోపాల్ ఎన్‌కౌంటర్ పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ఆ ఉదంతం జరిగిన కొన్ని గంటలకే సామాజిక మాధ్యమాల్లో విడుదలైన రెండు వీడియోలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. నలుగురైదుగురు వ్యక్తులను పోలీ సులు చుట్టుముట్టడానికి ప్రయత్నించడం ఒక వీడియోలో కనబడితే... నిరాయుధు డిగా ఉన్న వ్యక్తిని ఒక కానిస్టేబుల్ గురి చూసి కాల్చి చంపుతున్న దృశ్యం మరో వీడియోలో ఉంది. ముగ్గురు పరారు కావడానికి ప్రయత్నిస్తున్నారని, అయిదుగురు ఏదో చెబుతున్నారని ఒక కానిస్టేబుల్ వైర్‌లెస్ సెట్‌లో పై అధికారులకు తెల్పడం మొదటి వీడియోలో వినబడుతోంది. వీటిని గమనిస్తే అదుపులోకి తీసు కున్న ఉగ్ర వాదులను ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పోలీసులు చంపారని అర్ధమవు తుంది. సజీవంగా పట్టుకోవడానికి ఆస్కారం ఉన్నప్పుడిలా ఎందుకు జరిగింది?
మరణించినవారంతా ఉగ్రవాదులే కావొచ్చు. వారిపై తీవ్ర నేరారోపణలు ఉండవచ్చు. గార్డును చంపి పరారైనవారే కావొచ్చు. కొందరు బీజేపీ నేతలు, ప్రభు త్వంలోనివారూ వాదిస్తున్న ప్రకారం వారివల్ల సమాజానికి పెను ముప్పు కలిగే అవకాశమూ ఉండొచ్చు. ఈ విషయంలో వారితో ఏకీభవించేవారికి సైతం కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఎనిమిదిమందీ ఇంత ప్రమాదకారులు గనుకే వారిని సజీవంగా పట్టుకుని ప్రశ్నించి రాబట్టవలసిన అంశాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే వారు తప్పించుకున్న సెంట్రల్ జైలు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత గలది. దాని చుట్టూ 35 అడుగుల ఎత్తయిన గోడ, ఆ గోడపై విద్యుత్ తీగల వలయాలు, నలు దిశలా నిత్యం రెప్పవాల్చని నిఘాలో ఉండే సెక్యూరిటీ పోస్ట్‌లు, సీసీ కెమెరాల అమరిక వంటివి ఉన్నాయి. అలాంటిచోట ఎనిమిది మంది ఒక గార్డును చంపి దుప్పట్ల సాయంతో తప్పించుకుపోవడం సాధ్యమేనా? పైగా ఈ ఉదంతం విషయంలో ఐజీ యోగేష్ చౌధరి, రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్ చేసిన ప్రకటనలు పొంతన లేకుండా ఉన్నాయి.
కంచాలు, చెంచాలతో గార్డును హతమార్చారని భూపేంద్రసింగ్ అంటుండగా... తుపాకులతో దాడిచేసి చంపారని ఐజీ చెబుతున్నారు. ఈ ఉదంతం విషయంలో జాతీయ దర్యాప్తు సంఘం(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తుందని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పడం బాగానే ఉంది. కానీ ఆ దర్యాప్తులు సరిపోవు. అంతమంది తప్పించుకుపోయారంటే అందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉండి ఉండాలి. జైలు సిబ్బంది సహకారం ఉండాలి. వారివద్ద ఆయుధాలు ఉండి ఉంటే అవి ఎలా వచ్చాయో తేల్చాల్సి ఉంటుంది. మరోపక్క సులభంగా పట్టుకోగలిగి ఉన్నా వారిని కాల్చిచంపారని వీడియోలు చెబుతున్నాయి. ఎన్‌ఐఏ పరిధిలో జరిగే దర్యాప్తు ఈ అంశాలన్నిటినీ తేల్చలేదు. సమగ్రమైన న్యాయ విచారణతోనే ఇవి వెలుగులోకొస్తాయి. ఇంతకూ శివరాజ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు ఇలాంటి ఉదంతాలపై గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు గుర్తున్నట్టు లేవు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నిందితుల కదలికల గురించి సమాచారం అంది వారిని పట్టుకోవడానికి వెళ్లే పోలీసులు కీలకమైన సమాచారం మినహా మిగిలిన అంశాలను పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా నమోదు చేసి మరీ ఆ ప్రాంతానికి వెళ్లాలన్నది అందులో మొదటిది. అలాగే ఎన్‌కౌంటర్‌లో ఏ వైపు మరణాలు సంభ వించినా వెనువెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో పాలుపంచుకోని పోలీస్‌స్టేషన్‌కు చెందిన అధికారితో లేదా సీఐడీ వంటి మరో విభాగంతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్నది మరో సూచన. అది శాస్త్రీయంగా, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో నిర్ణయాత్మకమైనదిగా ఉండాలి. దర్యాప్తు ప్రగతిపై ఆర్నెల్లకోసారి రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల సంఘాలకు నివేదికలు ఇస్తుండాలి. ఎన్‌కౌంటర్ నిజమైనదేనని తేలేవరకూ బాధ్యులకు అవార్డులు, పదోన్నతులు ఇవ్వ కూడదు. తప్పు చేశారని దర్యాప్తులో రుజువైతే బాధ్యులను వెనువెంటనే సస్పెండ్ చేసి వారిపై చర్యలు ప్రారంభించాలి.
రెండేళ్లక్రితం ఒక తీర్పునిస్తూ వెలువరించిన ఈ మార్గదర్శకాలను గమనిస్తే సర్వోన్నత న్యాయస్థానానికి మన పోలీసు వ్యవస్థ పైనా, పాలకుల తీరుపైనా ఎంత అపనమ్మకం ఏర్పడిందో సులభంగా అర్ధమవు తుంది. ఎవరినైనా ఎన్‌కౌంటర్‌ల పేరుతో హతమార్చినప్పుడు విచారణ జరపాలని కోరే హక్కుల సంఘాల నేతలనూ, ఇతరులనూ నక్సలైట్ల లేదా ఉగ్రవాదుల మద్ద తుదార్లగా చిత్రీకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తారు. చెప్పింది సుప్రీంకోర్టు గనుక అలా అనే స్థితి ఉండదు. అయితే ఈ మార్గదర్శకాల తర్వాతనైనా ఎన్‌కౌం టర్లు ఆగలేదు. పౌరుల్లో సంశయాలూ తీరలేదు. ఏఓబీ ఎన్‌కౌంటర్ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కేసు విషయంలో సోమ వారం హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యానాలు సైతం గమనించదగ్గవి. చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న సంజాయిషీని న్యాయస్థానం విశ్వసించలేదని ఈ వ్యాఖ్యానాలు గమనిస్తే అర్ధమవుతుంది. ఇకనైనా ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రహస నప్రాయం చేస్తున్న ఈ ఎన్‌కౌంటర్లకు ముగింపు పలకాలి. చట్టబద్ధ పాలనకు ప్రభుత్వాలు కట్టుబడాలి. ఆ సంస్కృతిని పెంపొందించినప్పుడే, పాలనలో పార దర్శకత ముఖ్యమని గుర్తించినప్పుడే పాలకులకూ, ప్రభుత్వాలకూ విలువ ఏర్పడు తుంది. విశ్వసనీయత పెరుగుతుంది.