ఈ ప్రమాదాలకు అంతులేదా?
మన దేశంలో రైలు ప్రయాణికుల భద్రత గాల్లో దీపమని మరోసారి రుజువైంది. విజయనగరం జిల్లా కొమరాడ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఉదంతంలో ఆదమరిచి నిద్రిస్తున్న 40మంది అభాగ్యులు మృత్యు ఒడికి చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకోబో తున్న విజయనగరం వాసులు ఎనిమిదిమంది కూడా వీరిలో ఉన్నారు. ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణాలేమిటో, కారకులెవరో ఆరా తీయడానికి దర్యాప్తు మొదలైంది. మరి కొన్ని నెలలకు నివేదిక కూడా వస్తుంది. మరో ప్రమాదం జరిగే వరకూ అంతా సవ్యంగానే ఉన్నదన్న భ్రమ అందరినీ ఆవరిస్తుంది. ఈ ప్రమాదాల పరంపరకు కారణాలేమిటో, వాటి నివారణకు తన వంతుగా చేపట్టా ల్సిన తక్షణ చర్యలేమిటో మాత్రం రైల్వే శాఖ గుర్తించదు. కేవలం మూడు నెలల వ్యవధిలో దేశంలో మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయంటే...ఈ ప్రమాదాల్లో 190మంది మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఆ శాఖ అర్ధం చేసు కోవాలి.
మన్ను తిన్న పాములా మందకొడిగా కూర్చుంటే కుదరదని తెలుసుకో వాలి. మొన్న నవంబర్‌లో యూపీలోని కాన్పూరు సమీపంలో ఇండోర్– రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 150మంది మరణించారు. 260మంది గాయ పడ్డారు. ఆ మరుసటి నెల అజ్మీర్–సీల్దా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అదృష్టవ శాత్తూ ఎవరూ మరణించలేదుగానీ 44మంది గాయపడ్డారు. తాజా ప్రమాదంలో 40మంది మృత్యువాత పడటంతోపాటు 71మంది గాయపడ్డారు. ఇవన్నీ పెద్ద ప్రమాదాలు. చిన్నా చితకా ప్రమాదాలు తరచుగా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. నిరుడు పట్టాలు తప్పిన ఉదంతాలు 68 జరిగాయి. అంతక్రితం ఏడాది కన్నా ఇవి అధికం. ఈ ప్రమాదాల్లో 70 శాతం రైల్వే సిబ్బంది వల్లేనని తేలింది. నాసిరకం నిర్వహణ, భద్రతా నిబంధనలను గాలికొదిలేయడంవంటివి ప్రధాన కారణాలని కూడా వెల్లడైంది.
అయితే సిబ్బంది వైఫల్యాలకు మూలం రైల్వే యాజమాన్యంలో ఉంది. ప్రయా ణికుల రైళ్లయితేనేమి, సరుకు రవాణా రైళ్లయితేనేమి నానాటికీ పెరుగుతున్నాయి. పర్యవసానంగా పట్టాలపై ఒత్తిడి అధికంగా ఉంటోంది. వాటిని నిరంతరం గమ నిస్తూ నిర్ణీత వ్యవధిలో మారుస్తుండాలి. మనకున్న 1,14,907 కిలోమీటర్ల నిడివి పట్టాల్లో ఏటా 4,500 కిలోమీటర్ల మేర నవీకరించాలి. కానీ అందులో సగమే పూర్తవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. పైగా చలికాలంలో పట్టాలు సంకో చించి పగుళ్లు ఏర్పడతాయి. వాటిని గుర్తించడానికి అవసరమైన అత్యాధునిక పరిక రాలను సమకూర్చడంలో రైల్వే నిర్వాహకులకు శ్రద్ధ లేదు సరిగదా...కనీసం సిబ్బం దినైనా తగినంత సంఖ్యలో ఉంచాలన్న స్పృహ లేదు. పదేళ్లక్రితం రైల్వే శాఖలో 20 లక్షలమంది పనిచేస్తే, ఇప్పుడు వారి సంఖ్య 13 లక్షలు! రిటైరవుతున్నవారి బదులు కొత్తవారిని తీసుకోవడంలో ఆ శాఖ తీరని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.
డబ్బు మిగు ల్చుకోవాలన్న యావలో భద్రతను తాకట్టుపెడుతోంది. ముఖ్యంగా పట్టాల భద్ర తకు పూచీపడే భద్రతా విభాగంలో దాదాపు లక్ష ఖాళీలున్నాయని నిపుణులు చెబు తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడంలో ఆశ్చ ర్యపోవాల్సిందేమీ లేదు. అవి జరగకపోతేనే వింత! ఈమధ్యే రైల్వే శాఖకు అను బంధంగా ఉన్న స్థాయీ సంఘం రైల్వే ట్రాక్‌లకు సంబంధించి భద్రతా ప్రమా ణాలు పాటించడంలో ఆ శాఖ తీవ్రంగా విఫలమైందని ఆరోపించింది. వేలాది కోట్ల రూపాయల ఆదాయానికి మూలకారణమైన పట్టాల విషయంలో అది పట్టనట్టు ఉంటున్నదని పేర్కొంది. కానీ తోలు మందమైనవారికి చెప్పి ప్రయోజనమేమిటి?
ఈ ప్రమాదాల్లో అయినవారిని పోగొట్టుకుని జీవనాధారం కోల్పోయే కుటుం బాల బాధ ఒకటైతే... తీవ్రంగా గాయపడి కుటుంబాలకు భారంగా మారామన్న వేదనతో కుమిలిపోయేవారిది మరో రకమైన బాధ. కాయకష్టంతో కుటుంబాలను పోషించుకునేవారైనా, ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నంతలో అయినవారికి ఆసరాగా నిలిచేవారైనా ఒక్కసారిగా సర్వం కోల్పోయి ఆసుపత్రిపాలు కావలసి వస్తుంది. నాలుగురోజులు గడిచేసరికి ఏ అధికారీ వారివైపు చూడరు. ఎక్స్‌గ్రేషియా అయినా, నష్టపరిహారమైనా ఆ కుటుంబాలకు సరిపోతున్నదో, లేదో.. ఉన్నట్టుండి ఉపాధి కోల్పోవడంవల్ల వారిపై ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎన్నెన్ని అగచాట్లు పడుతున్నాయో, ఆ కుటుంబాల్లోనివారు ఉన్నారో తిన్నారో ఎవరికీ అక్కర్లేదు.
ప్రమాదం జరిగినప్పుడల్లా విద్రోహం మాట వినబడుతుంది. ఎవరో కావా లని చేయడంవల్లనే ఇంత ఘోరం జరిగిందన్న ప్రకటనలు వెలువడతాయి. దర్యాప్తు నివేదికలు తేల్చేది ఏమైనా ప్రమాదం కారణంగా వెనువెంటనే వందల కుటుంబాలు వీధిన పడటమైతే వాస్తవం. అనాధలైన కుటుంబాలకు అయినవారిని ఎలాగూ తెచ్చివ్వలేరు. తీవ్రంగా గాయపడినవారిని సాధారణ స్థితికి చేర్చడమూ అంత సులభం కాకపోవచ్చు. కానీ వారికి ఉదారంగా ఆర్ధిక సాయం అందించడం అసాధ్యమా? మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ ప్రకటించిన రూ. 2 లక్షల సాయం, గాయపడినవారికి ఇస్తామన్న రూ. 50,000 పరిహారం గమనిస్తే రైల్వే శాఖ ప్రయాణికుల భద్రతలోనే కాదు... సాయం అందించడంలోనూ ఎంత నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నదో అర్ధమవుతుంది.
కొన్నాళ్లుగా ప్రయాణికుల నుంచి భద్రత సెస్ కూడా వసూలు చేస్తున్నారు. ఇందువల్ల ప్రయాణికులకు అదనంగా ఒరిగిందేమీ లేదు. కనీసం ఇబ్బందుల్లో పడిన కుటుంబాలకు ఇతోధికంగా సాయం అందించే మానవత్వాన్నయినా ప్రదర్శించలేరా? ప్రత్యేక బడ్జెట్‌ని ప్రవేశపెట్టే 92 ఏళ్ల సంప్రదాయాన్ని రైల్వే శాఖ ఈ ఏడాదినుంచి వదులుకోబోతోంది. ప్రయాణి కుల భద్రతకు సంబంధించి కూడా పాత ఒరవడికి స్వస్తి చెప్పాలన్న స్పృహ దానికి కలగాలని భావించడం దురాశేమీ కాదు. ఫక్తు వ్యాపార దృక్పథంతో రైల్వేలను నడపాలన్నా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వడం తప్పనిసరని... అందుకు ఎంత ఖర్చయినా వెనకాడరాదని రైల్వే యాజమాన్యం, కేంద్ర ప్రభు త్వంలోని పెద్దలు తెలుసుకోవాలి.