పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ప్రస్తావిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.
అనంతపురం : పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ప్రస్తావిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. పత్తిరైతుల సమస్యలు తీర్చాందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తాను లేఖ రాస్తానని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. యాత్రలోభాగంగా ఈ రోజు కదిరేపల్లి వద్ద మల్బరి తోటను ఆయన పరిశీలించారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విన్నవించారు. దిగుమతి సుంఖాన్ని కేంద్రం తగ్గించడంతో చైనా నుంచి అత్యధికంగా సిల్క్ దిగుమతి అవుతుందని వారు తెలిపారు. దీని వల్ల మల్బరి సాగు చేసే రైతులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పత్తిరైతులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చారని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు గుర్తు చేశారు. ఎకరాకు రూ. 28 వేలు పెట్టుబడి పెట్టినా...రూ. 30 వేల ఆదాయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కూడా వర్తింపచేయలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు.