పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
సాక్షి, విజయవాడ బ్యూరో: పత్తి కొనుగోళ్లలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో కరువు నివారణ, వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్ల సందర్భంగా సాకులు చెప్పి రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీసీఐ అధికారులను కోరారు.
కచ్చితమైన ధర లభించేలా చూడాలని, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా అక్రమాలకు కళ్లెం వేయాలని సూచించారు. అవసరమైతే పత్తి కొనుగోళ్లను రోజువారీగా పరిశీలిస్తానన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని బాబు చెప్పారు. 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని తెలిపారు. ఈ నెల 7 నాటికి మరికొన్నింటిని కరువు మండలాలుగా ప్రకటిస్తామన్నారు. గతేడాది ఉద్యాన రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలను నవంబర్ 6లోగా చెల్లించాలని ఆదేశించారు.
ఖాయిలా పరిశ్రమలపై అధ్యయనం
ఖాయిలా పడిన, సమస్యల్లో చిక్కుకున్న పరిశ్రమలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. జూట్, చక్కెర, ఫెర్రో అల్లాయిస్, టెక్స్‌టైల్స్ పరిశ్రమలపై ఆ యన మంగళవారం సమీక్ష నిర్వహించారు.