లక్ష మంది నేతన్నలకు మొండిచెయ్యి!
♦ చంద్రబాబు సర్కారు చేనేత రుణ మాఫీ తీరు
♦ బ్యాంకులకు రూ.365 కోట్ల మేర బకాయిపడ్డ 1.15 లక్షల మంది నేతన్నలు
♦ కేవలం 25 వేల మందికి రూ.110 కోట్ల రుణమాఫీకే కేబినెట్ ఆమోదం
♦ తద్వారా సుమారు 90 వేల మందికి అప్పుడే ఎగనామం
♦ రూ.255 కోట్ల మేరకు రుణమాఫీ చేయకుండా ఎగవేత
♦ మార్గదర్శకాలతో మరో 10 వేల మంది అనర్హులవుతారంటున్న అధికారులు!
సాక్షి, హైదరాబాద్: నేతన్నల రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు సవా‘లక్ష’ ఆంక్షలు విధించింది. మొత్తం మీద లక్ష మంది అర్హులైన నేతన్నలకు ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మార్గదర్శకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అధికశాతం మంది చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చేనేత పరిశ్రమ విస్తరించింది. జౌళి శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 3,59,212 కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇందులో 1,282 చేనేత సంఘాల్లో 2,00,310 కుటుంబాలు ఉండగా.. 1,58,902 కుటుంబాలు సహకార సంఘాల పరిధిలో లేవు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాలతో పాటు నేతన్నల వ్యక్తిగత రుణాలు, నేత సంఘాల బకాయిలను మాఫీ చేస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణ మాఫీకి మార్గదర్శకాలు రూపొందించడానికి కోటయ్య అధ్యక్షతన జూన్ 10, 2014న ప్రభుత్వం కమిటీ వేసింది. మార్చి 31, 2014 నాటికి నేత కార్మికులు రూ.110 కోట్లు, మరమగ్గాల కార్మికులు రూ.15 కోట్లు.. చేనేత సంఘాల్లోని కార్మికులు రూ.240 కోట్లు వెరసి 1.15 లక్షల మంది నేతన్న (కుటుంబం)లు రూ.365 కోట్ల మేర బ్యాంకులకు బకాయిపడ్డారంటూ కోటయ్య కమిటీకి జూలై 21, 2014న జౌళి శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు.
ఆ నివేదికను 17 నెలలపాటు ప్రభుత్వం తొక్కి పట్టింది. ఎట్టకేలకు గత నవంబర్ 16న చేనేత రుణ మాఫీపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. 24,309 మంది నేత కార్మికుల వ్యక్తిగత రుణాలు, చేనేత సంఘాల్లోని 674 మంది బకాయిలు, 584 మంది పవర్ లూమ్ కార్మికులు వెరసి కేవలం 25,567 మంది నేతన్నలకు చెందిన రూ.110.96 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే సుమారు సుమారు 90 వేల మంది నేతన్నలకు రుణమాఫీ వర్తింపజేయకుండా ప్రభుత్వం అప్పుడే నిర్ణయం తీసుకుందన్నమాట. అలాగే రూ.255 కోట్ల మేరకు రుణమాఫీ చేయకుండా ఎగవేసిందన్నమాట. తాజాగా మంగళవారం రుణమాఫీకి పలు మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను వర్తింపజేస్తే.. కేబినెట్ ఆమోదించిన 25,567 నేతన్నల్లోనూ కనీసం పది వేల మంది కార్మికులపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని జౌళి శాఖ అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం మీద సుమారు లక్షమంది నేతన్నలకు రుణమాఫీ వర్తించకుండా పోతోందని ఆ వర్గాలు వివరించాయి.
చేనేత రుణ మాఫీకి రూ.110.96 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : చేనేత కార్మికులకు రుణ మాఫీ కింద ప్రభుత్వం రూ. 110.96 కోట్లు మంజూరు చేసింది. 2014 మార్చి నాటికి వివిధ ఆర్థిక సంస్థల్లో కార్మికులు తీసుకున్న రుణాలను ఈ పథకం ద్వారా మాఫీ చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నరేష్ పెనుమాక మంగళవారం జీవో జారీ చేశారు. మరోవైపు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. రేషన్‌కార్డు, ఆధార్ కార్డుల్లో చేనేత వృత్తి చేస్తున్నట్లు నిర్ధారించిన వారికే రుణ మాఫీ వర్తింపజేయాలని తేల్చిచెప్పింది.
చేనేత కార్మికుడి బ్యాంకు ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేసి.. ఆ కుటుంబంలో సభ్యులెవరైనా డ్వాక్రా, వ్యవసాయ రుణాల మాఫీలో లబ్ధి పొందారేమో పరిశీలించాలని సూచించింది. ఒకవేళ లబ్ధి పొంది ఉంటే.. ఆ కుటుంబాలను చేనేత రుణ మాఫీకి అనర్హుల్ని చేయాలని ఆదేశించింది. నేత పని గిట్టుబాటు కాకపోవడంతో మగ్గాన్ని చుట్టేసి, కూలీనాలీ చేసుకుంటూ బతుకులీడుస్తున్న నేతన్నల రుణ మాఫీ చేయకూడదని నిర్ణయించింది. 5 హెచ్‌పీలోపు సామర్థ్యం ఉండి, 50 శాతం విద్యుత్ రాయితీ పొందుతోన్న మరమగ్గాల కార్మికులే రుణ మాఫీకి అర్హులని స్పష్టం చేసింది. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.లక్ష లోపు రుణాన్ని మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించింది.
రుణమాఫీలన్నింటిలో కోతలే...
ఎన్నికల ముందు రైతుల వ్యవసాయ, మహిళా సంఘాల, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తర్వాత అన్ని రకాల రుణాల మాఫీలో కోతలు విధిం చారు. రైతుల వ్యవసాయ రుణాల మాఫీని వడ్డీకి కూడా సరిపోకుండా చేసిన బాబు ఇప్పుడు చేనేత కార్మికుల రుణాల మాఫీలోనూ కోతలు విధించారు. ఇక మహిళా సంఘాల రుణ మాఫీకి ఎగనామం పెట్టారు. దీంతో రైతులు, మహిళ సంఘాలు, చేనేత కార్మికులపై అసలు మాఫీ దేవుడెరుగు వడ్డీలపై వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.