మాయాజాలం
గజ్వేల్, న్యూస్‌లైన్:
గజ్వేల్ మార్కెట్ యార్డులో వ్యాపారుల మాయాజాలంపై ఆగ్రహం వెల్లువెత్తింది. సిండికేట్‌గా మారి పత్తి క్వింటాలు ధరను అమాంతం రూ.400 తగ్గించడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. వ్యాపారులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో నాలుగు గంటల పాటు లావాదేవీలు నిలిచిపోయాయి. చివరకు మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
జిల్లాలో పత్తి పండిస్తున్న రైతులతో పాటు పొరుగునే ఉన్న వరంగల్, నల్లగొండ జిల్లాల పత్తి రైతులకు కూడా గజ్వేల్ మార్కెట్ యార్డు ప్రధాన ఆధారం. కాస్తాకూస్తో గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో రైతులు వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికొస్తారు. కానీ మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలం పత్తిరైతులను చిత్తుచోస్తోంది. పట్టించుకునే వారు లేకపోవడంతో వ్యాపారులంతా ఏకమై ఉన్నట్టుండి పత్తి ధరను అమాంతం తగ్గించేస్తుండడంతో రైతులు నిలువునా మోసపోతున్నాడు. శనివారం కూడా యార్డులో పత్తి ధరను వ్యాపారులు అనూహ్యంగా తగ్గించేశారు. శుక్రవారం క్వింటాలు పత్తి రూ.5 వేలు పలకడంతో వివిధ ప్రాంతాల్లోని రైతులు ఎంతో అశతో తమ పత్తిని ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌కు వచ్చిన పత్తిని చూసిన వ్యాపారులంతా శనివారం ఏకంగా క్వింటాలు పత్తి ధరను రూ.3,600గా నిర్ణయించారు. ఇంతకంటే తాము చెల్లించలేమని తెగేసి చెప్పేశారు. దీంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజులోనే ధరల్లో ఎందుకు తేడా వస్తుందో తెలపాలంటూ వ్యాపారులను నిలదీశారు. అయితే వ్యాపారులు మాత్రం ఇతర ప్రాంతాల్లోనూ పత్తికి ఇదే ధర ఉందనీ, తాము ఎక్కువ ధరకు పత్తిని కొంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వ్యాపారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని భావించిన రైతులు తమ ఆందోళన కొనసాగించారు.
ఓ దశలో కడుపుమండిన రైతులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మార్కెట్‌యార్డులో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ లావాదేవీలు నిలిచిపోయాయి. మార్కెట్ కమిటీకి చెందిన అధికారులు రంగ ప్రవేశం చేసి రైతులు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. సమాచారం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ జి. ప్రతాప్‌రెడ్డి యార్డుకు చేరుకుని వ్యాపారులు, రైతు ప్రతినిధులతో సుమారు 40 నిమిషాలపాటు చర్చలు జరిపారు. నాణ్యత కలిగిన పత్తిని రూ. 4,900 పైచిలుకు, సాధారణంగా ఉన్న పత్తికి రూ.3,700లు ఆపైన ధర చెల్లించాలని నిర్ణయించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత లావాదేవీలను యథావిధిగా కొనసాగాయి.
సేట్‌లు కుమ్మక్కయిండ్రు
నిన్న క్వింటాలు పత్తికి రూ. 5 వేల వరక ు ధర పలికిం దని తెలిసి నేను పొద్దున 9 గంటలకు 10 క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చిన. ఇక్కడికొచ్చి సూస్తే సేట్‌లు కుమ్మక్కయ్యిండ్రు. క్వింటాలుకు రూ. 400 తక్కువ ఇస్తమన్నారు. అందుకనే ఆందోళన చేసినం.
-సుంచు క్రిష్ణ (పత్తి రైతు, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్ వుండలం)