పత్తి రైతు మరింత చితికి పోతున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలతో ఓ వైపు చేతికొచ్చిన పత్తి తడిసిపోగా.. మరోవైపు ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. కనీసం ఎప్పుడు కొనుగోలు చేస్తారన్న ధీమా కూడా ప్రభుత్వం రైతుల్లో కలిగించలేకపోతోంది. దీంతో రైతన్నలు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సాక్షి, నల్లగొండ: పత్తి రైతు పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. భారీ వర్షాలతో ఓ వైపు పత్తి తడిసిపోయి నష్టపోయిన రైతును ప్రభుత్వం తీరు మరింత కష్టాల్లోకి నెడుతోంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో ఇళ్లలో పత్తిని దాచుకోలేక దళారులకు అడ్డికిపావుశేరు అమ్ముకుంటున్నారు. పెట్టుబడులు కాదు కదా.. కూలి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది 7.08 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తి సాగుచేశారు. 45లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుం దని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు.
పత్తి చేతికొచ్చే దశలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట పెద్దఎత్తున దెబ్బతిన్నది. 3.80 లక్షల ఎకరాల పంట నాశనమైంది. చేను మీదున్న పత్తి పూర్తిగా రంగుమారింది. కొన్నిచోట్ల దూదిపింజలు మొలకెత్తాయి. దెబ్బతిన్న పంటలు పరిశీలించేందుకు, జరిగిన నష్టం తెలుసుకునేందుకు గతనెల 27వ తేదీన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. అధికారులతో సమావేశమై.. తడిసిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. నకిరేకల్, చౌటుప్పల్ మండలాల్లో ఈనెల 7వ తేదీన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మేనేజింగ్ డెరైక్టర్‌తో సహా పలువురు అధికారులు పర్యటిం చారు. ఈ సందర్భంగా త్వరలో కేంద్రాలు ఏర్పా టు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో 12 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఒక్క కేంద్రాన్ని తెరిచినపాపాన పోలేదు. వాస్తవంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు గతనెల 15వ తేదీకల్లా ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో వర్షం కారణంగా వరదలు ముంచెత్తడంతో తెరవడం సాధ్యం కాలేదని అధికారులు అంటున్నారు. అయితే వర్షాలు తెరిపి ఇచ్చి కూడా దాదాపు 20 రోజులు కావొస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం స్పందించడం లేదు.
వ్యాపారులు చెప్పిన రేటుకే..
ఇప్పటికే తడిసిన పత్తిని వ్యాపారులు చెప్పిన రేటుకే రైతులు అమ్ముతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా పత్తికి రూ.4000 ఉంది. క్వింటా పత్తిని రూ.2500 నుంచి రూ.3వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అంటే ఒక్కో క్వింటాపై దాదాపు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు రైతులు నష్టపోతున్నారు. పెద్ద రైతులు కొన్ని రోజులపాటు పత్తిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. చిన్న, సన్నకారు రైతులు దాదాపు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. ఏరిన పత్తిని నిలువ చేసుకుంటే అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా పత్తి నల్లబడుతోంది. దీంతో గత్యంతరం లేక వ్యాపారులు చెప్పిన ధరకే కట్టబెడుతున్నారు. ఫలితంగా పేద రైతులు ఆర్థికంగా మరింత చితికిపోతున్నారు.
తడిసిన పత్తిని కొనుగోలు చేసేనా..?
జిల్లాలో 12 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వీటికి అదనంగా మరో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు సీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలు సడలించాలని కేంద్ర టెక్స్‌టైల్స్‌శాఖతోపాటు వ్యవసాయ శాఖకు ప్రజాప్రతినిధులు, అధికారులు లేఖలు రాశారు.
అన్నీ కోల్పోయిన రైతుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. తడిసిన, రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు. అంతేగాక అసలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారన్న దానిపై కూడా జిల్లా అధికారులకు సమాచారం అందలేదు. ఒక వేళ సీసీఐ కేంద్రాలు తెరిచినా.. తడిసిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయకపోతే రైతులకు ఒరిగేదేమీ లేదు.
దూది..దాచలేక
Published Fri, Nov 15 2013 3:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement