జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో వరి పంటకు సోకిన దోమపోటును చూపిస్తున్న రైతు
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: అకాల వర్షాలు, వాతావరణంలో అనూహ్య మార్పులు.. వాటి కారణంగా దాడి చేస్తున్న తెగుళ్లు, సమస్యలు రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచుతున్నాయి. గులాబీరంగు పురుగు దాడి, రంగు మారడంతో ఇప్పటికే పత్తి రైతులు నష్టపోగా.. అటు దోమపోటు కారణంగా వరి రైతు తలపట్టుకుంటున్నాడు. గింజ దశ దాకా బాగానే ఉన్న వరి పంట దోమపోటు కారణంగా దెబ్బతినడంతో ఆందోళనలో మునిగిపోయాడు. వేలకు వేలు ఖర్చు చేసి పురుగుమందులు కొట్టినా ఫలితం లేక ఆవేదనలో పడ్డాడు. చివరికి పంటను కోసే కూలీలకు సరిపడా సొమ్ము కూడా రాని దుస్థితిలో.. కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడుతున్నాడు.
ఐదు లక్షల ఎకరాల్లో..
ఈ ఏడాది ఖరీఫ్‌లో 18.85 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలు, సుడి దోమ దాడి కారణంగా మూడో వంతు పంటకు నష్టం జరిగినట్లు అంచనా. భారీ వర్షాలకు 50 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు నిర్ధారించగా... 5 లక్షల ఎకరాల్లో సుడిదోమ పంజా విసిరిందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ముఖ్యంగా బీపీటీ 5204, ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్ 1504, కేఎన్‌ఎం 118 రకాలకు దోమపోటు ఎక్కువగా ఆశించినట్లు గుర్తించింది. ఇందులో బీపీటీ 5204 పంట బాగా దెబ్బతిన్నట్లు తేల్చింది. ఆ జిల్లాలో ఏకంగా 50 నుంచి 60 శాతం పంట దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణంలో మార్పులు, తేమ శాతం పెరగడం వల్లే సుడిదోమ ఉధృతి పెరిగిందని చెబుతున్నారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో వరికి కాండం తొలిచే పురుగు, సుడిదోమ ఉధృతి ఉన్నట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అధ్యయనంలో తేలింది.
సగం దిగుబడి స్వాహా: వరిలో దోమపోటు సోకితే ఏకంగా 50 శాతం దిగుబడి తగ్గిపోతుంది. సెప్టెంబర్– నవంబర్ మధ్య ఎక్కువగా ఆశించే సుడిదోమ.. మొక్కల మొదళ్లలో చేరి రసాన్ని పీల్చేస్తుంది. దీంతో పంట లేత పసుపురంగులోకి మారి.. సుడులు సుడులుగా ఎండిపోతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 21–23 డిగ్రీల సెల్సియస్, పగటి ఉష్ణోగ్రతలు 25–30 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోయినప్పుడు ఈ దోమ విజృంభణ ఎక్కువగా ఉంటుంది. యూరియా ఎక్కువ మోతాదులో వాడినప్పుడు ఈ దోమ ఎక్కువగా ఆశిస్తుంది. నాలుగైదు రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. సుడిదోమ ఆశిస్తే పిలక దశలో 10–15 శాతం నష్టం, ఈనే దశలో అయితే 40 శాతం, గింజ దశలో అయితే 70–80 శాతం నష్టం జరుగుతుంది.
మందులు చల్లినా ఫలితమేదీ..?
దోమపోటు నివారణ కోసం పురుగు మందులను చల్లినా పెద్దగా ప్రయోజనం కల్పించడం లేదని.. పైగా సాగు ఖర్చు పెరుగుతోందని రైతులు వాపోతున్నారు. దోమపోటు నివారణ మందులను చల్లడానికి ఒక్కో ఎకరాకు ఒకసారికి రూ. వెయ్యి వరకు ఖర్చవుతుంది.
ఆవేదనతో పంటకు నిప్పు
దోమపోటుతో పంట ఎండిపోవడం.. పంటకోసిన కూలీలకు అయ్యే వ్యయమైనా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. చివరికి ఏం చేయాలో అర్థంగాక పంటకు నిప్పు పెడుతున్నారు. సూర్యాపేట మండలంలో దాదాపు 25 ఎకరాల్లో రైతులు వరికి నిప్పు పెట్టినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
- జగిత్యాల జిల్లాకు చెందిన ఈ రైతు ఎడ్మల నచ్చరెడ్డి. నాలుగెకరాల్లో సన్నరకం వరి వేశాడు. గింజ దశలో దోమపోటు వచ్చింది. ఇప్పటికే ఐదారు వేలు ఖర్చుపెట్టి పురుగుమందులు కొట్టాడు. పొలంలో పాయలు సైతం తీశాడు. అయినా దోమ ఉధృతి ఆగలేదు. రూ.50 వేల దాకా నష్టం జరిగిందని.. ప్రభుత్వం పరిహారం అందించాలని వాపోతున్నాడు.
యూరియా ఎక్కువ వాడొద్దు
వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కు వగా దోమపోటు వచ్చింది. నత్రజని (యూరి యా)ఎకరాకు 30 కిలోలు మించి వాడినా దోమ పెరుగుతుంది. దోమపోటు కొద్దిగా వచ్చిన సమయంలోనే రక్షణ చర్యలు చేపట్టడం మంచిది. దోమ తరచుగా ఆశించే ప్రాంతాల్లో దోమ పోటును తట్టుకునే రకాలను సాగు చేయాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. వెడల్పు బాటలు వదిలి, పొలాన్ని ఆరబెట్టాలి.
– ఎం.వెంకటయ్య, శాస్త్రవేత్త, పొలాస
మూడో వంతు సోకితేనే బీమా
దోమపోటుకు పంటల బీమా పథకం కింద పరిహారం పొందే వీలుంది. అయితే గ్రామం యూనిట్‌గా మూడో వంతు వరికి దోమపోటు సోకితేనే రైతులకు పరిహారం వస్తుంది. దీనిపై మరింత అధ్యయనం చేసి పరిహారం ఇప్పించేందుకు కృషిచేస్తాం..
–పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment