చేవెళ్ల, న్యూస్‌లైన్: ఎట్టకేలకు చేవెళ్లలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. చేవెళ్ల పరిధిలోని పత్తి రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే గురువారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మలిపెద్ది వెంకటేశంగుప్త చేతులమీదుగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లాలోనే మొదటిసారిగా ఈ కొనుగోలు కేంద్రం ఆరంభమైంది. ఈ సందర్భంగా వెంకటేశంగుప్త మాట్లాడుతూ దళారులు, వ్యాపారుల నుంచి పత్తి రైతులను రక్షించడానికే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నాణ్యమైన పత్తికి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.4వేల మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు పత్తిని తీసుకొచ్చేటప్పుడు పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ తీసుకురావాలన్నారు. వారం రోజులలోపే డబ్బులు రైతు ఖాతాలోకి చేరుతాయన్నారు. చేవెళ్లలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటుచేసిన కేంద్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. వరంగల్‌లోని సీసీఐ ప్రధాన మార్కెట్ కింద ఈ కేంద్రం పనిచేస్తోందన్నారు. వరంగల్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఎక్కడా ఏర్పాటుకాని సీసీఐ పత్తి కొనుగోలు ఉపకేంద్రాన్ని మొదటగా చేవెళ్ల ఏర్పాటుచేసిన సీసీఐ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల సహకార సంఘం అధ్యక్షుడు దేవర వెంకట్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, డెరైక్టర్లు మాధవగౌడ్, కుంచం గోపాల్, మల్గారి చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ అలీ, విఠలయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తేమ 12శాతం దాటితే కొనం..
పత్తిలో 12శాతానికి మించి తేమ ఉన్నట్లయితే సీసీఐ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయడం కుదరదని పత్తి కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి, సీసీఐ అధికారి శరత్, మార్కెట్ కమిటీ కార్యదర్శి వీరబద్రయ్యస్వామిలు తెలిపారు. 8 శాతంలోపు తేమ ఉంటే క్వింటాలుకు రూ.4వేలు, 9శాతం ఉంటే రూ. 3,960, 10శాతం ఉంటే రూ.3,920, 11శాతం ఉంటే రూ.3,880, 12శాతం ఉంటే రూ.3,840 ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు.
చేవెళ్లలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
Published Fri, Dec 13 2013 1:10 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement