Cotton purchase center
-
పత్తి మొత్తం ఒకేసారి అమ్ముకోవచ్చు
సాక్షి, అమరావతి: వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పత్తిని అమ్ముకోలేక బాధపడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రంతో సంబంధం లేకుండా నిబంధనలు సడలించింది. రైతులకు సమీపంలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేసింది. పత్తి పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా చూస్తోంది. దాదాపు ఐదులక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిబంధనల కారణంగా ఇప్పటివరకు 61 వేల క్వింటాళ్లనే కొనుగోలు చేశారు. పత్తిలో తేమ అధికశాతం ఉండటం, రంగు మారడం వల్ల రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న నిబంధనలను ఆసరాగా చేసుకుని తెలంగాణ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో ప్రభుత్వం నిబంధనలు సడలించింది. చకచకా ఫైర్ ఎన్వోసీలు కొనుగోలు కేంద్రాలుగా ఎంపిక చేసిన జిన్నింగ్ మిల్లులకు అగ్నిమాపకశాఖ అనుమతులు లేకపోవడంతో వాటిని ఖరారు చేయలేదు. అయితే రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఫైర్ ఎన్వోసి దరఖాస్తులు పరిశీలనలో ఉంటే.. వాటిని ఎంపిక చేస్తున్నారు. పరిమితి పెంచేందుకు ప్రయత్నాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఏడు క్వింటాళ్లు, కొన్ని జిల్లాల్లో 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్ని ప్రభుత్వానికి వివరించి, ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 15 క్వింటాళ్లు కొనుగోలు చేయడానికి అనుమతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. నిబంధన ఎత్తివేత మండలానికి సగటు దిగుబడిని అంచనావేసి ఒక్కో రైతు వద్ద ఎకరాకు 7 నుంచి 11.87 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన అమలులో ఉంది. ఈ పంటను నవంబర్‌లో 25 శాతం, డిసెంబర్లో 50 శాతం, జనవరిలో 25 శాతం పత్తిని కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిబంధనను ఎత్తివేసి ఒకేసారి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. -
తెల్లబోతున్న బంగారం..!
జమ్మికుంట(హుజూరాబాద్): తెల్లబంగారం తెల్లబోతోంది. మొన్నటివరకు మద్దతును మించి ధర పలికిన పత్తి.. వారం వ్యవధిలోనే రూ.600 తగ్గింది. ఒకదశలో రూ.6వేలకు పెరుగుతుందని ఆశించిన రైతులకు తాజాగా పడిపోతున్న ధరలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మద్దతు కంటే ధర దిగువకు పడిపోయాయి. మంగళవారం క్వింటాల్‌కు రూ.5,350 పలికింది. మరోవైపు పత్తి కొనుగోలుకు సీసీఐ రంగంలోకి దిగడంతో రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. పత్తి ధర పతనం ఇలా.. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పడిపోతోంది. ఫలితంగా ఇక్కడి పత్తికీ ధర తగ్గుతోంది. తాజాగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రా ష్ట్రాల్లో పత్తి అమ్మకాలు జోరందుకోవడంతో పత్తి ధరలపై ప్రభావం చూపుతోందని ఎగుమతిదారులు వెల్లడిస్తున్నారు. నార్త్ ఇండియాలోని హర్యానా, పంజాబ్, రాజాస్థాన్‌లో గతంలో క్యాండి ధర రూ.47,500 వరకు పలకగా.. ప్రస్తుతం ఆ ధర రూ.44 వేలకు పడిపోయింది. అదే విధంగా సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో క్యాండీ ధర గతంలో 47,500 వరకు పలకగా.. సోమవారం రూ.44, 300కు దిగజారింది. పత్తి గింజలు సైతం క్వింటాల్‌కు గతంలో రూ.2,350 నుంచి 2,500 వరకు పలకగా.. సోమవారం ఏకంగా రూ.2,100 నుంచి 2,070కు దిగింది. దీంతో జమ్మికుంట పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి వారం క్వింటాల్ పత్తి ధర రూ.5800 పలకగా.. సోమవారం రూ.5,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొంటున్న వ్యాపార సంక్షోభంతో పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనంకానున్నాయని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. కాటన్ వ్యాపారులకు భారీ నష్టం..? జమ్మికుంట పత్తిమార్కెట్లో రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులకు పడిపొతున్న పత్తి, గింజల ధరలు భారీనష్టాన్ని మిగిల్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో కాటన్ మిల్లర్ దాదాపు 20 రోజుల వ్యవధిలో రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం. పత్తికి డిమాండ్ లేకున్నా.. మిల్లుల నిర్వహణ కోసం పోటీ పడి మరీ పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులు పడిపోయిన ధరలతో గందరగోళంలో పడినట్లు తెలిసింది. చేసేదేమీ లేక ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టినట్లు సమాచారం. కొందరు కాటన్ మిల్లర్లు తమ వ్యాపారాలను పక్కన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇక సీసీఐ కొనుగోలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. జమ్మికుంటలో పడిపోయిన పత్తి ధర జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మంగళవారం క్వింటాల్ పత్తికి రూ.5,350 పలికింది. మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంయి 1165 క్విం టాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5350 చెల్లించారు. కనిష్టంగా రూ.5,300 చెల్లించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ఉండగా.. వ్యాపారులు రూ.100 తగ్గించి కొనుగోలు చేశారు. డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు ధర తక్కువైనా వ్యాపారులకే విక్రయించారు. రెండుమూడు రోజులు అలస్యమైనా సరే అనుకున్నవారు సీసీఐకి విక్రయించారు. రంగంలోకి సీసీఐ మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు ధర తక్కువగా చెల్లిస్తుండడం.. సీసీఐ రంగంలోకి దిగడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సీసీఐ ఇన్చార్జి తిరుమల్‌రావు సైతం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు వచ్చి పలువురు రైతుల వద్ద సోమవారం 60 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయించారు. మంగళవారం మరో 120 క్వింటాళ్లు కొన్నారు. సీసీఐకే అమ్ముకున్న..పసుల రాజయ్య, భీంపల్లి, కమాలాపూర్ మాది కమాలాపూర్ మండలం భీంపెల్లి. నాకున్న ఐదెకరాల్లో పంటలు సాగు చేశా. నాలుగెకరాల్లో ప త్తి పెట్టిన. మొదట పత్తి ఏరితే 24క్వింటాళ్లు చేతికి వచ్చింది. జమ్మికుంట మార్కెట్‌కు నాలుగున్నర క్వింటాళ్లు తీసుకొచ్చిన. క్వింటాల్‌కు ప్రవేట్ వ్యా పారులు రూ.5350 ధర చెల్లిస్తామన్నారు. నేను సీసీఐకి మద్దతు ధరతో రూ.5450తో అమ్ముకున్న. పాసుబుక్కు తప్పనిసరి తిరుమల్‌రావు, సీసీఐ సెంటర్ ఇన్చార్జి సీసీఐకి విక్రయించాలనుకునే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, పట్టదారు పాస్‌పుస్తకం, బ్యాంక్ ఖాతా బుక్కు తెచ్చుకోవాలి. తేమశాతం 12లోపు ఉన్న ఉత్పత్తులను తప్పకుండా కొంటాం. పత్తి మార్కెట్‌తోపాటు పట్టణంలోని మూడు కాటన్ మిల్లుల్లో మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. పట్టణంలోని ఆరు మిల్లుల్లో అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. -
‘మద్దతు’పైనే ఆశలు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: పత్తి రైతులు ఏటా ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గిట్టుబాటు ధర పక్కనబెడితే మద్దతు ధర లభించని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏయేడు చూసినా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గతేడాది వర్షాలు కురువక నష్టపోయిన రైతులు, ఈయేడాది అధిక వర్షాలతో పంటలు నష్టపోయారు. గతేడాది పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4,320 ఉండగా, ఈయేడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించిన విషయం విదితమే. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధరను క్వింటాలుకు రూ.1130 పెంచింది. ఈ నిర్ణయంతో అన్నదాతల్లో సంతోషం ఉన్నా ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులు మద్దతు ధర చెల్లిస్తారో లేదోనని రైతులు దిగాలు చెందుతున్నారు. వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతుకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం నుంచి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ ఇప్పటికే పలుసార్లు వ్యాపారులు, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. పత్తిని అన్లోడింగ్ చేసిన తర్వాతే తేమ శాతాన్ని పరీక్షించాలని అధికారులకు సూచించారు. రూ.6వేలు చెల్లిస్తేనే మేలు.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.5450 కనీస మద్దతు ధర నిర్ణయించింది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండడంతో క్వింటాలుకు రూ.6వేలు చెల్లిస్తే గానీ గిట్టుబాటు కాదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధర పెంచినప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో ఖర్చులు కూడా భారీగా పెరిగాయని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం వరంగల్ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.5,800తో కొనుగోలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆదిలాబాద్ మార్కెట్లో క్వింటాలుకు రూ.5,600 నుంచి రూ.5800 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడంతో ధర పెంచుతారో లేదనేది అనుమానంగానే ఉంది. మద్దతు ధర కంటే తక్కువగా ఉంటేనే ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ రంగంలోకి దిగుతుంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 34,629 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు 23లక్షల 59వేల 627 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గతేడాది మొత్తం జిల్లా వ్యాప్తంగా 23లక్షల 94వేల 226 క్వింటాళ్ల పత్తి రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. తేమ కొర్రీతో ఆందోళన.. రైతులకు యేటా తేమ కొర్రీ తంటాలు తప్పడం లేదు. తేమ పేరిట ఇష్టారీతిన కోతలు విధించడంతో మద్దతు ధరకు కూడా నోచుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని, ఆపై తేమ శాతం పెరిగే కొనుగోలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు. 8 శాతం తేమ ఉంటే మద్దతు ధర రూ.5,450, అంతకంటే కంటే ఒక్క శాతం పెరిగితే అదనంగా రూ.54.50 చొప్పున కోత విధించనున్నారు. ఇదే నిర్ణయాన్ని ఈసారి ప్రైవేట్ వ్యాపారులు కూడా పాటించే విధంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. దీంతో మంచు కురియనుండడంతో పత్తిలో తేమ ఎలాగైనా ఉంటుంది. ఇదే అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు రైతులు పంటపై నీళ్లు చల్లి మార్కెట్‌కు తీసుకొస్తున్నారని కోతలు విధించడంతో అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. కలెక్టర్ తేమ శాతం పేరిట కోతలు ఎక్కువగా విధించవద్దని ప్రైవేట్ వ్యాపారులతో జరిగిన సమావేశంలో సూచించారు. 8 నుంచి 12 శాతం తేమ ఉంటే కొంత కోత విధించాలని, 12 నుంచి 16 శాతం తేమ ఉంటే మరో కొంత కోత విధించాలే తప్పా, ఇష్టారీతిన కోతలు విధిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. తేమ కొలిచే యంత్రాల్లో వ్యత్యాసం ఎలా వస్తుందని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. తేమ యంత్రాన్ని సగం భాగంలో పెడితే తేమ ఒక విధంగా, పూర్తిగా ఉంచితే మరో విధంగా, సీసీఐ తేమ యంత్రంలో మరో విధంగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి.. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం 9గంటలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ దివ్యదేవరాజన్ కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో పది ఎలక్ట్రానిక్ తూకం కాంటాలను ఏర్పాటు చేశారు. 40 మెట్రిక్ టన్నుల కాంటా ఒకటి, 20 మెట్రిక్ టన్నుల కాంటాలు మూడు, 5 మెట్రిక్ టన్నుల కాంటాలు మూడు, ఎడ్లబండ్లకు సంబంధించి మూడు కంటాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ పరిధిలో 298 కాటన్ కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 225 మంది కొనుగోళ్లు చేయనున్నారు. 186 మంది ట్రేడర్స్, 27 జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేశారు. జిన్నింగ్ మిల్లుల్లోనే ధర నిర్ణయం.. ప్రతియేడు మార్కెట్‌కు వచ్చిన పత్తి వాహనంలో ఉన్నప్పుడే తేమ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించేవారు. దీంతో రైతులు నష్టాలను చవిచూసేవారు. ఈ విషయాన్ని గ్రహించిన జిల్లా కలెక్టర్ రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు చేపట్టారు. పత్తి వాహనం అన్లోడ్ చేసిన తర్వాత తేమ శాతాన్ని లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో రైతులకు తేమ కొర్రీల విషయంలో కొంత ఇబ్బందులు తొలిగేలా కనిపిస్తోంది. -
చేవెళ్లలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
చేవెళ్ల, న్యూస్‌లైన్: ఎట్టకేలకు చేవెళ్లలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. చేవెళ్ల పరిధిలోని పత్తి రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే గురువారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మలిపెద్ది వెంకటేశంగుప్త చేతులమీదుగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లాలోనే మొదటిసారిగా ఈ కొనుగోలు కేంద్రం ఆరంభమైంది. ఈ సందర్భంగా వెంకటేశంగుప్త మాట్లాడుతూ దళారులు, వ్యాపారుల నుంచి పత్తి రైతులను రక్షించడానికే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాణ్యమైన పత్తికి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.4వేల మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు పత్తిని తీసుకొచ్చేటప్పుడు పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ తీసుకురావాలన్నారు. వారం రోజులలోపే డబ్బులు రైతు ఖాతాలోకి చేరుతాయన్నారు. చేవెళ్లలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన కేంద్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. వరంగల్‌లోని సీసీఐ ప్రధాన మార్కెట్ కింద ఈ కేంద్రం పనిచేస్తోందన్నారు. వరంగల్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఎక్కడా ఏర్పాటుకాని సీసీఐ పత్తి కొనుగోలు ఉపకేంద్రాన్ని మొదటగా చేవెళ్ల ఏర్పాటుచేసిన సీసీఐ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల సహకార సంఘం అధ్యక్షుడు దేవర వెంకట్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, డెరైక్టర్లు మాధవగౌడ్, కుంచం గోపాల్, మల్గారి చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ అలీ, విఠలయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తేమ 12శాతం దాటితే కొనం.. పత్తిలో 12శాతానికి మించి తేమ ఉన్నట్లయితే సీసీఐ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయడం కుదరదని పత్తి కొనుగోలు కేంద్రం ఇన్చార్జి, సీసీఐ అధికారి శరత్, మార్కెట్ కమిటీ కార్యదర్శి వీరబద్రయ్యస్వామిలు తెలిపారు. 8 శాతంలోపు తేమ ఉంటే క్వింటాలుకు రూ.4వేలు, 9శాతం ఉంటే రూ. 3,960, 10శాతం ఉంటే రూ.3,920, 11శాతం ఉంటే రూ.3,880, 12శాతం ఉంటే రూ.3,840 ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు.