‘మద్దతు’పైనే ఆశలు | Cotton Support Price Farmers Problems Adilabad | Sakshi
Sakshi News home page

‘మద్దతు’పైనే ఆశలు

Published Wed, Oct 17 2018 7:47 AM | Last Updated on Wed, Oct 17 2018 7:47 AM

Cotton Support Price  Farmers Problems Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: పత్తి రైతులు ఏటా ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గిట్టుబాటు ధర పక్కనబెడితే మద్దతు ధర లభించని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏయేడు చూసినా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గతేడాది వర్షాలు కురువక నష్టపోయిన రైతులు, ఈయేడాది అధిక వర్షాలతో పంటలు నష్టపోయారు. గతేడాది పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4,320 ఉండగా, ఈయేడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించిన విషయం విదితమే. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధరను క్వింటాలుకు రూ.1130 పెంచింది. ఈ నిర్ణయంతో అన్నదాతల్లో సంతోషం ఉన్నా ప్రైవేట్‌ వ్యాపారులు, సీసీఐ అధికారులు మద్దతు ధర చెల్లిస్తారో లేదోనని రైతులు దిగాలు చెందుతున్నారు.

వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతుకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం నుంచి ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఇప్పటికే పలుసార్లు వ్యాపారులు, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. పత్తిని అన్‌లోడింగ్‌ చేసిన తర్వాతే తేమ శాతాన్ని పరీక్షించాలని అధికారులకు సూచించారు.

 రూ.6వేలు చెల్లిస్తేనే మేలు..
కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.5450 కనీస మద్దతు ధర నిర్ణయించింది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండడంతో క్వింటాలుకు రూ.6వేలు చెల్లిస్తే గానీ గిట్టుబాటు కాదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధర పెంచినప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో ఖర్చులు కూడా భారీగా పెరిగాయని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం వరంగల్‌ మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాలుకు రూ.5,800తో కొనుగోలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆదిలాబాద్‌ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.5,600 నుంచి రూ.5800 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ధర పెంచుతారో లేదనేది అనుమానంగానే ఉంది. మద్దతు ధర కంటే తక్కువగా ఉంటేనే ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ రంగంలోకి దిగుతుంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 34,629 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్‌ వ్యాపారులు 23లక్షల 59వేల 627 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గతేడాది మొత్తం జిల్లా వ్యాప్తంగా 23లక్షల 94వేల 226 క్వింటాళ్ల పత్తి రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది.
 
తేమ కొర్రీతో ఆందోళన..
రైతులకు యేటా తేమ కొర్రీ తంటాలు తప్పడం లేదు. తేమ పేరిట ఇష్టారీతిన కోతలు విధించడంతో మద్దతు ధరకు కూడా నోచుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని, ఆపై తేమ శాతం పెరిగే కొనుగోలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు. 8 శాతం తేమ ఉంటే మద్దతు ధర రూ.5,450, అంతకంటే కంటే ఒక్క శాతం పెరిగితే అదనంగా రూ.54.50 చొప్పున కోత విధించనున్నారు. ఇదే నిర్ణయాన్ని ఈసారి ప్రైవేట్‌ వ్యాపారులు కూడా పాటించే విధంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. దీంతో మంచు కురియనుండడంతో పత్తిలో తేమ ఎలాగైనా ఉంటుంది.

ఇదే అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు రైతులు పంటపై నీళ్లు చల్లి మార్కెట్‌కు తీసుకొస్తున్నారని కోతలు విధించడంతో అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. కలెక్టర్‌ తేమ శాతం పేరిట కోతలు ఎక్కువగా విధించవద్దని ప్రైవేట్‌ వ్యాపారులతో జరిగిన సమావేశంలో సూచించారు. 8 నుంచి 12 శాతం తేమ ఉంటే కొంత కోత విధించాలని, 12 నుంచి 16 శాతం తేమ ఉంటే మరో కొంత కోత విధించాలే తప్పా, ఇష్టారీతిన కోతలు విధిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. తేమ కొలిచే యంత్రాల్లో వ్యత్యాసం ఎలా వస్తుందని అధికారులను కలెక్టర్‌ ప్రశ్నించారు. తేమ యంత్రాన్ని సగం భాగంలో పెడితే తేమ ఒక విధంగా, పూర్తిగా ఉంచితే మరో విధంగా, సీసీఐ తేమ యంత్రంలో మరో విధంగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులు ఆదేశించారు.

కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి..
ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం ఉదయం 9గంటలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డులో పది ఎలక్ట్రానిక్‌ తూకం కాంటాలను ఏర్పాటు చేశారు. 40 మెట్రిక్‌ టన్నుల కాంటా ఒకటి, 20 మెట్రిక్‌ టన్నుల కాంటాలు మూడు, 5 మెట్రిక్‌ టన్నుల కాంటాలు మూడు, ఎడ్లబండ్లకు సంబంధించి మూడు కంటాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌ పరిధిలో 298 కాటన్‌ కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 225 మంది కొనుగోళ్లు చేయనున్నారు. 186 మంది ట్రేడర్స్, 27 జిన్నింగ్‌ మిల్లులు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేశారు.

జిన్నింగ్‌ మిల్లుల్లోనే ధర నిర్ణయం..
ప్రతియేడు మార్కెట్‌కు వచ్చిన పత్తి వాహనంలో ఉన్నప్పుడే తేమ శాతాన్ని లెక్కించి ధర నిర్ణయించేవారు. దీంతో రైతులు నష్టాలను చవిచూసేవారు. ఈ విషయాన్ని గ్రహించిన జిల్లా కలెక్టర్‌ రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు చేపట్టారు. పత్తి వాహనం అన్‌లోడ్‌ చేసిన తర్వాత తేమ శాతాన్ని లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయంతో రైతులకు తేమ కొర్రీల విషయంలో కొంత ఇబ్బందులు తొలిగేలా కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement