ఎత్తు మడులపై విత్తటం వల్ల అతివృష్ఠి పరిస్థితుల్లో నీట మునగకుండా ఉండా సురిక్షితంగా ఉన్న పత్తి పంట (ఫైల్)
ఎత్తు మడుల (రెయిజ్డ్ బెడ్స్)పై పంటల సాగు ఎన్నో విధాలా మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసినా, తక్కువగా కురిసినా.. అది నల్లరేగడి నేలైనా, ఎర్ర చల్కా నేలలైనా.. అది మెరక పొలమైనా, లోతట్టు ప్రాంతమైనా.. పత్తి /కంది /మిర్చి /పసుపు పంటలైనా లేదా వంగ తదితర కూరగాయ పంటలైనా సరే ఎత్తు మడులపై విత్తుకుంటే మేలు అంటున్నారు.
అతివృష్టి, అనావృష్టి కాలాల్లో వత్తిళ్లను తట్టుకోవడమే కాకుండా పంటలు బాగా పెరుగుతాయని, గాలి వెలుతురు బాగా సోకడం వల్ల చీడ పీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని, అంతిమం గా అధిక దిగుబడులనిస్తాయని ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. మూడేళ్ల క్రితం నుంచి ఎత్తుమడులపై పత్తి (4సాళ్లు)+కంది(2సాళ్లు) కలిపి సాగు చేసే పద్ధతిలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. అతివృష్టి అయినా, అనావృష్టి అయినా పంటలు దెబ్బతినకుండా ఎకరానికి 13–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తున్నదని చెబుతున్నారు.
ట్రాక్టర్‌కు రెయిజ్డ్ బెడ్ మేకర్ పరికరాన్ని అమర్చి వరుసల మధ్య 5 అడుగుల ఎడంతో, అడుగు వెడల్పు (150X30 సెం.మీ.) తో ఎత్తు మడులు తయారు చేస్తున్న దృశ్యం
ఆరుగాలం కష్టపడే అన్నదాత ప్రతి యేడు ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు అధికంగా పడి పంట నీట మునగడం, ఒక్కోసారి సరైన సమయం లో వర్షాలు కురువక పంటలు ఎండిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అధిక వర్షాలు పడితే నల్లరేగడి పొలం ఉరకెత్తుతుంది. దిగుబడి లోపిస్తుంది. ఎత్తు మడుల విధానంలో లాభాల బాటలోకి పయనించవచ్చని డాక్టర్ ప్రవీణ్ సూచిస్తున్నారు.
చిన్న ట్రాక్టర్‌తో అంతర సేద్యం ద్వారా కలుపు నిర్మూలిస్తున్న దృశ్యం
15X30 సెం.మీ. దూరం మేలు
ఎత్తు మడులపై పత్తి, కంది మాత్రమే కాదు.. మిర్చి, పసుపుతోపాటు వంగ తదితర కూరగాయలను సాగు చేయవచ్చు అంటున్నారు డా.ప్రవీణ్. గతఏడాది 5 ఎకరాల్లో ఈ విధానంలో పత్తి పంట సాగు చేశారు. అధిక వర్షం కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండకుండా బెడ్లుగా తయారు చేసి, వాటిపైన పత్తి విత్తనాలు నాటారు. పత్తి మొక్కల సాళ్ల మధ్య 180X30 సెం.మీ., 150X20 సెం.మీ., 120X30 సెం.మీ.ల దూరంలో ప్రయోగాత్మకంగా పత్తి పంటను సాగు చేశారు.
ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో 5 అడుగుల వెడల్పు ఎత్తు మడులపై 4 వరుసలు పత్తి, 2 వరుసలు కంది విత్తినప్పటి దృశ్యం (ఫైల్)
మొక్కకు 80 కాయల వరకు కాచాయి. తక్కువ దూరం పెట్టిన చోట తోట కలిసిపోయి పిచికారీలకు ఇబ్బంది ఏర్పడింది. అందుకని, 150X30 సెం.మీ. (సాళ్ల మధ్యన 5 అడుగులు, మొక్కల మధ్యన ఒక అడుగు దూరం) చొప్పున 4 సాళ్లు పత్తి, 2 సాళ్లు కంది విత్తామని డా. ప్రవీణ్ వివరించారు. సాళ్ల మధ్య తగినంత ఖాళీ ఉండడంతో మినీ ట్రాక్టర్ ద్వారా కలుపు తీయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎద్దులతో పైపాటు చేసుకునే రైతులు సాళ్ల మధ్య 4 అడుగులు (120 సెం.మీ.) దూరం పెట్టుకున్నా పర్వాలేదన్నారు.
అధిక వర్షాలు కురిస్తే.. సాళ్లలో నీరు నిల్వ ఉండి ఇంకుతుంది. వర్షాలు తక్కువగా ఉంటే.. కురిసిన కొద్ది మాత్రం వర్షం ఎక్కడికక్కడే ఇంకి ఎత్తు మడులపై ఉన్న పంటలు త్వరగా నీటి ఎద్దడికి గురికాకుకుండా ఉపయోగపడుతుంది. సాధారణ సాగు పద్ధతిలో అధిక వర్షం కురిసినప్పుడు పంటలు ఉరకెత్తి దెబ్బతింటాయి. తక్కువ వర్షం కురిస్తే పంట త్వరగా బెట్టకు వస్తుంది. ఎత్తు మడులపై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా నష్టాన్ని నివారించవచ్చు. అంతేకాదు పంటలు ఏవైనా సరే ఈ పద్ధతిలో అధిక దిగుబడి కూడా పొందవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.
– యేర సుధాకర్, సాక్షి, ఆదిలాబాద్ టౌన్
చదవండి: డ్రాగన్ ప్రూట్ కన్నా అధిక పోషక విలువలు..
Comments
Please login to add a commentAdd a comment