
కేంద్ర మంత్రిపై మండిపడ్డ హరీష్
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికి మద్దతు ధర పెంచుతామని ఆశచూపి రైతులను మోసం చేసింది బీజేపీనే అని హరీష్ పేర్కొన్నారు. పత్తి కొనుగోలు చేయడంలో సీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులకు మొర పెట్టుకున్నా స్పందించనే లేదని దత్తాత్రేయను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. పత్తి కొనుగోలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వమే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదన్నారు. మహారాష్ట్రలో పత్తికి బోనస్ ఇస్తున్నారనడం అవాస్తవమని, కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్ని హరీష్ తీవ్రంగా ఖండించారు.