జమ్మికుంట : వర్షాభావం... కరెంటు కోతలు పత్తి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. గిట్టుబాటు దేవుడెరుగు... పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 6లక్షల ఎకరాలు కాగా, వర్షాభావ పరిస్థితులతో 5.50లక్షల ఎకరాల్లో మాత్ర మే సాగయింది. ఖరీఫ్ ప్రారంభంలో అడపాదడపా కురిసినవానలకు రైతులు విత్తనాలు వేయ గా అప్పటి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. వర్షాధారంపై సాగు చేసిన పత్తికి నీళ్లందక ఎర్ర బొమ్మిడి తెగులు సోకింది. కాయదశలోనే మొక్కలు ఎండిపోయాయి. బావులు, బోర్ల కింద పత్తివేసిన రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కరెంటు కోతలు పెరగడంతో బావుల్లో నీళ్లున్నా.. వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎకరాకు 8నుంచి 10 క్విం టాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా చేతికి రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో కనీసం పెట్టుబడి కూడా చేతికి వచ్చే అవకాశం కనిపించడం లేదంటున్నారు. ఎండిపోతున్న పత్తి చేలలో చేతికి వచ్చిన పత్తిని ఏరుతూ రైతులు కంటనీరు పెడుతున్నారు. ఎవుసాన్ని నమ్ముకుంటే ఏటా అప్పులే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
దక్కని మద్దతు ధర
పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 కాగా, మొన్నటిదాకా రూ.3000 నుంచి రూ.3500 లోపే పలికింది. ప్రస్తుతం పత్తి ధరలు నిలకడగా పెరుగుతూ రూ.4000 వేలకు చేరుకున్నాయి. సాగుకోసం ఇప్పటివరకు ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి కాగా, దిగుబడి ప్రకారం చూస్తే నష్టాలే మిగలుతున్నాయి.
కౌలు రైతుల పరిస్థితైతి మరీ దారుణంగా ఉంది. సాగు చేసిన నష్టంతోపాటు కౌలుగా ఎకరాకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు అదనంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఈ అప్పులెలా తీర్చాలని వారంతా ఆందోళన చెందుతున్నారు.
కరెంటు కోతలు దెబ్బతీసినయ్..
నాకున్న రెండెకరాల్లో పత్తి వేసిన. వానల్లేక ఎండిపోవట్టిం ది. కరెంటు మోటారు పెడుదామంటే బాయిల నీళ్లున్న యి గానీ.. కరెంటు లేకపాయే.. వానల్లేకున్నా.. బాయిని నమ్ముకుని పత్తి పెడితే.. కరెంటు కోతలు దెబ్బదీసినయి. అక్కడక్కడ కొన్ని కాయలు.. ఎండలకు పగిలినయి. కూలీలను పెట్టి ఏరిపిద్దామంటే ఖర్చులు కూడా ఎల్లయి. నా భార్య, నేను పొద్దంతా ఏరితే నాలుగు బస్తాలు చేతికి రాలేదు. కరెంటు ఉంటే కనీసం పెట్టుబడి అయినా వచ్చేది. - పొనగంటి సంపత్, మోత్కులగూడెం, జమ్మికుంట
కూలీ ఖర్చులు కూడా రావు..
నేను రెండెకరాల పత్తి పెట్టిన. వానల్లేక చేనంతా దెబ్బతిన్నది. పూతరాలిపోయి కాయలే పడలేదు. ఉన్నదంతా ఏరితే.. నాలుగు కింటాళ్లు కూడా వచ్చేటట్టు లేదు. చేను దిక్కు రావాలంటే కాలు కదుల్తలేదు. మొత్తం పెట్టుబడి యాభై వేల దాకా అయ్యింది. ఏరిన పత్తిని అమ్మితే కూలి డబ్బులు కూడా వస్తాయో రావో. ఎప్పుడూ గింత లాస్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాల్నో ఏం అర్థమైతలేదు. - సుదర్శన్, మోత్కులగూడెం, జమ్మికుంట
పత్తి రైతు కంటతడి
Published Fri, Oct 31 2014 11:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement