సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం సిద్ధం చేసిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల ప్రాజెక్టులోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు అనుసంధానించే తుది ప్రణాళిక ఖరారైంది. దేవాదుల ప్రాజెక్టులో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు పూర్తి భరోసా ఇచ్చేలా మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందించే పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొత్తంగా రూ.405 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వడం ద్వారా దేవాదులలోని సుమారు 1.30 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేలా కార్యాచరణను త్వరలోనే మొదలుపెట్టనుంది.
నిజానికి దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గంగాపురం ఇంటేక్ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే 200 కిలోమీటర్లకుపైగా నీటి తరలింపు చేయాల్సి ఉంది. తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించాలంటే కనీసంగా 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో తపాస్‌పల్లి కింది ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు.
దీంతో మల్లన్నసాగర్ నుంచి 10.06 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని కనీసం 4 నెలలపాటు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఓపెన్‌కెనాల్‌తోపాటు 3.60 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనతో కనీసం 13 నుంచి 14 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా తపాస్‌పల్లి కింద నిర్ణయించిన 74,955 ఎకరాలతోపాటు, కొన్నబోయినగూడెం, వెల్దండ, లద్దనూరుతోపాటే దారి పొడవునా ఉండే చెరువుల కింద మరో 55 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ సైతం ఆమోదించినట్లు తెలుస్తోంది.
మల్లన్నసాగర్ నుంచే దేవాదులకు గోదావరి
Published Tue, Aug 24 2021 3:48 AM | Last Updated on Tue, Aug 24 2021 3:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment