సోనియాగాంధీ చేతుల మీదుగా జరిపిస్తాం
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడి
300 రోజుల్లో 60 టీఎంసీల వినియోగం.. 7 జిల్లాలు సస్యశ్యామలం
ప్రాజెక్ట్‌ల భూసేకరణకు ప్రత్యేక అధికారి
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చి లోపు వందశాతం పూర్తి చేసి, అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలో 300 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులతో కలిసి ఆయన సందర్శించారు.
దేవాదుల పంప్‌హౌస్ వద్ద ప్రాజెక్ట్ పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పిస్తామన్నారు. ధరలు పెరగడంతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందిగా మారిందని, ఇందుకోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. కాలపరిమితిని పెట్టి వీలైనంత త్వరగా సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డిలను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పారు.
ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం
ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ డెకాయిట్‌లా వ్యవహరించారని, ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్‌ల పేరుతో రూ.1.81 లక్షల కోట్ల నిధులు ఖర్చుపెట్టారని, రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచారని వెల్లడించారు. రూ.1.81 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తప్పనిసరిగా చెల్లిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
15 ఏళ్లుగా నత్తనడకన దేవాదుల: పొంగులేటి
దేవాదుల ప్రాజెక్ట్ పనులు 15 ఏళ్లుగా నత్తనడకలో సాగాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. దీనికోసం మరో 3 వేల ఎకరాల భూసేకరణ నవంబర్ 15 లోపు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇచి్చన హామీ మేరకు, భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్, యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, ప్రభుత్వ కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు.
చెరువులు ఆక్రమిస్తే ఊపేక్షించం
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న నీటిపారుదల వనరులపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గత పదేళ్లలో అన్ని శాఖల కంటే ఎక్కువగా నష్టపోయింది నీటిపారుదల శాఖే అని అన్నారు. సీఎం ఆలోచనల మేరకు మూసీ నదిలో నీటి లభ్యతను పెంచుతామన్నారు. అంతకు ముందు హన్మాపురం వద్ద బునాదిగాని కాలువను మంత్రులు పరిశీలించారు.
రుణమాఫీకి మరో రూ.500 కోట్లు: పొంగులేటి
రైతు రుణమాఫీ కోసం అవసరమైమే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్లతో పాటు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, మల్‌రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment