- మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల కిందే 2 లక్షల ఎకరాలు
- దేవాదుల కింద 58 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు
- జూన్ నాటికి 7.32 లక్షల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు కొత్తగా 2.61 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇందులో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగులోకి వచ్చినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా దేవాదుల ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు ఏర్పడిందని సాగునీటిశాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో సాగుయోగ్యమైన మొత్తం భూమికి నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 14 ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం పాత ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులూ పూర్తి చేస్తామని ప్రభుత్వం మొదటినుంచీ చెబుతూ వస్తోంది.
అయితే గతేడాదిలో పెద్దగా ఫలితాలు రాలేదు. 2014-15లో రూ.5,285.03 కోట్లు, 2015-16లో రూ.7,189.21 కోట్లను వ్యయం చేసింది. అయినప్పటికీ గతేడాది జూన్-జూలై నాటికి లక్ష్యంగా నిర్ణయించుకున్న 6 లక్షల ఎకరాల్లో 66,399 ఎకరాలకు మాత్రమే నీరందించగలిగారు. అయితే ఈ ఏడాది కాలంలో కొన్ని ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, సహాయ పునరావాస పనులు కొలిక్కి రావడంతో అదనంగా 1,95,200 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించగలిగారు. ఇలా మొత్తంగా ఇప్పటివరకు 2.61 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇందులో కల్వకుర్తి కింద 1.47 లక్షలు, నెట్టెంపాడు కింద 23,700, భీమా ప్రాజెక్టు కింద 21వేల ఎకరాల ఆయకట్టు వృధ్ధిలోకి వచ్చింది. అలాగే దేవాదుల కింద 58,899 ఎకరాలు, పాలెంవాగు కింద 5,500, కొమురంభీమ్ కింద 2 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. కాగా ఈ ఏడాది జూన్ నాటికి 8 ప్రాజెక్టులను పూర్తి చేయాలని, 11 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రణాళిక రూపొందించుకుంది. వీటి ద్వారా మరో 7,32,264 ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణయించింది.
కొత్తగా సాగులోకి 2.61 లక్షల ఎకరాల ఆయకట్టు
Published Fri, Mar 25 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement
Advertisement