పనులు చేయని వారికే పట్టం
సాక్షి, హైదరాబాద్: చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు మూడోదశ కాంట్రాక్టర్లపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రేమ కనబరుస్తోంది. అప్పగించిన పనులనే అర్ధంతరంగా ఆపేసిన కాం ట్రాక్టర్లకే మారిన డిజైన్, పెరిగిన అంచనాలతో కూడిన పనులను కట్టబెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత రూ.531 కోట్లు గా ఉన్న వ్యయ అంచనాలు మారిన డిజైన్ మేరకు రూ.1,349 కోట్లకు పెరగగా, ఆ పనులను కూడా టెండర్లు లేకుండానే అప్పగించేందుకు తాపత్రయపడుతున్నారు. దేవాదుల 3వ దశలో భాగంగా భీమ్‌ఘణపూర్ నుంచి రామ ప్ప చెరువును కలుపుతూ 49.6 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు వీలుగా టన్నెల్ తవ్వకానికి సంబంధించిన రూ.531.70 కోట్ల పనులను 2008లో 4 కాంట్రాక్టు సంస్థల కన్షార్షియంకు అప్పగించారు.
పనులను 2012 ఫిబ్రవరికి పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే పాలంపేట వద్ద టన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ వల్ల పక్కనే ఉన్న రామప్ప దేవాల యానికి పగుళ్లు ఏర్పడి దెబ్బతింటుందంటూ స్థానికులు అభ్యంతరాలు లేవనెత్తడంతో 2011 జూలై నుంచి పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ పరిశీలన జరిపి ఆలయంపై పేలుళ్ల ప్రభావం పెద్దగా ఉండదని, అయినా చారిత్రక ఆలయం అయినందున 900 మీటర్ల అవతలకు టన్నెల్ పనులను తరలించాలని సూచించింది. తర్వా త రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీ లించి చివరికి.. భీమ్‌ఘణపూర్ నుంచి రామ ప్ప చెరువు వరకు ఇప్పుడున్న దేవాదుల ఫేజ్-2 పంప్‌హౌజ్, పైప్‌లైన్ వ్యవస్థకి సమాంతరంగా పైప్‌లైన్ వేయాలని నిర్ణయించారు.
పనులు చేయని కాంట్రాక్టర్లకే...
ముఖ్యమంత్రి సూచన మేరకు టన్నెల్‌కు బదులుగా పైప్‌లైన్ ద్వారా పనులు చేపడితే మొద ట వేసిన వ్యయ అంచనా రూ.531 కోట్లను దాటి రూ.1,349.59 కోట్లు ఉంటుందని నీటిపారుదల శాఖ తేల్చింది. దీనిలో పైప్‌లైన్‌కు రూ.784.68 కోట్లు, పంప్‌హౌజ్‌కు రూ.11.52కోట్లు, హైడ్రో మెకానికల్ పనులకు రూ.10.47 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులకు 2.31కోట్లు, లేబర్ సెస్‌లకు రూ.266.91కోట్ల మేర అంచనాలు సిద్ధం చేశారు. తొలి అంచనాలతో పోలిస్తే పోలిస్తే రూ. 837 కోట్లు అదనంగా ఖర్చవుతుందని లెక్కలేశారు. ఈ పనులను పూర్తిగా మొదటి కాంట్రాక్టు సంస్థలకే అప్పగించాలని శాఖ ఇంజనీర్లు సిఫార్సు చేశారు.
నిజానికి 2008లో రూ.511 కోట్ల పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు 2011 వరకు మూడేళ్లలో కేవలం రూ.53.06 కోట్ల పనులు మాత్రమే చేశాయి. ఈ సంస్థలు అప్పటికే తీసుకున్న మొబిలైజేషన్ అడ్వాన్సులు మాత్రం రూ.53.17కోట్లు. కనీసం మొబిలైజేషన్ అడ్వాన్సుల మేర కూడా పని చేయలేదని కాంట్రాక్టు సంస్థలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వ స్థాయిలోనూ ఆగ్రహం వ్యక్తమైంది. అయినా మళ్లీ ఆ కాంట్రాక్టు సంస్థలకే రూ. 1,349 కోట్ల పనులు కట్టబెట్టాలని అధికారులు సిఫార్సు చే శారు. తొలుత టన్నెల్‌గా ఉన్న డిజైన్ పైప్‌లైన్‌గా మారినా, అంచనాల్లో భారీ వ్యత్యాసమున్నా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా, కొత్తగా టెండర్లు పిలవకుండా పాత సంస్థలకే అప్పగించాలనడం చర్చనీయాంశమైంది.